10. దేవుడు

 

 

మా ఆయన సద్గుణ సంపన్నుడనీ, నన్ను భార్యలా కాక స్నేహితురాల్లా చూసుకుంటాడని నాకు అన్ని విధాలా సహకరిస్తాడనీ, నిజంగా అతను నా పాలిట దేవుడేననీ మా కొలీగ్స్ చాలామందే కాకుండా మా చుట్టాలు కూడా అంటూ వుంటారు.

వాళ్ళలా అన్నప్పుడు నిజంగానే నాకు కాస్త గర్వంగా వుంటుంది. ఎందుకంటే నిజంగానే కృష్ణమూర్తి మంచివాడు.

చాలామందిలా తనకి తాగుడు లేదు. సిగరెట్లు కాల్చడు. ఆఫీసునుంచి వస్తూ కూరలూ సరుకులవీ తెస్తాడు. పాపతో హెూంవర్క్ చేయిస్తాడు. నేను వంట చెయ్యడానికి బద్దకించిన రోజున ఆవకాయ, పెరుగుతో సరిపుచ్చుకుంటాడు. నన్ను 'ఏమే! వ్రాసే' అనడు. నేనతన్ని పేరుపెట్టి పిలిచినా వూరుకుంటాడు. అతని ఆలోచనలు, అతని పథకాలు వాకు అమితంగా నచ్చుతాయి. ఆఖరికి నేను ఉద్యోగం ఎలా చేయాలో కూడా అతనే చెబుతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అతనే నాకు నేర్పాడు. అతను అవన్నీ నేర్పకపోతే అమాయకంగా ఏ ప్రమాదం కొనితెచ్చుకుంటానోనని అతని బెంగ. “నువ్వొట్టి అమాయకురాలివి”అని అతను అంటూ వుంటే, నిజంగా నా భారం   అతని మీద వేసి నేను సుఖంగా, ఆలోచించనవసరం లేకుండా బతకగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నిజానికి నాకు ఆలోచించే అవసరం వుండదు. నా బదులు అతనే ఆలోచిస్తాడు.

ఇలా మా జీవితం సుఖంగా సాగిపోతున్న తరుణంలో ఓ సాయంత్రం అకస్మాత్తుగా రిక్షా దిగి, పెద్ద సూట్‌కేసుతో లోపలికి వచ్చింది వసంత. వసంతని గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది, పచ్చని ముద్దబంతిపువ్వులా వుండే వసంత ఎండు వేపుపుల్లలా వుండడంతో. చాలా కాలం తరువాత కలుసుకున్నందుకు సంతోషించి ఆమెని కృష్ణమూర్తికి పరిచయం చేసేను. ఇద్దరం చిన్నప్పుడు మా వూరి జిల్లా పరిషత్ హైస్కూల్లోను, తరువాత గుంటూరు వుమెన్స్ కాలేజిలో కలిసి చదువుకున్న సంగతి చెప్పాను. బహుశా పుట్టింటి నుంచి తన ఇంటికో, తన ఇంటి నుంచి పుట్టింటికో వెడుతూ దారిలో ఆగినట్లుంది. ఏమైనా ఆమె ఇలా రావడం నాకెంతో సంతోషం కలిగించింది... నేనీవూరు వచ్చి ఓ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాక నా స్నేహితురాలంటూ ఎవరూ వచ్చి రెండు రోజులుండ లేదు, అందుకని.

ఇద్దరం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూండగా అడిగేను. “ఎక్కడనించి ఎక్కడికివెడుతూ ఇక్కడ దిగావ్!” అని.

"మా నాన్న ఇంటినుంచి వస్తున్నాను. ఇక్కడికే వచ్చాను. ఏం? ఇంత సూట్‌కేసుతో వచ్చానవా? అంది. సాధారణంగా అందరూ పుట్టింటినించి అనో, అమ్మగారింటినించి అనో అంటారు. ఇలా నాన్న ఇంటినించి అనరు. "నువ్వు పదిరోజులుంటే సంతోషం కాదా? అలా మాట్లాడకు" అన్నాను. తను వచ్చిందని నాలుగు రోజులు సెలవుపెట్టేను. వసంత వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది. గడిచిన రోజులు, అప్పటి ఊహలు, అప్పటి మాటలు, అప్పటి అల్లరి అన్నీ గుర్తు వచ్చి మళ్లీ పదేళ్లు చిన్నదాన్ని అయినట్లు అనుభూతి పొంచేను. ఇలా అప్పుడప్పుడూ స్నేహితులని కలుసుకోకపోతే సంసారంతో పడి యంత్రాల్లా బతికి, త్వరగా వృద్ధులం అయిపోతాం అనిపించింది. కానీ వసంత సంతోషంగా కనిపించలేదు. చాలా ముభావంగా వుంది. నవ్వడం లేదు, నవ్వకుండా అసలు మాట్లాడేదే కాదు పూర్వం.

ఆ రాత్రి కృష్ణమూర్తి అడిగేడు "ఏమిటి నీ ఫ్రెండ్ ఎన్నాళ్లుంటుందీ! అంత సూట్‌కేసుతో వచ్చింది?" అని. అతనలా అడగడం నాకు బాధగా అనిపించింది. మాట్లాడకుండా వూరుకున్నాను. అదే రోజు సాయంత్రం మా అమ్మ కూడా వచ్చింది. అమ్మకి వంట్లో బాగున్నట్లులేదు. జ్వరం కూడా వుంది. అమ్మ, మావూల్లో ఒక్కతే వుంటుంది. ఇల్లు రెండు భాగాలు అద్దెకిచ్చింది. ఆ అద్దెలు వసూలు చేసుకుని తన ఖర్చు గడుపుకుంటూ వుంటుంది. నాన్నగారి ప్రావిడెంటుఫండ్ వగైరా డబ్బు బ్యాంక్‌లో వుంది. దానిమీద వడ్డీ వస్తూ వుంటుంది. ఆవిడకి ఆర్ధికంగా ఏ లోటూ లేదు. అయినా వంటరిగా వుంటుంది.

"మీ అమ్మ మీ అన్నయ్య దగ్గర వుండక అలా ఒక్కతే వుండడం ఎందుకూ?" అంటూ వుంటాడు కృష్ణమూర్తి. నేనూ అది నిజమే అనుకుంటాను. అమ్మ మా ఇంటికి తరచూ వస్తూ వుంటుంది. వచ్చేటప్పుడు నాకోసం పచ్చళ్లు, పొడులూ, పిండివంటలు తెస్తూ వుంటుంది. పాపని చూడకుండా ఆవిడ వుండలేదు. మా పాపకి ఆవిడ దగ్గర చాలా మాలిమి. అమ్మ కూడా పది రోజులుంటే కృష్ణమూర్తికి ఇష్టం వుండదు. అంచేత ఆవిడ వెళ్లిపోతానంటే నేను మాట్లాడను. అతనితో అభిప్రాయభేదాలు తెచ్చుకోవడం, ఘర్షణ పడడం నాకిష్టం వుండదు. ఏ తల్లి తన ఆడపిల్లల దగ్గర వుంటుంది. గనుక తల్లితండ్రులు వుండవలసింది. మగపిల్లల దగ్గరే! అని నేనూ నమ్మాను.

నువ్వు ఆఫీసుకి వెళ్లిపో సుమతీ! అమ్మ నాకు తోడు వుంటుందిగా. ఆవిడకి నేను తోడుగా వుంటాను. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటాం” అంది వసంత. నాకూ ఆమె సలహా నచ్చింది.

సాయంత్రం నేను ఆఫీసునుంచి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా సర్దింది. పాపకి స్నానం చేయించింది. నాకు టిఫిన్ కూడా పెట్టింది. రాత్రికి వంట సిద్దం చేసింది. "ఇదంతా ఎందుకు చేసేవు వసంతా! నేను వచ్చి చూసుకుంటాను గదా! అన్నాను నొచ్చు కుంటూ. "ఈ పనంతా అక్కడ నాకు అలవాటే! ఇంతకన్నా ఎక్కువ పని చేస్తాను" అంది. 'అక్కడ' అంటే తన ఇంట్లో. వసంత పొరపాటున కూడా నా ఇల్లు అనదు. అక్కడ అంటుంది.

భోజనాలయ్యాయి. అందరూ పడుకున్నాక, నేను వసంత వరండాలో కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. ఆమె నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకుని, అందుకు సిద్దంగా కూర్చున్నాను.

వసంత చెప్పడం ప్రారంభించింది. చాలా గంభీరంగా, ఒక్క కన్నీటి బొట్టు కార్చకుండా ఎంతో నిబ్బరంగా చెప్పింది. నేను విన్నాను. విన్నంతసేపూ పమిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూనే వున్నాను. చెప్పడమే కాదు. వీపు మీద దెబ్బల తాలూకు కమిలి పోయిన గుర్తులు చూపించింది. నిద్రలేని రాత్రులు కళ్లకింద వేసిన నల్లని చారలు చూపించింది. కన్నీరు.. కార్చి కార్చి వట్టిపోయిన పొడి కళ్లే అందుకు సాక్ష్యం. ఈ హింస కట్నం కోసం కాదు.

కొంత భార్యని హింస పెట్టకపోతే ఎలా? అనే స్వభావసిద్ధమైన హింస, కొంత ఆమె మీద అనుమానంతో జరిగే హింస, ఆమెంటే రవంత ప్రేమలేదు. కరుణ లేదు. స్నేహం అసలులేదు. అలాంటప్పుడు ఆమె శరీరం మాత్రం ఏం అవసరం? కానీ ఆమె మీద తన ఆధిక్యత చాటుకోడానికి ఆమె శరీరం కూడా అతనిది. అతనిష్టం. అలాంటి అవమానాల్లోంచి, అసహ్యంలో నుంచీ, హింసలో నుంచీ ఇద్దరు పిల్లలు లోకంలోకి వచ్చారు. కానీ ఆ పిల్లల్ని ఆమె ఎంతో ప్రేమించినా, ఆ పిల్లల్ని కూడా ఆమె దగ్గరికి రానివ్వడు. ఆమె మీద పిల్లలికి కూడా. అసహ్యం కలుగజేస్తాడు. బతుకు దినదినగండంగా మారింది. అక్కడ వుండలేనని అమ్మతో చెప్పింది. అమ్మ నాన్నతో చెప్పింది. నాన్న రమ్మనలేదు. అమ్మా, నాన్నా, అన్నయ్యా అంతా వసంత అసమర్థతని వేలెత్తి చూపారు. మంచి భోజనం పెట్టి, వినయవిధేయతలు ప్రదర్శించి, అందచందాలు చూపించి భర్తని లొంగదీసుకోలేని చవట అన్నారు. అమ్మ చెప్పింది. వినయంగా, విధేయంగా వుండి తను నాన్నగారితో ఇన్నేళ్లు బతకబట్టే, తన పిల్లలు సుఖంగా వున్నారని, విడాకులూ, విడిపోవడాలూ మన వంశంలో లేవని తేల్చారు. భగవంతుడిని నమ్ముకుని అతన్ని మంచి చేసుకోవడానికి ప్రయత్నించమన్నారు. ఓపిగ్గా బతకమన్నారు. షిరిడీ సాయిబాబా విభూతి ఇచ్చి రోజూ రాత్రివేళ మొహానికి పెట్టుకోనున్నారు.

కనకదుర్గ అమ్మవారి పూజ కుంకం ఇచ్చారు. ఆచారి గారి దగ్గర రక్షరేకు తెచ్చిచ్చారు. ప్రతి శనివారం తన కోసం అమ్మ ఉపవాసం చేస్తానంది. తన సంసారం బాగుపడితే ఆ స్వామికి కల్యాణం చేయిస్తానంది. ధైర్యంగా వుండమంది. నాన్న ఆరు వందలు పెట్టి సిల్కు చీర తెచ్చేరు, అన్నయ్య సినిమాకి తీసుకువెళ్లేడు. అమ్మ లడ్లు, అరిసెలూ చేసిచ్చింది. అన్నయ్య తీసుకువెళ్లి దింపి వచ్చాడు. అమ్మ చెప్పిన వినయం, విధేయత, అందం, భోజనం అన్నీ తనని మరింత లోకువ చేశాయి. హింస మరింత పెరిగింది. అనుమానం పెనుభూతం అయింది. మళ్లీ వెళ్లింది పుట్టింటికి కాదు. నాన్న ఇంటికి. మళ్లీ ఆవే బోధలు, మళ్లీ అవే మాటలు. ఈసారి నాన్న వచ్చి దింపుతానన్నారు. అక్కర్లేదు నేనే వెడతానని బయలుదేరి ఇక్కడ దిగింది. ఇది ఈమె కథ. “గాడిదకి చాలా ‘ఓర్పంటారు.. నే గాడిద కన్నా ఎక్కువ ఓర్పు వహించాను. దాని కన్నా హీనంగా బతికాను. కానీ ఇంక నావల్ల కాదు. నేనేం తప్పు చేశానని అలా శిక్ష అనుభవించాలి? నాకు చావొక్కటే మార్గం ఇందులో నుంచి తప్పించుకోడానికి! కానీ నాకు చావాలని లేదు. నా పిల్లల్ని తెచ్చుకుని ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలని వుంది. అందుకు నువ్వు సాయం చేస్తావని వచ్చాను" అంది.

"అయ్యో! నీకు సాయం చేయడం నా విధి వసంతా! వినడానికే కష్టంగా వుంది. నువ్వెలా భరించావో ఏమో!" అని ఆమెని ఓదార్చేను.

"మన స్నేహితురాళ్లందర్లోకీ నువ్వు మంచి స్థితిలో వున్నావు. మీ ఆయనతో సమానంగా సంపాదిస్తున్నావు. అతను నిన్ను బాగా చూస్తాడు. నువ్వే నన్ను ఒక దారికి చేరుస్తావనే నమ్మకంతో వచ్చాను. నాకేదైనా చిన్న ఉద్యోగం చూసిపెట్టు. పిల్లల్ని తెచ్చుకుని ఎలాగో బతుకుతాను" అంది.

"తప్పకుండ చూద్దాం. రేపు కృష్ణమూర్తికి అంతా చెబుతాను. అతను ఒక మార్గం చూస్తాడు. నువ్వు హాయిగా వుండు. పని దొరికే దాకా ఇది నీ ఇల్లే అనుకో" అన్నాను. మరునాడు ఉదయం ఆమె మొహం తేటగా కనిపించింది. కావాలని ఇంటి పనంతా భుజం పైన వేసుకుంది. నేను వారిస్తే,

"అక్కడ ఇంతకన్నా పదిరెట్లు పని చేసేదాన్ని. కానీ రవంత ఆదరణ లేదు. నువ్వు నాకు పునర్జన్మనిస్తున్నావు. నీ ఋణం ఎలా తీర్చుకోను? ఈ పని నాకేం కష్టంలేదు. నీకు తెలీదు సుమతీ... అక్కడ నేనెలా చాకిరీ చేసేదాన్నో, ఏ చిన్నలోటు వస్తే ఉద్యోగం లోంచి తీసేస్తారో, నోటి దగ్గర కూడుపోతుందని దిక్కులేనివాళ్లు భయపడుతూ, వణికిపోతూ ఉద్యోగం చేసినట్లు నేనక్కడ పని చేసేను. ఇక్కడ నా ప్రియస్నేహితురాలికి కొంచెం సాయపడుతున్నానంతే. కాదనకు" అంది. ఆ సాయంత్రం వసంత కథంతా కృష్ణమూర్తికి చెప్పాను.

ఆమె నాకెలా చెప్పిందో నేనూ అలాగే చెప్పాను. అయితే నాలా అతను కళ్లు తుడుచుకోనూ లేదు, కదిలిపోనూ లేదు. "అదన్నమాట ఆవిడ రాకకి కారణం. బాగానే వుంది దారినపోయే తద్దినాన్ని నెత్తికి చుట్టుకోకు. ఇలాంటివి జరుగుతూనే వుంటాయి. కొత్తం వుంది. అయినా తల్లికీ, తండ్రికీ లేని దుగ్ధ నీకేమిటి! అందుకే నువ్వొట్టి అమాయకురాలివన్నాను. చెప్పిందంతా నమ్మేశావు. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఈవిడేం చేసిందో అతనంత క్రూరంగా ప్రవర్తించడానికి. నా మాట విని వాలుగు మంచి మాటలు చెప్పి. మీ అమ్మతో పాటు మీవూరు పంపించు. వాళ్ల అమ్మానాన్న చూసుకుంటారు" అన్నాడు.

నేను తెల్లబోయాను. ముంచుకొచ్చిన నల్లటి మబ్బుని ఒక్క గాలి తెర తేలిపోయేలా చేసినట్లు అతని మాటలకి మొదటి సారిగా నేను తెల్లబోయాను. మొదటిసారిగా ఆ మాటలు నాకు చేదుగా అనిపించాయి. అసలింతవరకూ నేనతనికి ఎదురు సమాధానం చెప్పి వుండలేదు. వాదించలేదు. ఊ అనడం మాత్రమే నాకు తెలుసు. అతనికి ఎలా చెప్పాలో నాకు అర్ధం కాలేదు. వసంత చెప్పిందంతా నిజం. అబద్ధం కాదని అతనిక్కూడా తెలుసునని నాకనిపించింది. అతనిలా మాట్లాడ్డం నాకు చాలా అవమాన కరంగా తోచింది. అమ్మ పుట్టెడు జ్వరంతో వచ్చింది. ఆమెని కూడా పంపించమంటున్నాడు. నా మనస్సు చివుక్కుమంది.

నా ప్లీడర్ స్నేహితురాలు రాజేశ్వరితో వసంత విషయం చెప్పాను. ఆమె వసంతకెక్కడైనా చిన్న పని చూస్తానని వాగ్దానం చేసింది. నేను ఆఫీసుకి వెళుతున్నాను. వసంత అమ్మతో కాలక్షేపం చేస్తోంది. నేను వద్దన్నకొద్దీ ఇంటి చాకిరి అంతా నెత్తిన వేసుకుంది. ఆమె వచ్చి పది రోజులైంది. కృష్ణమూర్తి ప్రవర్తనలో మార్పు నేను స్పష్టంగా గమనించాను. అతను చీటికీమాటికి పాపనీ, నన్నూ విసుక్కోడం గమనించాను. వసంతని పంపలేదని అలా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకున్నాను. నేను వసంతని పంపలేను.

ఆ రాత్రి అందరం భోజనంచేస్తుండగా "నేను చేసిన కూర ఎలా వుంది కృష్ణమూర్తిగారూ! గుత్తి వంకాయంటే మీకు చాలా ఇష్టంట కదా!" అంది వసంత. "బావుంది" అన్నాడు చాలా ముభావంగా, ఏ భావమూ లేని చెక్కముక్క లాంటి మొహం పెట్టి. "మీ ఇంట్లో వంటకి పెట్టుకోండి నన్ను జీతం ఇవ్వకపోయినా ఫరవాలేదు. తిండి పెట్టి వుండనిస్తే చాలు" అంది కొంచెం హాస్యంగానే

"అదేం మాటమ్మా!" అని అమ్మ అంటూండగానే "మాకు వంట మనుష్యుల్ని పెట్టుకునే స్థోమత లేదండీ! ఇద్దరం సంపాదిస్తున్నాం అన్నమాటేగానీ అన్నీ అప్పులే" అనేశాడు.

నేను వసంత మొహం చూడలేకపోయేను. అవును మాకన్నీ అప్పులే. చిట్ ఫండ్స్, పేర్లు, రికరింగ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సులు, ఇవన్నీ అతనికి అప్పులకింద లెక్క. ఒక స్నేహితురాలు. ప్రాణసంకటంలో వుండి నా దగ్గరకొచ్చి పదిరోజులుంటే అతనికి అప్పులైపోతాయి. ఇతనేనా నా పతిదేవుడు? నా కొలీగ్స్‌కి, చుట్టాలకి అందరికీ నా పట్ల అసూయ కలిగించినవాడు, ఇన్నాళ్లూ నా హృదయంలో అత్యున్నత స్థానం ఇచ్చి హీరో వర్షిప్ చేయించుకున్నవాడు, ఇలా మాట్లాడు తున్నాడేం ఇతను ! మేం ఇద్దరం ఒకటేనన్నవాడూ, ఇద్దరి డబ్బూ ఒకటేనన్నవాడు. నా ఆనందం, నా అభివృద్ధి, నా శ్రేయస్సు కోరే మొదటి వ్యక్తి అయినవాడు, నాకు చిలుక పలుకులు నేర్పినవాడు, నడకలు నేర్పినవాడు, ఇతనే! సందేహం లేదు. నా మనస్సునిండా వర్షాకాలపు నల్లమబ్బులు కమ్ముకున్నాయి. అవి వర్షించకపోతే ఆ బరువు నేను మోయలేనని పించింది. నాకు ఏడవాలనిపించింది. భోజనాలయిన తరువాత అతను మళ్లీ నాకు చెప్పాడు..

 "వసంతని పంపించెయ్! ఆమె ఇక్కడుండడం మంచిది కాదు. రేపు సెలవు పెట్టి, సినిమా చూపించి, ఒక చీరె పెట్టి మీ అమ్మకిచ్చి పంపు"

"అమ్మకి జ్వరంగావుంది. ఆమె ఇక్కడ నాలుగు రోజులు వుండడానికి వచ్చింది" అన్నాను ధైర్యం కూడదీసుకుని.

"ఆవిడ మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి వుండవచ్చుగా! ఒక్కతే ఎందుకిక్కడ" అన్నాడు విసుక్కుంటూ.

నేనేం మాట్లాడలేదు. తెల్లవారి పళ్లు తోముకుంటూ ఆలోచిస్తున్నాను. వసంతనీ పంపలేను. అమ్మనీ పంపలేను. కృష్ణమూర్తి కోపాన్ని భరించలేను. ఇంతవరకూ అతని కోపాన్ని నేనెప్పుడూ చూడలేదు. కోపం రావడానికేం వుంది. అతనిష్ట ప్రకారమే నడుస్తూ వచ్చాను. నేనలా ఆలోచిస్తూ వుండగా వరండాలో నుంచి దినపత్రిక విసురుగా వచ్చి నా మొహాన పడింది. అంత విసురుగా అది వచ్చి నా మొహాన పడిందంటే అందులో ఏదో సంచనలం వుందన్నమాట.

 అవును వుంది.

వసంత అనబడే ముప్పై సంవత్సరాల వివాహిత మతిస్థిమితం లేక విడిచి వెళ్లిపోయింది. సన్నగా పొడుగ్గా వుంటుంది. కోల మొహం. పెద్ద కళ్ళు, తెలుగూ, ఇంగ్లీషూ మాట్లాడుతుంది. ఆచూకీ తెలిసినవారు ఫలానా అడ్రసుకు తెలియజేయాలి. బహుమతులేం లేవు వసంత ఫొటో... పెళ్లివాటి దండల ఫొటోలో సగం.

"నీకు మతిస్థిమితం లేదటగా!" అని ఆ పత్రిక వసంతకిచ్చాను.

"అవును.. పెళ్లయిన వాటినించి లేదు. ఈ ఒక్క మాటా నిజమే చెప్పాడు" అంది. ఒక నిమిషం ఆగి. "నేనిక్కడున్నట్లు మీ ఆయన్ని ఉత్తరం రాయొద్దని చెప్పు. అతనొచ్చి జాతర చేస్తాడు. అతని మాటలు, ప్రవర్తన మీరు భరించలేరు" అంది.

నా మనస్సు మళ్లీ చివుక్కుమంది. వసంతని ఇక్కడ వుంచుకున్నందు వలన గొడవలౌతాయని అనుకుంటున్నాడేగానీ, వసంతని భర్త దగ్గరకి పంపించమన్నంత క్రూరుడేం కాదు కృష్ణమూర్తి అనిపించింది. అతను అంత అమానుషంగా అలోచించాడు. ప్రవర్తించడు. నాలుగురోజులు పోయాక రాజేశ్వరి వసంతకి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే, ఈ చిరాకులన్నీ తొలగిపోతాయి. కృష్ణమూర్తి గురించి వసంత అపార్ధం చేసుకుందనిపించింది. అతనలా రాయడు అనిపించింది. అయితే వార్తాపత్రికలో ప్రకటన పడ్డాక కృష్ణమూర్తి అసలు నాతో మాట్లాడ్డంలేదు. ఇప్పుడతనికి ఇంట్లో ఏదీ నచ్చడం లేదు. వంటనచ్చడం లేదు, పాప అల్లరి. నచ్చడంలేదు. ఇంట్లో ప్రయివసి అనేది కరువైపోవడం అసలు నచ్చడంలేదు. ఇంట్లో ఎవరికివారు గొప్ప వాళ్ళైపోయారనీ, అతని మాట ఎవరూ లక్ష్యపెట్టడం లేదని తెలుస్తోంది. ఇంతకాలం నేనొట్టి అమాయకురాలిననే అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేనొట్టి మొండిదాన్ననీ, మూర్ఖురాలిననీ తెలిసింది.. ఇదీ సంగతి.

నాకు పెళ్లయిన నాటినుంచి నా జీతం తెచ్చి అతనికిస్తున్నాను. అతని అనుమతితోనే చీరెలు, నగలు కొనుక్కుంటున్నాను. ఇంట్లోకి ఏం కావాలన్నా అతనే తెస్తాడు. నాకేం లోటు లేదనుకున్నాను. పోనీ వసంతని ఏదైనా స్త్రీల హాస్టల్లో ఒక నెల వుంచుదామన్నా నా దగ్గర డబ్బులేదు. మాకిద్దరికీ జీతాలు వస్తాయేగానీ ఒక జీతం  చిట్‌ఫండ్స్‌కి, తదితర సేవింగ్స్‌కి పోతుంది. వున్నదాంట్లో ఇల్లు గడవాలి. అందుకోసం నా బస్సు ఖర్చులకి, చిన్నచిన్న ఇతర ఖర్చులకి మాత్రమే నాదగ్గర డబ్బుంటుంది. ఈ మధ్యన మేం స్థలం కొనుక్కున్నప్పుడు డబ్బు తక్కువైతే నా నగలు బ్యాంక్ తాకట్టు పెట్టి డబ్బు తెచ్చా, ఇప్పుడవి కూడా నా దగ్గరలేవు.

మేం ఇద్దరం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ లెక్క రాయాలంటాడతను. అలా ఒక్క వంద రూపాయలతో వున్నాను నేను. మూడు రోజులు మూడు యుగాలుగా గడిచాయి. తెల్లవారుతూనే వాకిట్లో ఆగిన ఆటోలో నుంచి దిగినవాడు సాక్షాత్తూ వసంత మొగుడే.

 నేను వసంత మొహంలోకి చూడలేక తలదించుకున్నాను..

"పిచ్చిదానా! నీ వైవాహిక జీవితం నీకేం నేర్పలేదు. నా వైవాహిక జీవితం నాకు మనుషుల్ని అర్ధం చేసుకోడం నేర్పింది, సంశయించడం నేర్పింది" అన్నట్లు ఓదార్పుగా నా వైపు చూసింది వసంత.

రమ్మని అతను, రానని వసంత. పంపెయ్యమని కృష్ణమూర్తి, నావల్ల కాదని నేను, తగవు, తిట్లు అరుపులు, తిట్లు, బూతులు,

నేను చెప్పాను అతనొట్టి గొడవ మనిషని" అంది వసంత. వసంతని తీసుకు వెళ్లడం తన వల్ల కాదని తెలిసి, "ఏం? నీ స్నేహితురాలి మొగుడు నిన్ను కూడా వుంచుకుంటానన్నాడా?” అన్నాడు అక్కసుగా, అసహ్యంగా అతను..

"ముందిక్కరించి కదులు, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను రాస్కెల్" అని అతన్ని గెంటేడు కృష్ణమూర్తి, అందుకు సంతోషించబోతూండగా, అతను నన్ను దుయ్యబట్టేడు, బయటికి నా మొండితనంతో తన పరువు తీశానన్నాడు. నా మూర్ఖత్వంతో అతనికి అవమానం జరిగిందన్నాడు. ఇకనైనా బుద్ధిగా వుండకపోతే నన్ను కూడా వెళ్లిపొమ్మన్నాడు. అలా అరిచీ, అరిచీ అలసిపోయి కుర్చీలో కూర్చున్నాడు.

ఈలోగా వసంత బట్టలు సర్దడం మొదలుపెట్టింది. “నువ్వేమో ఉద్యోగం చేసి స్వతంత్రంగా వున్నావనీ, హాయిగా వున్నావనీ, నాకు సాయం చేస్తావనీ అనుకున్నాను. ఇదేమిటిలా జరిగింది. నా మూలంగా మీరిద్దరూ పోట్లాడుకోకండి" అంది.

వసంత నా ఉద్యోగాన్ని, నా సంపాదననేకాక నన్నూ, నా ఆహాన్ని కూడా దెబ్బ కొట్టింది..

ఇప్పుడు నాకు కృష్ణమూర్తి మీద కోపం రాలేదు. నా అసమర్థత తలుచుకుని ఏడుపు రాలేదు. ఇంతకాలం నాకేం కావాలో తెలుసుకోలేక పోయినందుకు, కళ్లు తెరచి లోకాన్ని చూడలేకపోయినందుకు, విచారం కలగలేదు. నాకు నా కర్తవ్యం ఒక్కటే గుర్తొచ్చింది. వసంత చెయ్యి పట్టుకుని, "సంతోషించాం కానీ నువ్వెక్కడికీ వెళ్లవు. నేనూ ఎక్కడికి వెళ్లను. పద పొద్దెక్కుతోంది... త్వరగా స్నానం చేసి రాజేశ్వరి దగ్గరకు వెడదాం. తను నిన్ను రమ్మని కబురు చేసింది" అన్నాను.

 

(విపుల జనవరి 1994)

         

కామెంట్‌లు