3. అరుణ సంధ్య

 



 

తెల్లని దూదిపింజ మబ్బులు అరుణిమలో కరిగిపోవడం, పడమటి ఆకాశమంతా గాయపడిన హృదయంలా అయిపోవడం, ఆపైన చీకటి ముసురుకు రావడం, చూస్తూ కూర్చుంది అరుంధతి  అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి ఆశ్చర్యపడింది.

అక్కడ జరుగుతున్న చర్చ ఆమె చెవిన పడుతూనే వుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి వెనుకాడడం లేదు. అరుంధతిని ఎవరూ ఆమె అభిప్రాయం అడగలేదు.

అడిగితే ఏం వుంది చెప్పడానికి?

"మన పెద్దవాళ్ళు అమెరికాలో ఇమడలేరు. ఆ జీవితం వేరు అక్కడ మీకేం తోచదు  మీరు ఇక్కడ వుంటేనే సుఖంగా వుంటుంది అన్నాడు రవి.

అమ్మ చాలా అలసిపోయింది. కొన్నాళ్ళు తీసుకువెళ్ళి నా దగ్గర వుంచుకుందాం అనుకున్నాను " అన్నది కరుణ.

"పిచ్చిగా మాట్లాడకు. ఈ వయస్సులో వాళ్ళిద్దరూ ఒకచోటే వుండడం ధర్మం ఇప్పుడాయన ఒక్కడే ఎలా వుంటాడు. వేళకి మందు సరి అయిన భోజనం, ఇదంతా ఎవరు చూస్తారు? తీసుకువెళితే ఇద్దర్నీ తీసుకువెళ్ళు. కొంచెం పెద్దిల్లు తీసుకో! ఈ అద్దెకిచ్చెయ్." అన్నాడు రవి.

"నా కష్టార్జితంలో ఇల్లు కట్టుకున్నాను. నేనిక్కడే వుంటాను. నేనెవరింట్లోనూ వుండను. వుంటే కొడుకు దగ్గర వుండాలి లేకపోతే నా ఇంట్లో వుండాలి. నేను కరుణ దగ్గరుండడం ఏమిటీ? అని కోపంగా అరిచినంత పనిచేసేడు సూర్యనారాయణ.

"అదేమిటండీ కరుణ మీ కూతురు కాదా? రవి ఎంతో కరుణ అంత కాదా మీకు?" అన్నాడు మోహన్,

"అవ్వన్నీ తీసిపడెయ్యవోయ్. వున్న ధర్మం చెప్పాను. నేను నా తల్లితండ్రుల్ని వృద్ధాప్యంలో నా దగ్గర ఉంచు కున్నాను. మా ఆవిడ వాళ్ళకి సేవ చేసింది. అది ధర్మం. ఇప్పుడు నాకొక ఇల్లుంది  కనుక నా ఇంట్లో నేను వుంటాను, కూతురు దగ్గర వుండడం ధర్మం కాదు” అన్నాడు సూర్యనారాయణ.

అరుంధతికి నవ్వొచ్చింది. ధర్మపన్నాలు చెబుతున్నాడు సూర్యనారాయణ అనుకుని.  లత అరుంధతి వైపు చూస్తోంది.  పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడని ఆ ఇల్లాలిని చూసి ఆశ్చర్యపడింది. రవిని పెళ్ళి చేసుకున్నాక వచ్చి ఇక్కడ వుండడం యిదే ప్రధమం.  అరుంధతి గురించి గానీ, సూర్యనారాయణ గురించి గానీ రవి ఆమెతో ఎక్కువ ఏం చెప్పలేదు. ఈ పదిరోజులనుంచీ ఆమె అరుంధతిని చాలా నిశితంగా పరిశీలిస్తోంది.

మామగార్ని కూడా తీసుకుపోదాం కరుణా" అన్నాడు మోహన్. "నేను రానని ఇందాకే చెప్పాను. ఎవరి

పంచలో వుండవలసిన అవసరం నాకు లేదు"అన్నాడు సూర్యనారాయణ చిరాకు పడిపోయి.  

           “నువ్వు మాట్లాడవేం అమ్మా!" అన్నాడు రవి కొంచెం అసహనంగా.

నాకు మాట్లాడ్డానికేం లేదు " అంది అరుంధతి చాలా నిర్లిప్తంగా.

"ఆవిడ తరపున కూతుర్ని పెట్టుకుందిగా! ఇంక మాట్లాడే అవసరం ఏముందీ! చేసేదంతా చేసి ఏమీ ఎరగనట్టు కూర్చుంటుంది!" అంటున్నాడు సూర్యనారాయణ.

"ఇందులో అమ్మ ప్రమేయం ఏం లేదు నాన్నా నేనే అన్నాను" అన్నది కరుణ. "ప్రమేయం ఎందులోనూ ఉండదు. తమాషా చూస్తూ కూర్చుంటుంది  ఈ వయస్సులో నేనూ, మీ నాన్న ఒకచోటే వుండాలి మేం ఇక్కడే వుంటాం" అని అనవచ్చు గదా! అనదు. నా కుటుంబం కోసం నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఒక్క రెక్క మీద మీ అందర్నీ ఇంత వాళ్ళని చేశాను ఎవరికీ కృతజ్ఞత లేదు " సూర్యనారాయణ.

అరుంధతి లేచి వంట గదిలోకి వచ్చింది. అలాగే వాదించుకోనీ! తనకేం! తను తీసుకునే నిర్ణయమేదో తీసేసుకుంది.  జీవితంలో తనంతట తాను తీసుకున్న మొదటి నిర్ణయం. బహుశా చివరిది కూడా! భోజనాల వేళ వరకూ వాదోపవాదాలు, ప్రణాళికలు, అంచనాలు జరుగుతూనే వున్నాయి. భోజనాల దగ్గర కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద యుద్ధం లేవదీశాడు సూర్యనారాయణ. ఆ కోపం అంతా అరుంధతి తనని సమర్థిస్తూ మాట్లాడలేదనే విషయం లతకి కూడా అర్ధం అయింది. "అన్ని ఐటమ్స్ వున్నాయి గదా! ఆ కూర వదిలేసి తినండి" అంది లత,

అసహనంగా. "జీవితం అంతా ఈవిడతో ఇలానే సరి పెట్టుకుంటూ బ్రతికానమ్మా" అన్నాడాయన.

అతనంత నోరు పారేసుకుంటున్నా అరుంధతి పెదవి విప్పలేదు. "మీ అమ్మ చాలా చిత్రమైన మనిషి చాలా డిటాచ్‌డ్‌గా వున్నట్లుంటుంది. అసలీ ఇంటికి చెందనట్లు. ఎక్కడినించో వచ్చి పదిరోజులు మీకు సాయం చేసి వెళ్ళడానికి వుంటున్నట్లు వుంటుంది " అంది లత, వారంరోజుల నాడు రవితో,

"ఆవిడంతే... ఎప్పుడూ ఏమీ పట్టించుకోదు దేని మీదా శ్రద్ధ కూడా లేదు. తన ఆరోగ్యం గురించే లేదు.  ఏదైనా వచ్చినప్పుడు ఆయన చేత చివాట్లు తిని డాక్టర్ దగ్గరకు పరిగెత్తుతుంది." అన్నాడు రవి.

ఆ సమాధానం ఏ మాత్రం నచ్చలేదు అతకి. తను యు.ఎస్. నుంచి వస్తూ అత్తగారి కోసం చాలా వస్తువులు తెచ్చింది  పగడాలనీ, ముత్యాలనీ, నాని స్టిక్ వంట పాత్రలనీ, డిన్నర్ సెట్  అవ్వన్నీ చూసినప్పుడు కూడా ఆవిడ మొహం మీద రవంత సంతోషం కనపడలేదు.

ఈ పగడాలూ, ముత్యాలూ వేసుకుని ఈ నాసిక్ పెనాల మీద నాజూకు దోసెలు పోసుకుంటూ, అతిథులకి ఆమెరికా  డిన్నర్ సెట్‌లో అన్నం వడ్డిస్తూ, ఇంకా ఎన్నాళ్ళు? సూర్యనారాయణ భార్యకి!" అనుకుంది అరుంధతి అని లతకి తెలియదు. ఉండడానికో ఇల్లుండి, వున్న పిల్లలిద్దరూ చక్కగా స్థిరపడి, వాళ్ళకి నచ్చిన జీవన భాగస్వాముల్ని ఎంచుకుని పెళ్ళి చేసుకుంటే, ఈ వయస్సులో ఎంత గర్వంగా, ఎంత దర్జాగా ఎంత ఆనందంగా వుండాలి ఈ తల్లి.

లతకి అమ్మ గుర్తొచ్చింది  ఆవిడ చేసే ఆర్భాటం గుర్తొచ్చింది "మా అమ్మాయి అమెరికా నుంచి యివ్వన్నీ తెచ్చింది" అంటూ యాభై దాటినా ఇంకా చక్కగా ముస్తాబైపోయి హుషారుగా కబుర్లు చెబుతూ, ఎంత పని చేస్తూ వుంటుందో ఆవిడ! వాళ్ళిద్దరికీ అడుగడుగునా కనిపించే తేడా పదిరోజులుగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది లత. అన్నయ్య ఢిల్లీలో వుంటాడు. తన దగ్గరకు రమ్మంటే నాన్న కన్న ముందు అమ్మే చెబుతుంది "మేం రామురా అబ్బాయ్! ఇది మా ఇల్లు. ఇక్కడ మేం హాయిగా వుంటాం.  ఇష్టమొచ్చింది వండుకుంటాం.  హాయిగా ఇంటినిండా పుస్తకాలు పేపర్లు విరజిమ్ముకుంటాం.  కావాలంటే శుభ్రం చేసుకుంటాం. లేదంటే లేదు. మా సామ్రాజ్యం యిది. దీనికి నేను  రాణిని  మీ ఇంటికి మీ ఆవిడ రాణి తెలిసిందా?" అంటుంది.

ఈవిడ, ఈ అరుంధతి మొహంలో ప్రకాశం లేశం కూడా చూడలేదు. తను రవితో, తన కరుణతో కబుర్లు చెబుతూ, తమని గౌరవిస్తూ, ప్రేమిస్తూ వుండే సూర్యనారాయణ అరుంధతిని ఎంత చీదరించుకుంటాడో, ఎంత తిరస్కారంగా సమాధానాలు చెబుతాడో లత పది రోజులుగా గమనించింది.

ఆ యింట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏక పక్ష నిర్ణయమే. అధికారాలన్నీ సూర్యనారాయణవే.  అంతిమ నిర్ణయాలన్నీ అతనివే.

ముప్ఫై సంవత్సరాల దాంపత్య జీవనం ఆ ఇద్దరి మధ్యా ఏ అనుబంధాన్ని చివురింపజేయలేదంటే ఆశ్చర్యంగా వుంది. సూర్యనారాయణ కొడుకు రవి, తనకి జలుబు చేసినా మంచం మీద నుంచి లేవనివ్వడు.  కాఫీ తెచ్చి చేతికిస్తాడు.  అటువంటి రవి తల్లి దగ్గర కూర్చుని ఆవిడతో ఒక గంటన్నా మాట్లాడినట్లు లేదు. తనయితే అలా వుండలేదు. రెండేళ్ళ తరువాత ఇంటికి వస్తే అమ్మతో నాన్నతో చెప్పడానికి ఎన్ని కబుర్లుంటాయో, ఎంత చిక్కిపోయారో, అన్నీ పరిశీలిస్తుంది. ముందు అమ్మకి దగ్గరగా కూర్చుంటుంది. భుజం మీద చెయ్యి వేస్తుంది. ఆ స్పర్శ చాలు! కానీ రవి అసలు వాళ్ళమ్మని ఒక్కసారి కూడా ముట్టుకోలేదు. కనీసం ఆవిడ కూరగాయలు కోసుకుంటూంటే దగ్గర కూర్చుని కబుర్లయినా చెప్పడు.

"ఆవిడెప్పుడూ అంతే" అంటాడు ప్రతీ దానికీ. అతనికీ తండ్రి మీద అభిమానం. ఇద్దరూ వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. తనని మంచి స్కూళ్ళల్లో చేర్చి చదువు చెప్పించాడు. అమెరికా పంపించాడు.  ఆడిగినంత డబ్బు లేదనకుండా యిచ్చాడు. లతని పెళ్ళి చేసుకుంటానంటే సమ్మతించాడు. కట్నం వద్దన్నాడు. “పైకి అలా వుంటాడు గానీ మా నాన్న చాలా మంచివాడు” అంటాడు.

కరుణకి కూడా తండ్రి మీద ఎలాంటి కంప్లయింట్స్ లేవు. రవితో సమంగా చదువు చెప్పించాడు. ఆడపిల్ల అని తేడా చూపించలేదు. మోహన్‌ని పెళ్ళి చేసుకుంటానంటే సరేనన్నాడు.

ఇంత మంచివాడు, ఆవిడని ఎందుకలా వేపుకు తింటాడు?" అంది లత.

"ఎందుకో వాళ్ళిద్దరికీ పడదు.  మొదటినించీ అంతే. ఈవిడెప్పుడు దిగులుగా ఏదో పారేసుకున్నట్టు వుంటుంది. హుషారుగా వుండదు. అయినా మాకేం లోపం చెయ్యలేదు.  మమ్మల్ని బాగా పెంచింది." అంటుంది కరుణ.

వాళ్ళిద్దరికీ తండ్రి మంచివాడే.

కరుణ తల్లిని కనిపెట్టి వుంటుంది.

"నేను వెళ్ళిపోతే అమ్మకి ఏమీ తోచదు " అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అమ్మానాన్న తనతో వుంటే బావుండునంటుంది.

అరుంధతి ఏమీ అనదు.

అంటే ఎక్కడ వున్నా ఒకటేననా ?ఎలాగైనా బ్రతకవచ్చుననా?

భోజనాలయినాక అరుంధతి సూర్యనారాయణకి వరండాలో మంచం వేసింది. నవ్వారు అల్లిన పట్టెమంచం. బరువైనది. ఆవిడ మోసుకొస్తుంటే మోహన్ అందుకుని వరండాలో వేసేడు.

రోజూ ఇక్కడే పడుకుంటావుగదా! ఈ మంచం ఇక్కడే వుండనివ్వకూడదూ.!"

అన్నాడు రవి  “నవారు మాసిపోతుంది పైగా వరండాలో ఎదురుగా మంచం ఏమిటీ!" అన్నాడు సూర్యనారాయణ. మంచం మీద మెత్తటి పరుపూ, ఇస్త్రీ దుప్పటీ వేసింది. రెండు తలగడలు పెట్టింది. మంచం ప్రక్కన ముక్కాలి పీటమీద మంచినీళ్ళ కూజా పెట్టి, దానిమీద గ్లాసు బోర్లించింది అతను రోజూ వేసుకునే నిద్రమాత్ర స్ట్రిప్ లోనుంచి తీసి చేతిలో పెట్టి, గ్లాసులోకి నీళ్ళు వొంపిచ్చింది.

"దొరుకునా ఇటువంటి సేవా!"

అరుంధతి చిన్నగా నవ్వుకుని లోపలికి వచ్చింది.

అరుంధతి తనని విడిచిపెట్టి ఎక్కడికి వెడుతుంది!" అనుకుని హాయిగా నిద్రలోకి జారేడు సూర్యనారాయణ. "అవును అరుంధతి ఎక్కడికి వెడుతుంది!"

ఏం! అరుంధతి ఎందుకు వెళ్ళదు? వెడుతుంది! ఇప్పుడే  ఇవాళే!

కొంతసేపు కబుర్లు చెప్పుకుని యువజంటలు ఎవరి గదిలోకి వారు వెళ్ళి నిద్రపోతారు. తనూ నిద్రపోతుంది. సుఖనిద్ర జీవితానికంతటికీ ఒకే ఒక సుఖనిద్ర. అంతా లక్షణంగా జరిగిపోతుంది. ఎవరికీ ఏ కష్టమూ వుండదు ఎవరూ ఎక్కడనుంచీ శ్రమపడి రానక్కర్లేదు

జీవితంలో అనేకసార్లు తల ఎత్తి, నిర్దాక్షిణ్యంగా అణచి వేయబడ్డ కోర్కె ఇప్పుడు తీరుతుంది.  అరుంధతి ఎక్కడ వుండాలి అనే చర్చ ఇంక ఉండదు. అరుంధతి ఎక్కడ వుండాలో కనీసం యిప్పుడు అరుంధతే నిర్ణయిస్తుంది.

అరుంధతి గదిలోకి వచ్చి, కిటికీ తలుపులు తీసింది.  చల్లని గాలి శరీరాన్ని తాకింది.  శరీరమే కదా యిప్పుడున్నది.  ఇదే కదా ఇప్పుడు భారమై పోయింది.  లైటు వేసి గోడకి వున్న పెళ్ళి ఫోటో చూసింది. ముఫై ఏళ్ళనాటి మాసిపోయిన ఫోటో అయినా అందులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన మొహం, బరువైన పూలదండ లోనుంచీ, చందమామలా వుంది. స్వచ్ఛంగా తళతళలాడే కళ్ళు ముఫై సంవత్సరాల చరిత్రలో మర్చిపోలేనివీ చిరకాలం గుర్తు పెట్టుకోదగ్గ మధురానుభవాలేం వున్నాయి!

మధురానుభవాలా?

అనుభవాలున్నాయి! ఎందుకిప్పుడు తలుచుకోడం? పెళ్ళి ఫోటో ప్రక్కనున్న దేవుడి పటానికి నమస్కారం చేసింది.

పరుపు క్రింద పెట్టిన బీరువా తాళంచెవుల కోసం చూసింది లేవు. కంగారుగా నాలుగు మూలలా వెతికింది. లేవు. పరుపు ఎత్తి నేలమీద పడేసి దుప్పటి దులిపింది. లేవు ఆఖరికి ఇప్పుడు దేవుడికి కూడా తను సుఖపడ్డం యిష్టంలేదన్న మాట! వీల్లేదు. తాళం చెవులు వెతికి పట్టుకోవాలి. ఈ తాళం చెవులు సూర్యనారాయణకి అక్కర్లేదు. తన బీరువాలో తన చీరెలు తప్ప ఏం లేవు. డబ్బూ, డాక్యుమెంట్లు, వెండీ బంగారం అతని బీరువాలోనే వుంటాయి. అయోమయం, తెలివి తక్కువ, దేబెమొహం, పరాకు మొదలైన గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న అరుంధతి అధీనంలో వుండవు.

దొరకలేదు తాళంచెవులు...

అసలు సాయంత్రం వరకూ బొడ్లోనే దోపుకుని తిరిగింది వాటిని స్నానానికి వెడుతూ పరుపు క్రింద పడేసింది సాయంత్రం

రేపు సాయత్రం కరుణ ప్రయాణం. రవికింకా పదిహేను రోజులుంది. ఎవరూ యిబ్బంది పడకూడదు. ఇప్పుడు లైట్లు వేసి ఇల్లంతా వెతికితే అందరూ లేస్తారు. ఫరవాలేదు ఏదో ఒకటి చెప్పవచ్చు. కానీ తాళం చెవులు కనిపించి తీరాలి

ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవరో! తియ్యకపోతే ఇంకా ఇంకా కొడతారు.

కళ్ళు తుడుచుకుని, మొహానికి పట్టిన చెమట తుడుచుకుని తలుపు తీస్తే, ఎదురుగా తాళంచెవుల గుత్తితో లత! పాలిపోయిన మొహంతో నిలబడింది అరుంధతి

"తాళం చెవులిస్తానుగానీ, నిద్రమాత్రలసీసా యివ్వను. ఒక మాత్ర కావాలంటే యిస్తాను” అంది. పిసరైనా సానుభూతి లేని గొంతుతో. అరుంధతి మాట్లాడలేదు

"అలాంటి పిరికివాళ్ళంటే నాకిష్టం వుండదు మీ ఆలోచనలన్నీ నేను కనిపెడుతూనే వున్నాను. అసలెందుకు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోదలచుకున్నారు!" నిలదీసి అడుగుతోంది. హఠాత్తుగానా! ఇప్పుడే వచ్చిందా ఈ ఆలోచన?! కాదు. ఇరవై ఎనిమిదేళ్ళ నాడు, ప్రక్కింట్లో చదువుకునే విద్యార్థి మంచినీళ్ళు అడిగితే, యిచ్చినప్పుడు, సూర్యనారాయణ తనకీ

ఆ విద్యార్థికీ మధ్య అక్రమ సంబంధం వుందని అర్థంలేకుండా మాట్లాడినప్పుడు, తనని చెంపదెబ్బకొట్టినప్పుడు అప్పుడు రాలేదూ ఈ ఆలోచన!!

వచ్చింది. కానీ అప్పుడు కడుపులో రవి ఇంకో పదిరోజులకో ఏమో భూమి మీదకి రాబోతున్నాడని...  పోనీలే! వీళ్ళందరికీ మంచినీళ్ళివ్వకపోతేనేం! కిటికీ తలుపులు మూసేస్తే పోతుంది!

అప్పుడేమిటీ, ఇంకా చాలాసార్లు వచ్చింది.

మరిగే కాఫీ నెత్తి మీద పోసినా, తినే అన్నం మొహానికి పులిమినా, పుట్టింటికి వెళ్ళి పదిరోజులుండి వస్తే, పగిలిన పోయిన గాజులు, ఎండిన పూలు, ఖాళీ కండోమ్ పాకెట్లు ఊర్చేసుకుని పరుపులు ఎండేసుకుని, ఇల్లు డెట్టాల్‌తో కడుక్కుని, మళ్ళీ సుఖంగా కాపురం చేసుకునేటప్పుడు చాలాసార్లు వచ్చింది ఈ ఆలోచన. ఎప్పుడు ఈ ఆలోచన వచ్చినా బిక్కు బిక్కుమంటూ కొంగు పట్టుకు తిరిగే పిల్లలు, సవతి తల్లి పెట్టే బాధలు, తల్లిపోయిన దుఃఖంలో పాడైపోయే భవిష్యత్తు ఆడదానికి ఎన్నున్నాయో చావనీయకుండా బంధించే పరిస్థితులు ! “వుంటే వుండు, పోతేపో. నా యిష్టం" అనే పాలసీని సూర్యనారాయణ అప్పటికి, ఇప్పటికీ పాటిస్తూనే వున్నాడు. పోతే పోవడానికి కనపడని సంకెళ్ళెన్నో వుంటే వుండడమే మిగిలింది. ఇప్పుడు పిల్లలు బిక్కుబిక్కుమనరు. కళకళలాడుతున్నారు. కాళ్ళమీద నిలబడ్డారు. సంకెళ్ళు తెగిపోయాయి.

ప్రేమ సంబంధాలుంటే బ్రతకాలి.  అధికార సంప్రదాయాలు, ధర్మాలతో తనకేం పని! తనకొక్కదానికే ధర్మాలు!

అవమానాలు, ఛీత్కారాలతో సాగిన దాంపత్య జీవితాన్ని తలచుకుని తలచుకుని మురిసిపోవడానికి సాగించాలా ఈ బ్రతుకు! అతను మంచి తండ్రే కావచ్చు... మంచి భర్త కాడని ఎరగరా వీళ్ళు!

వీళ్ళ తీర్పులు, ఓదార్పులు తనకెందుకు! వచ్చిన పని అయిపోయింది. ఎవరికీ అపకారం చెయ్యలేదు ఎవరినీ నష్టపరచలేదు. కన్నీళ్ళు కార్చినా, దుఃఖంతో అవమానంతో వేగిపోయినా, ఎవరిముందూ ఆ బాధని వెళ్ళగక్కలేదు. ఎవరి మనశ్శాంతి భగ్నపరచలేదు. తనలో తనే కాలిపోయింది. తన బ్రతుకు మీద నిర్ణయం ఇప్పుడు కూడా ఎవరికీ వదలదు. ఏం చదవాలో, నాన్న నిర్ణయించేడు. ఏ బట్టలు కట్టుకోవాలో. ఎలా మాట్లాడాలో, ఎవర్ని పెళ్ళాడాలో అన్నీ సమాజము, నాన్న నిర్ణయించేరు. ఏం వండాలో ఏం తినాలో, ఎప్పుడు నవ్వాలో, ఎందుకు నవ్వకూడదో, ఎలా బ్రతకాలో సూర్యనారాయణ నిర్ణయించేడు. ఎక్కడ... వుండాలో, ఎందుకు వుండాలో ఏది ధర్మమో ఇప్పుడు పిల్లలు నిర్ణయిస్తున్నారు.

"భేష్!" అరుంధతి కళ్ళు అగ్ని గోళాల్లా వున్నాయి. అవమాన జ్వలిత ద్వేషాన్ని జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి.

కరిగిన కుంకుమ అంతటా పులుముకున్న ఆమె ముఖం అస్తమయ సూర్యబింబంలా వుంది.

ఎర్రచీరె ధరించిన అరుంధతి మండుతున్న మంచి గంధం చెట్టులా వుంది. లతకి తన తల్లి గుర్తొచ్చింది. వెన్నెలలు విరజిమ్మే పున్నమి జాబిల్లిలా వుంటుంది.

ఆవిడకి జీవితం అంటే అపారమైన ప్రేమ. అందుకు కారణం అర్ధం అయింది లతకి గదిలో ఘనీభవించిన నిశ్శబ్దం.

ఎవరూ పెదవి విప్పడం లేదు.

చాలా సేపటి తరువాత కదిలి కిటికీ దగ్గరకు వచ్చింది లత! దూరంగా తెల్లవారుతున్న వెలుగు.

నెమ్మదిగా అరుంధతిని సమీపించి, ఆమెని దగ్గరగా పొదువుకుంది. సంవత్సరాలుగా గడ్డకట్టిపోయిన దఃఖం ఆ వెచ్చని స్పర్శతో కరిగి కన్నీరు వరద అయింది.

 

(ఆహ్వానం ఆగస్టు 1994)

 

*****

       

కామెంట్‌లు