5. గాంధారి రాగం

 



 

అతను తనపట్ల ఎంతో ప్రేమతో కొని యిచ్చిన ఆధునిక గృహపరికరాలన్నీ శుభ్రంగా తుడిచి, వాటి వాటి స్థానాల్లో అందంగా ఠీవిగా కనపడేలా వుంచి, చీమలతో, దోమలతో, బల్లులతో, బొద్దింకలతో హోరాహోరీ పోరాడి జయించి, మచ్చలేని మహా సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణిలా వెలిగిపోయే సరస్వతి, ఒకింత ప్రకృతి సిద్ధమైన చల్లనిగాలి కోసం వీధి వరండాలోకి వచ్చింది.

పల్చబడుతున్నా పచ్చ పచ్చగా వున్న ఎండ అప్పుడే నీళ్ళుపోసిన మొక్కలకు మెరుగుపెడుతున్నది. సాయంత్రపు గాలి, ప్రాణాన్ని సేదదీర్చేలా వుంది. గేటుకి వరండాకీ మధ్య గచ్చు చేసిన నడవలో స్నేహితురాలు రషీదాతో షెటిల్ ఆడుతోంది సరస్వతి కూతురు గీత. రషీదా ఆరిందాలా ఆడుతుంటే గీత బ్యాట్ పట్టుకోడం రాక తికమకపడిపోతోంది. రషీదా గేలి చేస్తోంది. గీత ఉడుక్కుంటోంది.

సరస్వతి మొహంలోకి వెచ్చని ఆవిర్లు వచ్చాయి. ఆవేశంగా రెండడుగులు నడవ వైపు వేసి ఉలిక్కిపడి మళ్ళీ వెనక్కి తిరిగింది. బాబీ వచ్చే వేళైంది, వాడు బాగా ఆకలిమీద వస్తాడు.

వాడికి ముందే చేసి వుంచిన చల్లారిపోయిన టిఫిన్లు నచ్చవు. వాడు వచ్చి టేబుల్ ముందు కూర్చోగానే పల్చటి దోసెలు వేడి వేడిగా వేసి పెట్టాలి. గీత ఆట కాగానే దానికి పెట్టాలి. గీత దోసెలు తినదు. చపాతీలు కావాలంటుంది. అందులోకి తెల్ల సెనగల కూర కావాలి సుబ్బారావు రాత్రిపూట భోజనం చెయ్యడు. చపాతీలు తింటాడు. ఇప్పుడే కాలిస్తే అతను విసిరేస్తాడు. చల్లారిపోయిన చపాతీలు గేదెలు కూడా తినవంటాడు. అంచేత ఇప్పుడు తను ముందుగా కొన్ని చపాతీలు గీతకి చేసి పెట్టి, తరువాత బాబీకి దోసెలు వెయ్యాలి. ఇంతపని పెట్టుకుని వీధి వరండాలో నిలబడి ఆవేశపడి పోవడం తగదు కదా! పిల్లలకి వేళ్లికి తిండి పెట్టకపోతే వాళ్ళు బాగా చదవలేరు. వాళ్ళ భవిష్యత్తంతా తను వాళ్ళకి సరిగ్గా వండి పెట్టడం మీదే వుంటుందంటాడు సుబ్బారావు. నిజమే కాబోలు అనుకుంటుంది సరస్వతి.

“వాహ్! క్యా ఖుష్బూ ఆంటీ!” అంటూ వంట ఇంట్లోకి వచ్చింది రషీదా.

అమ్మ ఏం చేసినా బ్రహ్మాండంగా చేస్తుంది. అందుకే మా నాన్నగారికి ఎవరింటికి వెళ్ళినా ఏం నచ్చదు" అంది గీత.

సరస్వతి ఏం మాట్లాడలేదు. ఇద్దరికీ చపాతీలు పెట్టింది. ఇంతలో బాబీ వచ్చేడు. వాడికి దోసెలు వేసింది. అమ్మని ఏమీ అడగక్కర్లేదు. 'అడగందే అమ్మయినా పెట్టదు' అంటారు గానీ ఆ మాట అబద్ధం. అమ్మని ఏం అడగక్క ర్లేదు. మనస్సులో అనుకుంటే చాలు, నోటి ముందు ప్రత్యక్షం.

ఒక్క బాబీకేమిటి! సరస్వతి అందరికీ అన్నీ అలాగే అమరుస్తుంది.

మాస్టర్ ఆఫ్ ది హవుస్ మిస్టర్ సుబ్బారావు. ఏడు గంటలకి వస్తాడా! అతను రాగానే తళతళలాడే స్టీలు గ్లాసులో, కాచి చల్లార్చి వడపోసి ఫ్రిజ్లో వుంచిన మంచి నీళ్ళు యిస్తుంది.

అతనొచ్చేసరికి ఇల్లు అద్దంలా వుంచుతుంది. అలా లేకపోతే అతను సరస్వతిని వెక్కిరిస్తాడు. ఎద్దేవా చేస్తాడు. ఆ మాటలంటే సరస్వతికి మొదట్లో చికాకు, ఇప్పుడు అసహ్యం. అందుచేత అతను నోరు విప్పే అవసరం రానీయదు. అతనొచ్చి సోఫాలో కూర్చోగానే ఫ్యాన్ వేస్తుంది.

అప్పుడప్పుడే ఫిల్టర్లో దిగిన డికాక్షన్లో మరిగే పాలు కలిపి, నురగలు కక్కే కాఫీని బోస్ చైనా కప్పులో పోసి తెస్తుంది. తెచ్చి ఒక నిముషం నిలబడుతుంది. ఆ కాఫీలో ఏ లోపం లేదని తేల్చుకున్నాక లోపలికి వెడుతుంది.

సుబ్బారావు ఇంటికి వచ్చే వేళకి, సరస్వతి మురికిచీరెలో పనిచేస్తూ వుండకూడదు. తనకి చపాతీలు కాల్చడం తప్పించి ఇంకే పనీ చేయకూడదు. అంతా పూర్తిచేసుకుని, మంచి చీరె కట్టుకుని వుండాలి. ఎనిమిదిన్నరకి అతను టెలివిజన్ పెడతాడు. అప్పటికి పిల్లల చదువులు పూర్తి కావాలి. సుబ్బారావు టెలివిజన్ వేసే సమయంలో సరస్వతి అక్కడే కూర్చుని,  అతను చేసే వ్యాఖ్యానాలు తనకి నచ్చినట్టు మొహం పెట్టాలి. పిల్లలకి హోమ్ వర్క్ చేయించడానికి, అర్థం కానివి చెప్పడానికి ఓ ట్యూషన్ మాస్టర్ వున్నాడు.

వాళ్ళ ర్యాంకులు దిగకుండా కాపాడడం అతని బాధ్యత.

సుబ్బారావు కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. అన్నీ తనమీదే వుంచుకోకుండా. పిల్లల చదువుల బాధ్యత ట్యూషన్ మాస్టరయితే, ఇల్లు శుభ్రంగా వుంచడం, రుచిగా శుచిగా వండి పెట్టడం, పొదుపు చెయ్యడం సరస్వతి బాధ్యత. ఎక్కువ మాట్లాడకుండా, స్నేహితుల్ని ఇంటి మీదకి తేకుండా, గంతులు పెట్టకుండా, చెప్పిన మాటవిని చదువుకుని ర్యాంకులు తెచ్చుకోవడం పిల్లల బాధ్యత. మరి సుబ్బారావుకే బాధ్యతలూ లేవా? అంటే వున్నాయి. పిల్లల్నీ సరస్వతినీ అదుపులో వుంచుకోవడం, తనకిష్టంలేని పనులు ఇంట్లో జరగకుండా చూసుకోడం, తన ఆధిక్యతని కాపాడుకోడం లాంటి గురుతరమైన బాధ్యతలు అతనికి కేటాయించుకున్నాడు.

గీత హోమ్‌వర్క్ పూర్తి చేసుకుని వచ్చి సోఫాలో తల్లి పక్కన కూర్చుంది. బాబీకి ఇంకా పూర్తి కాలేదు. వాడి లెక్క ఒకటి రాకుండా తిప్పలు పెడుతోంది. మాస్టారు నాలుగు రోజులుగా రావడం లేదు. బాబీ పుస్తకం తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు.

ఏం కావాలోయ్!” అన్నాడు సుబ్బారావు దయగా. "ఈ లెక్క రావడం లేదు" అన్నాడు బాబీ.

ఓహ్ ఈ భాగ్యానికే!” అన్నట్టు వాడి చేతులో పుస్తకం తీసుకుని ఒక నిముషం చూసి "అబ్బో గట్టిదేనే!" అని తేల్చుకుని మొహం గంభీరం చేసేసుకుని “అవునూ మీ మాష్టారు రాలేదా!" అన్నాడు గట్టిగా.

"మాస్టారి భార్య కన్నది. పాప పుట్టిందిట. నాలుగు రోజుల నుంచి రావడం లేదు" అంది సరస్వతి.

"బాగానే వుంది. కన్నది ఆవిడైతే ఈయనెందుకు రాకపోవడం. ఎవర్నీ అదుపులో పెట్టలేవు, ఊరికే డబ్బు లిప్పించేస్తావు. అవున్లే! నీకేం, సంపాదించేవాడికి తెలుస్తుంది" అని సరస్వతి మీద విసుక్కున్నాడు, లెక్క సంగతి తేల్చకుండా.

అది చేయడం అతనికి రాదని సరస్వతికి తెలుసు. బాబీకి కూడా తెలుసల్లే వుంది. అక్కడ్నుంచి జారుకున్నాడు. సుబ్బారావుకి వేడి వేడిగా చపాతీలు కాల్చడానికి సరస్వతి వంట ఇంట్లోకి వెళ్ళింది. తొమ్మిదిన్నర కల్లా అంతా భోజనాలకి రావాలని సుబ్బారావు నియమం పెట్టాడు.

బాబీ గొణుక్కుంటున్నాడు.

నాన్నకి రాదే గీతా. అందుకే అలా విసుక్కుంటారు, ఏం చెప్పరు. అమ్మేమో చదువు మర్చిపోయానంటుంది, ఎప్పుడూ పనే ఆవిడకి" అంటున్నాడు.

పిల్లలు బాగా చిన్నవాళ్ళుగా వున్నప్పుడు వాళ్ళ చదువులకి సరస్వతే సాయం చేసేది.. కానీ సుబ్బారావుకి అది నచ్చలేదు. "ఇన్ని పన్లు నువ్వు చెయ్యలేవు సరసూ, మాస్టారున్నారుగా  ఆయనే చూసుకుంటాడు. నీ పన్లు నువ్వు చేసుకుంటే చాల్లే అన్నాడు. 'నీ పన్లు' అంటే వంట చెయ్యడం వగైరాలు. పని మనుషులు వేధించినప్పుడల్లా సుబ్బారావు ఆమెకొక పనిముట్టుకొని ఇచ్చేవాడు.

నువ్వు కష్టపడలేవు సరస్వతీ! హాయిగా ఈ మిషన్తో బట్టలు ఉతుక్కో, దీంతో ఇల్లు చిమ్ముకో, దీనితో పప్పు రుబ్బుకో! పని మనుషుల మీద ఆధారపడకు" అనేవాడు.

చాకలి సరస్వతంత బాగా బట్టలు వుతుకదు. పనిమనిషి సరస్వతి అంత శుభ్రంగా ఇల్లు చిమ్మదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే ఇల్లు బావుంటుంది అని సుబ్బారావు సరస్వతిని ఎప్పుడు మెచ్చుకునేవాడు. రాను రాను సరస్వతికి తన పని తప్ప ఎవరు చేసినా నచ్చడం మానేసింది.

ఆ విధంగా సరస్వతి పిల్లల చదువులతో, తన చదువుతో బయటి ప్రపంచంతో సంబంధం పోగొట్టుకుని సంసార సరస్వతి అయిపోయింది. "అమ్మా! నాన్నగారు అంత చదివారు గదా! బాబీ లెక్క అడిగితే చెప్పకపోవడం ఏమిటి? నువ్వేమో ఆయన కన్న తక్కువ చదివి నాకోసారి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పావు కదా!" అంది గీత పడుకునే టప్పుడు.

"తప్పమ్మా! అలా అనకూడదు. నాన్నగారు పగలంతా కష్టపడి ఆఫీసులో పనిచేసి వస్తారుగదా! మళ్ళీ ఆలోచించాలంటే ఆయనకి ఎంత శ్రమో చెప్పు! ఆయనకి రాకపోవడం ఏమిటి? అంత ఉద్యోగం చేస్తుంటేనూ!" అని అప్పుడు సరస్వతి గీతకి చెప్పాలి, కానీ ఈ రోజు అలా చెప్పకపోయింది.

నాన్నగారు చాలా గొప్పవారు. ఆయన మనందరినీ ఇంత సుఖపెడుతున్నారు, అన్నీ కొనిస్తున్నారు, ఆయన్ని గౌరవించాలి, ఎదురు చెప్పకూడదు,  ఆయన చెప్పిన పని కిమ్మనకుండా చెయ్యాలి” అని ఎప్పుడూ సరస్వతి వాళ్ళకి చెబుతూ వుంటుంది. అలా చెప్పమని ఒకసారి సుబ్బారావు సరస్వతికి చెప్పాడు.

ఈ రోజు చెప్పలేకపోతోంది ఈ రోజే కాదు, గత కొద్ది కాలంనించి సరస్వతిలో అశాంతి చెలరేగుతోంది. అంతా పడుకున్నాక బాబీ లెక్కల పుస్తకం తీసింది. పదిహేడు సంవత్సరాలయింది. తనకీ దేవత సరస్వతికీ సంబంధం తెగిపోయి...

వెనక్కి, వెనక్కి, పదిహేడు సంవత్సరాల వెనక్కి... ఒక అరగంట, చీకట్లో తడుముకున్నట్టు తడుముకున్నాక సరస్వతికి ఆ లెక్క వచ్చేసింది. అంటే అంటే తను చదువు మర్చిపోలేదు. అవును. తనది బోలు చదువు కాదు. 'ఫండా' చదువు. మాథమాటిక్స్ మెయిన్లో డిగ్రీ కాలేజీ ఫస్ట్! యూనివర్సిటీలో ఫోర్త్ ర్యాంక్. "తెలివిగలదానిని, ఇంకా చదువు, పైకొస్తావు. పనికొస్తావు" కాలేజీ ప్రిన్సిపాల్ బహుమతి యిస్తూ దీవించింది.

కానీ ఆ దీవెన ఫలించలేదు.

"బాగానే వుంది సంబడం! ఈ చదువు చాల్లే... ఇంకా చదివితే నీకన్నా పై చదువుల వాడిని తేవాలి. దాంతో ఇంకా వయస్సు పెరుగుతుంది. కట్నం పెరుగుతుంది... నా వల్ల కాదమ్మా సరస్వతీ" అనేశాడు నాన్న.

సుబ్బారావు సంబంధం లక్షణమైన సంబంధం. కాస్త నల్లగా వుంటాడు. అయితే ఏమీ! బుద్ధిమంతుడు. ఒక్క వ్యసనం కూడా లేదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు. కొంచెం డల్గా కనిపిస్తాడు. ఏం ఫరవాలేదు- అతనికి నగరంలో ఎంత ఇల్లుందో తెలుసా? ఇప్పుడు కడితే పది లక్షలౌతుంది. వాళ్ళ వంశం పేరుప్రఖ్యాతులున్న వంశం కనుకే అతనికి ఈ ఉద్యోగం యిప్పించగలిగేడు వాళ్ళ నాన్న కాస్తో కూస్తో ఖర్చుపెట్టి... ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇప్పించుకోడం మాటలా! ఉద్యోగమూ మంచిది, ఇల్లూ వుంది, వ్యసనాలా లేవు. తండ్రికి పరపతి వుంది. ఇంకేమిటి కావాలి? కాస్త కట్నం కూడా తగ్గించారు. దీని అందం చూసి, (చురుకుదనం చూసి ఏం కాదు. అవన్నీ చిన్ననాటి సరదాలు పోనిద్దూ! ఆడదానికీ అందం, వినయం ముఖ్యం. జాతకాలు కూడా కలిశాయి. ఒడ్డున పడిపోయాం. అమ్మయ్య.)

"సరస్వతీ! నువ్యూ మీ ఆయనా కలిసి అలా తిరిగి రండి మహాబలిపురం, మద్రాసు, కంచీ, తిరుపతి, బెంగుళూరు, అవన్నీను... ఎలాగు కట్నం కాస్త మిగిలింది కదా. ఇంక ఈ డబ్బు తీసుకో" అని కూతుర్ని మెచ్చుకుని వాళ్ళిద్దర్నీ హనీమూన్ పంపించాడు సరస్వతి తండ్రి.

ఆ తేనె జుత్తు, నీలి కళ్ళమ్మాయి, వయొలెట్ ఫ్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సరస్వతి జడ చూసి మహా ముచ్చటపడింది. ఆమె కళ్ళ కాటుక, చేతుల గోరింటాకు, కాళ్ళ పారాణి, వెండి పట్టాలు అన్నీ పట్టి పట్టి చూసింది. సరస్వతీ, వయొలెట్ రాతి రథాల దగ్గర ఫోటోలు తీసుకున్నారు. చాలాసేపు మాట్లాడేసుకున్నారు.

నాతో  లండన్‌కి రండి మీ ఇద్దరూ" అని పిలిచింది వయొలెట్.

నేను రాను. కావలిస్తే నువ్వు వెళ్ళు" అన్నాడు సుబ్బారావు మూతి ముడిచేసుకుని. తను రాలేక పోయినందుకు ఏదో కుంటి సాకు చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంది సరస్వతి.

"నీక్కూడా ఈ ఫారెన్ వాళ్ళ పిచ్చి వుందన్న మాట,  పల్లెటూరి వాళ్ళలాగ లేకపోతే నీకే గొప్ప ఇంగ్లీషు వచ్చని ప్రదర్శనా? లేకపోతే ఏమిటి? ఆ పిల్ల వెంట పడ్డం నువ్వు?" అన్నాడు సుబ్బారావు.

అప్పుడర్థం అయింది సరస్వతికి. సుబ్బారావు వయొలెట్తో 'నో' 'ఎస్' తప్ప ఏం మాట్లాడలేడనీ, అతనికి ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడ్డం రాదనీ,  తను మాట్లాడ్డం యిష్టం లేదనీ...

మద్రాసులో సాయంత్రం బీచికి బయలుదేరుతూ, చుడీదార్ వేసుకుని జుత్తు లూజుగా వదిలేసింది. "ఈ డ్రెస్లు వేసుకోడం యిక మానెయ్యాలి నువ్వు. పెళ్ళయినాక మా చెల్లెళ్ళు మానేశారు. మా అమ్మా నాన్నా ఒప్పుకోరు, నాక్కూడా నచ్చవు" అన్నాడు. బెంగుళూరులో లాల్‌బాగ్ చూడ్డానికి వెడుతుండగా అనుకోకుండా గిరీష్ కర్నాడ్ కనిపించేడు. ఆయనంటే శ్రీ సరస్వతికి మహా గౌరవం. గబగబ వెళ్ళి పలకరించింది. తనని పరిచయం చేసుకుంది.

"మీరు గుర్తుపట్టలేదా! గిరీష్ కర్నాడ్- ఈయన 'తుగ్లక్' అని మంచి నాటకం రాశారు. మంచి నటుడు ఇంక..." అని ఆయాసపడిపోయింది సరస్వతి, సంతోషంతో తబ్బిబ్బు అయిపోయి.

"ఈ పిల్ల చేష్టలు మానెయ్యాలి. నీకు పెళ్ళయిందని జ్ఞాపకం వుందా, లేదా! ఇంకనుంచి నువ్వు ఎవరితోబడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నేనెవరితో మాట్లాడితే, నువ్వు వాళ్ళతోనే మాట్లాడాలి” అన్నాడు సుబ్బారావు. పబ్లిక్ ఫిగర్స్ గురించి కూడా అతనికి తెలీదన్నమాట! హోటల్‌కి వెళ్ళడానికి చేయివూపి టాక్సీ పిలిచింది సరస్వతి.

అదే వద్దన్నాను. ఏం తొందర వెనక మగవాణ్ణి నేనుండగా!"

హనీమూన్ అయిపోయింది. సుబ్బారావు అర్ధం అయ్యాడు సరస్వతికి. సుబ్బారావు తనకన్న ఓ డిగ్రీ ఎక్కువే చదివాడుగానీ, అతని చదువు ఉద్యోగం తెచ్చుకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదు. అతనికున్నది డిగ్రీ మాత్రమే. ఇంకే చదువూ లేదు. సరస్వతికన్నా తనే తెలివైన వాడిలాగాను, తెలిసినవాడిలాగానూ, పెద్దవాడిలాగానూ, రక్షకుడి లాగానూ కనిపించాలని సుబ్బారావు అభిలాష.

పోన్లే సరస్వతీ! ఇప్పుడు నువ్వు ఒక బాధ్యతగల గృహిణివి. ఇల్లు చూసుకో, పిల్లల్ని చూసుకో. అదీ ముఖ్యం ఏ ఆడదానికైనా ఏం కావాలి చెప్పు! వున్న డబ్బుతో సుఖంగా బ్రతకడం, అన్నీ అమర్చుకోడం, కాస్త వెనకేసుకోడం, ఇదీ ముఖ్యం. గుర్తుపెట్టుకో సరస్వతీ! పైథాగరస్ థీరమ్ గుర్తు పెట్టుకుని ఏం చేస్తావ్! ఆల్జీబ్రా లెక్కలు నీ సంసారంలో తగాదాలు తీరుస్తాయా? ఏదో గవర్నమెంటువారు పద్దెనిమిదేళ్ళు నిండితేగానీ పెళ్ళి చెయ్యొద్దన్నారు గదా అని చదువుకుంటూ కాలక్షేపం చేశావు. చదువు చెప్పించినందుకు వాళ్ళ పేరు నిలబెట్టి మంచి మార్కులు తెచ్చుకున్నావు. బహుమతులు సంపాదించావు. అవ్వన్నీ ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు సంసారం చూసుకో సరస్వతీ! అదీ ముఖ్యం! అతని కనుసన్నలలో మెసలి, అతన్ని మెప్పించుకో.  అదమ్మా కావాల్సింది.

సుబ్బారావు మంచివాడు.

అవును. సుబ్బారావు మంచివాడే! అతని ఇంట్లో, పది లక్షలు విలువచేసే పెద్ద ఇంట్లో తన మెడల్సుకీ, కప్పులకి, షీల్డులకి చోటులేదన్నవాడు. అవ్వి పుట్టింట్లోనే వుండనిమ్మన్నవాడు.  

సుబ్బారావు మంచివాడే. తన లెక్కల్ని చాకలి పద్దులకీ పాల లెక్కలకీ పరిమితం చేసినవాడు.

సుబ్బారావు మంచివాడు కాడని ఎవరన్నారు? ఇంటెడు పనిముట్లు కొనిపెట్టాడు. ఆ పనిముట్ల మద్య, షడ్రుచుల శాక పాఠాల మధ్య, గుడుగుడు గుంచం గుండేరాగం ఆడిస్తున్నవాడు.

గుండెలో రాగం వినలేనివాడు. గుండె రగిలించే రాగం పాడుతున్నవాడు. తనచేత గాంధారి రాగం పాడిస్తున్నవాడు.

"ఏమ్మా! ఈవిడింత తెలివి తక్కువదేమిటీ? గుడ్డి మొగుడికి దారి చూపించాల్సింది. పోయి,  తనూ గుడ్డితనం తెచ్చిపెట్టుకుంది. ఇద్దరూ తడుముకుంటూ పడి తల పగలగొట్టుకోరా?"అంది సరస్వతి. కాలేజిలో చదువుకునేటప్పుడు ఒకసారి అమ్మతో “తప్పమ్మా, అలా అనకూడదు. ఆమె మహా పతివ్రత. తన భర్తకి లేని కంటిచూపు తనకెందుకని త్యాగం చేసింది. వాళ్ళకి తడుముకునే ఖర్మమేముంది. మహారాజులు... దాసీలే తెచ్చి చేతికిస్తారన్నీ. వాళ్ళే నడిపిస్తారు” అని తన తరపున చెంపలు వేసుకుందావిడ. త్యాగమో, కసో, ఆశక్తితో, ఏదైనా మహా పతివ్రతల్నించీ దేశాన్ని రక్షించాల్సిందే.

ఇలా కళ్ళని చిదిమేసి, జన్మ జన్మల అంధత్వాన్ని వారసత్వం చేస్తున్న గాంధారి గంతలు యిమడడంలేదు తన మొహం మీద కొంత కాలంగా విప్పెయ్యాలనే బలమైన కోరిక గుండెలో నుంచి తన్నుకు వస్తోంది.

సక్కుబాయికి ఏ దేవుడో పిండి విసిరి పెట్టినట్టు నాకు లెక్క చేసి పెట్టాడేవ్ గీతా! అని గంతులు పెడుతున్నాడు బాబీ.

మళ్ళీ సాయంత్రం రషీదా ఆడడానికి వచ్చింది-

"గీతా ఇలారా” అని పిలిచింది సరస్వతి వరండాలో నిలబడి.

"అబ్బ ఉండమ్మా!” అంది గీత రాకుండా.

అవును. అమ్మ పిలిచిందంటే ఏదైనా తినడానికి రమ్మని, లేకపోతే 'ఆట చాలు ఇక లోపలికి పోయి చదువుకో' అని, లేకపోతే "నాన్నగారొచ్చే వేళైంది. గంతులు పెట్టకు" అని చెప్పడానికి అనుకుంటుంది గీత.

అందుకే సరస్వతి గీత దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలో బ్యాట్ అందుకుని "ఇలా ఆడాలి చూడు! బ్యాట్ ఇలా పట్టుకోవాలి. షెటిల్ని కొట్టాలి-ఇదుగో- ఇలా సర్వీస్ చెయ్యాలి' అని చూపించింది.

గీత అపనమ్మకంగా చూసింది తల్లివైపు.

"నాతో ఆడు ఆంటీ!" అంది రషీదా.

పదిహేడు సంవత్సరాలుగా ఇంటి చాకిరీ తప్ప మరో న్యాయామం ఎరుగక ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయిన వళ్ళు, ఆమెని అడుగు ముందుకు వెయ్యనివ్వలేదు. ఆయాసపడుతూ కూలబడిన ఒకప్పటి గర్ల్స్ స్టేట్ షెటిల్ ఛాంపియన్ సరస్వతి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సరస్వతి లేచి నిటారుగా నిలబడింది.

"రేపటినుంచీ నేనూ ఆడతాను” అని గిరుక్కున తిరిగి ఇంట్లోకి వెళ్ళింది.

 

(ఆంధ్రజ్యోతి - ఆదివారం సంచిక 6-3-1994)

       

కామెంట్‌లు