1. ఇల్లలకగానే పండగౌనా

 


 

ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి. చదువూ, సంధ్య తెలివీ, చాకచక్యం, సమయస్ఫూర్తీ, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి.

 

అమ్మాయి అందం తెలివీ, వాళ్ల నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళూ వేసి, ఓ ఇంటికి ఇల్లాల్ని చేసి, 'ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది' అని చెప్పేడు. ఆ ఇల్లాలు వెంటనే పయిట నడుముకి బిగించి, ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకుని, "నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి ముగ్గులు వెయ్యడంలో అంతకన్నా నేర్పరివి సెభాష్ కీప్ ఇట్ అప్" అని ఇంగ్లీషులో మెచ్చుకుని భుజం తట్టాడు.

దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి, ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది. ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలూ ఆరు ముగ్గుబుట్టలుగా - సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడా ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ “నా పేరేమిటి చెప్మా!" అనుకుంది. అలా అనుకుని ఉలిక్కిపడింది. చేతిలో అలుకు గుడ్డా, ముగ్గు బుట్టా అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తల గోక్కుంటూ, “నాపేరేమిటి--నా పేరేమిటీ!" అని తెగ ఆలోచించింది. ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డ్ వ్రేలాడుతోంది. మిసెస్ ఎం. సుహాసిని ఎం.ఏ. పిహెచ్. డి  ప్రిన్సిపాల్ 'ఎక్స్' కాలేజి అని- అవును అలాగే తనకీ ఓ పేరుండాలి కదా ఇలా _మర్చిపోయానేమిటి? ఇల్లలికే సంబరంలో పేరు మరిచిపోయాను- ఇప్పుడెలాగ అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఎలాగో ఆపూటకి ఇల్లలకడం కానిచ్చింది. అంతలో పనిమనిషి వచ్చింది--పోనీ ఆమెకైనా గుర్తుందేమోనని, "అమ్మాయ్ నా పేరు నీకు తెలుసా!" అని అడిగింది.

"అదేమిటమ్మా అమ్మగార్ల పేర్లతో మాకేమిటి పని మీరంటే మాకు అమ్మగారే! ఫలానా తెల్లమేడ క్రింద భాగంలో అమ్మగారంటే మీరు" అన్నది ఆ అమ్మాయి. “అవున్లే పాపం నీకేం తెలుసు" అనుకుంది ఇల్లాలు. పిల్లలు స్కూల్ నించి  మధ్యాహ్న భోజనానికి వచ్చారు. పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు. “ఓరే పిల్లలూ, నా పేరు మీకు తెలుసా?" అని అడిగింది. వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి

నువ్వు అమ్మవి --నీ పేరు అమ్మే --మేం పుట్టినప్పటినించీ మాకు తెలిసింది అదే నాన్నగారి పేరుతో ఉత్తరాలొస్తాయి. అయన్నంతా పేరుతో పిలుస్తారు గనుక మాకు తెలుసు నీ పేరు నువ్వు మాకెప్పుడు చెప్పలేదుగదా. పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు" "అనేసారు వాళ్ళు - అవును తనకెవరు ఉత్తరాలు రాస్తారు? అమ్మా నాన్న ఉన్నారుగానీ నెలకో రెండు నెలలకో ఓసారి ఫోన్ చేస్తారు -- చెల్లెళ్ళు అక్కలూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళు అలుక్కోడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు అంటే ఏ పెళ్లిలోనో పేరంటంలోనో కలిస్తే కొత్తముగ్గుల్ని గురించో - వంటల్ని గురించో మాట్లాడుకోడమేగానీ ఉత్తరాలు లేవు. ఇల్లాలు నిరాశపడింది గానీ ఆమెకి అశాంతి ఎక్కువైంది. తన పేరెలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది. అంతలో పక్కింటావిడ పేరంటం పిలవడానికొచ్చింది పానీ ఆవిడకేమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ

కిసుక్కున నవ్వేసి,

“మరే! మీ పేరు నేనడగలేదు—మీరు చెప్పాలేదు. కుడిచేతి వైపు తెల్ల మేడావిడ అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజరుగారి భార్య అనో లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడ అనో చెప్పుకుంటాం -- అంతే" అనేసింది ఆ ఇల్లాలు.

ఇంక లాభంలేదు--పిల్లల స్నేహితులు మాత్రం ఏం చెప్తారు. వాళ్ళకి కమలావాళ్ళ అమ్మ అనో, అంటీ అనో తెలుసు ఇక భర్తగారొక్కరే శరణ్యం. ఆయనకే గుర్తుంటే ఉండాలి. రాత్రి భోజనాల దగ్గర అడిగింది "ఏవండీ నాపేరు మర్చిపోయా నండి—మీకు గుర్తుంటే చెప్పరా?

భర్తగారు పెద్దగా నవ్వేసి "అదేమిటోయ్ ఎన్నడూ లేనిదివ్వాళ పేరు సంగతి ప్రస్థావిస్తున్నావు. నిన్ను పెళ్ళయిన్నాటి నుంచీ 'ఏమోయ్' అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు కూడా అలా పిలవకండి నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు. అందుకని నేనూ మర్చిపోయాను--ఇప్పుడేం? నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారుగదా" అన్నాడు. "మిసెస్ అన్నది అవేదనగా. మూర్తి కాదండీ వా అసలు పేరు నాక్కావాలి-ఎలాగిప్పుడు?"

"దానికేం పోనీ ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది" అని సలహా ఇచ్చాడు ఆయన. "బావుందండి.. మీ పేరు సత్య నారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావు అనో సుందరరావు అనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నాపేరే నాక్కావాలి" అన్నది-- "బాగానే ఉంది. చదువుకున్నావుగదా - సర్టిఫికెట్లమీద పేరుంటుంది గదా.. ఆ మాత్రం

కామన్ సెన్స్ లేకపోతే ఎలా, చూసుకో వెళ్ళి" అని సలహా ఇచ్చాడాయన మళ్ళీ-- ఇల్లాలు సర్టిఫికెట్లకోసం హోరాహోరీ వెతికింది --బీరువాలో పట్టుచీరెలు, షిఫాన్ చీరెలు నేత చీరెలు --వాయిల్ చీరెలు వాటి మాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ భరిణెలు, గంధం గిన్నెలు, వెండి కంచాలు, బంగారం నగలు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయేగానీ అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడలేదు. అవును.. తను పెళ్ళయిన తరువాత ఇక్కడికొచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు.

"అవునండీ నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు--నేను మా ఊరు వెళ్లి ఆ సర్టిఫికెట్లు వెతుక్కుని నా పేరు అడిగి తెలుసుకుని రెండు రోజుల్లో వచ్చేస్తాను" అని అడిగింది భర్తని. "బాగానే ఉంది పేరుకోసం ఊరెళ్ళాలా ఏం? నువ్వు ఊరెడితే ఈ రెండు రోజులూ ఇల్లెవరలుకుతారు?" అన్నాడు నాధుడు. అవును నిజమే మరి-- తనందరికన్న బాగా అలుకుతుందని గదా.. ఆ పని ఎవర్నీ చెయ్యనివ్వలేదు ఇన్నాళ్ళూ-- ఎవరి పన్లు వాళ్ళకున్నాయి. ఆయనకి ఉద్యోగం -- పిల్లలకి చదువులు-- వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకుని ఆవే ఆ పని చేస్తూ వచ్చింది--వాళ్ళకి అసలు చేతకాదుమరి--

అయినా పేరు తెలీకుండా ఎలా బ్రతకడం ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తురాలేదు గనుక సరిపోయిందిగానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది-- "రెండురోజులెలాగైనా కష్టపడండి...నే వెళ్ళి నా పేరు కనుక్కుని రాకపోతే బ్రతకలేకుండా ఉన్నాను" అని బ్రతిమిలాడి బయటపడింది ఇల్లాలు..

“ఏమ్మా ఇంతర్జంటుగా వచ్చావు? ఆయనా పిల్లలూ బావున్నారా? ఒక్కదానివే వచ్చావేం?" అని అమ్మా నాన్నా ఆప్యాయంగానే పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. వచ్చినవని వెంటనే గుర్తుకొచ్చి,

"అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా" అనడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు.

"అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మాయిని. నీకు బి. ఏ దాకా చదువు చెప్పించి యాభైవేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం- రెండు పురుళ్ళుపోశాం-- ప్రతి పురిటికీ ఆస్పత్రి ఖర్చులు మేమే భరించాం - నీకిద్దరు పిల్లలు. మీ ఆయనకి మంచి ఉద్యోగం --చాలా మంచివాడు కూడానూ --నీ పిల్లలు బుద్దిమంతులు"

“నా చరిత్ర కాదమ్మా... నా పేరు కావాలమ్మా నాకు... పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు"

"ఏమోనమ్మా ఈ మధ్యన అలమారల్లో పాత కాగితాలు, ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజుసామాన్లు సర్దించాం. కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటకమీద పడేశాం—రేపు  వెతికిద్దాంలే--ఇప్పుడు వాటికేం తొందర --హాయిగా స్నానం చేసి భోజనం కానియ్యమ్మా" అన్నది ఆ ఇల్లాలి తల్లి.

ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది కానీ నిద్రరాలేదు. ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గువేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని కష్టాలొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు.

తెల్లవారింది గానీ అటకమీద ఫైళ్ళలో సర్టిఫికెట్లు వెతకడం పూర్తికాలేదు. ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా అడిగింది- చెట్టునడిగి పుట్టనడిగి చెరువునడిగి తను చదివిన స్కూలు నడిగీ--కాలేజీనడిగి—అరచీ, అక్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తన పేరు సంపాదించింది -- ఆ స్నేహితురాలు తనలాగే, తనతోనే చదువుకుని తనలాగే పెళ్ళి చేసుకుని, తనలాగా బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా, ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరునూ--తన స్నేహితురాళ్ళ పేర్లనూ కూడా గుర్తుంచుకున్న వ్యక్తి-- ఆ స్నేహితురాలు ఈవిణ్ణి చూడగానే గుర్తు పెట్టి, "; హాయ్ శారదా! నా ప్రియమైన శారదా!" అని కేకలు పెట్టి కౌగిలించేసుకుంది. అప్పుడా ఇల్లాలిని దాహంతో ఆర్చుకుపోయి, ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్దపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లోపాసి బ్రతికించిన చందంగా-- బ్రతికించింది ఆ స్నేహితురాలు-

"నువ్వు శారదవి. నువ్వు మన స్కూల్లో టెన్త్ క్లాసులో ఫస్ట్ వచ్చావు. కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో  ఫస్టొచ్చావు. అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి. మనందరం పదిమంది  స్నేహితులం—వాళ్లందర్ని నేను అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉన్నాను--మేం ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం-- నువ్వొక్కదానివే మాకు అందకుండా పోయావు. చెప్పు ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు" అని నిలదీసింది ఆవిడ.

"అవును ప్రమీలా నువ్వు చెప్పింది నిజం. నేను శారదవే-- నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు”-- నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి. ఇంకేం గుర్తులేదు. నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది" అంది శారద అనే పేరుగల ఆ ఇల్లాలు.

శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్ళు తిరగదోడి తన సర్టిఫికెట్లు, తను వేసిన బొమ్మలు--పాత ఆల్బంలు అన్ని సాధించింది. తను స్కూల్లో కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది.

కొండంత సంతోషంతో ఇంటికి తిరిగివచ్చింది.

"నువ్వులేవు-- ఇల్లు చూడెలా ఉందో--సత్రంలా ఉంది. అమ్మయ్య నువ్వొచ్చావు ఇంక మాకు పండగేవోయ్" అన్నాడు. శారద భర్త.

ఇల్లలకగానే పండగకాదండీ--అవును గానీ ఇక నుంచీ నన్ను ఏమోయ్మోయ్ అనకండి నా పేరు శారద-- శారదా అని పిలవండి తెలిసిందా" అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్లింది - ఏ మూల దుమ్ము ఉందో ఎక్కడ సామాన్లు ఆర్డర్లో లేవోనని చాలా సీరియస్ గా వెతుకుతూ, డిసిప్లిన్ కోసం తపనపడే శారద రెండు రోజులుగా దులపని సోఫాలో హాయిగా చేరబడి, తను తెచ్చిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తూంది.

 

(ఉదయం వారపత్రిక 4 - 5 - 90.)

         

కామెంట్‌లు