4. చీమ
వందనకి తనమీద తనకి ఎక్కడలేని సానుభూతి ముంచుకొస్తూంది. ఏమిటీ వెధవ బ్రతుకు? దీనికసలు అర్థం వుందా!
హోమ్ ఈజ్ టూ మచ్ విత్ వందన!
ఎస్. హోమ్ ఈజ్ టూ మచ్ విత్ వందన!
షి హాజ్ నో టైం టు స్టాండ్ అండ్ స్టేర్!
ఎస్. హోమ్ ఈజ్ టూ మచ్ విత్ వందన!
ఫిర్ సుబహ్ హోగయీ!
లేస్తూనే జుత్తుకి రబ్బర్ బ్యాండ్ కట్టి, కొంగు నడుముకి బిగించి కాఫీ డికాక్షన్ తీసి, పాలు మరిగించి టిఫిన్ తయారించి, భోజనం ఏర్పాట్లు పూర్తి గావించి - ఒకటేమిటి- శతావధానం -అవునూ- ఏడు గంటలైనా వరాలు రాలేదు.
అయ్యో! వరాలు రాలేదు, అయ్యయ్యో వరాలు రాలేదు, వరాలు రాలేదండీ బాబూ, వరాలు రాలేదు- ఎలాగిప్పుడు?
ముంచుకొచ్చిన సానుభూతి మున్నేటి వరదైంది. ఏమిటో ఈ బ్రతుకు! గానుగెద్దు నయం, ఈ వందన ఎద్దుకంటే!
హడావుడికి పట్టకారు పెట్టుకోకుండా' గిన్నె దించితే చెయ్యి కాలిందీ, పాలూ వొలికాయి- క్రయ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ కి తీరిక లేదు - “ఎనిమిదైనా నన్ను లేపవేం - నేను ఆఫీసుకి వెళ్ళక్కర్లేదా ?"పతి దేవుని సుప్రభాత సణుగుడు. సారీ సార్- మర్చిపోయాను - మీ అంతట మీరు లేస్తారనుకున్నాను. అవును మీరు నిజంగా మంచివారే - మా అక్క మొగుళ్ళా కాకుండా మీ బ్రష్షు మీద మీరే పేస్ట్ వేసుకుని, మీ పళ్ళు మీరే తోముకుంటారు - వెధవ పళ్ళు ఈ మధ్య సరిగా తోము కోక- టైం చాలక- నెప్పులెడుతున్నాయి- నా వండీ బాబూ మీవి కావు మీ పళ్ళకేం - తాంబూలంతో సిగరెట్ పొగతో చక్కగా గారబట్టి బావున్నాయి. ఇదుగో తెస్తున్నా - పొగలు కక్కే వేడి వేడి ఫిల్టర్ కాఫీ-
నా మొహంలా వుందా - నా మొహం అంత బాగుందన్నమాట పెళ్ళి కాక ముందు మాట. మరే! ఇప్పుడు కాస్త పంచదార తగలెయ్యనా? తగలేసేటంత పంచదారే వుంటే ఇకనేం - కాస్త కాఫీలో వేస్తానులే వరాలు రాలేదు స్వామీ- చస్తున్నాను. నా మొహం కడుక్కుని బొట్టు పెట్టుకోక పోయినా ఫరవాలేదుగానీ వాకిలి కడిగి ముగ్గెయ్యకపోతే ఇంటి రాక్షసి వూరుకోదు - చంపేస్తుంది. వరాలుకి బుద్ధిలేదు జీతం పెంచినా - సాయంత్రం రానీ చెబుతాను. –
ఏమిటీ సాక్స్ ఉతికించాలా? వరాలు రాలేదని చెబుతుంటే వినపడలేదా? మీకేకాదు నాకూ వుంది ఆఫీసు- ఈ వుతుకుళ్ళు పెట్టుకుంటే ఆఫీసులో మెమోలు అందుకోవాలి - ఆడవాళ్ళు లేటుగా వెడితే అందరికీ ఎగతాళే !
సరేలెండి! ఓ వారం రోజులు సెలవు పడేసి మీ సాక్సులన్నీ ఉతికేసి, మీ షర్టులన్నింటికీ గుండీలు కుట్టి మీ బూట్ల జతలన్నింటికీ పాలిష్ చేసేసి- ఇంకా ఏమేం వున్నాయో అవన్నీ చేసేస్తాను- దానికేంగానీ - ఓ పది నిమిషాలు ఆగితే నన్ను బస్ స్టాప్లో దించవచ్చుగా ! అసలే వరాలు రాలేదు. నేను పది నిమిషాల్లో తెమలడం మీరింత వరకూ చూడలేదా!
అవును మరి మీరలా చూస్తూ నిలబడండి ఇంటికి తాళాలు పెట్టడం - సాయంత్రానికి పెరుగు తోడెయ్యడం - ప్రక్క వాళ్ళకి తాళం చెవులు ఇవ్వడం - ఈ పన్లు అన్నీ నావే కదా! వెళ్ళండి సార్ వెళ్ళండి- ఆటోలో వెళ్ళమంటారా? మరే - నా దగ్గరంత సొమ్ము లేదు గానీ- పక్కింట్లో నుంచి ఫోన్ చేసి ఓ అరగంట పర్మిషన్ అడిగి బస్సులో వెడతాను - మీరు మీ స్కూటర్ ఎక్కి ఎంచక్కా టైంకి వెళ్ళి - ప్రశంసలు పొందండి - అవును- వరాలు రాకపోతే మీకేం - మీ పన్లన్నీ జరిగిపోతాయి - నాకే కదా ఇబ్బంది.
ఈ వరాలు దయ్యం సాయంత్రం అయినా తగలడుతుందో లేదో! ఇది రాలేదని పిల్లకి హోం వర్కులు యివ్వకుండా వుంటారా! ఏ పనులు ఆగుతాయిగనుక-
"ఇవ్వాళ పనమ్మాయి రాలేదా?' అని అడిగింది చందన మహారాణి.
పులు కడిగిన ముత్యంలా, మంచుకి తడిసిన మల్లెపువ్వులా - ప్రశాంతంగా,
నిబ్బరంగా, అందంగా, చందంగా- చక్కగా కూర్చున్న చందన
అవునమ్మా మహారాణీ - మా పనమ్మాయి రాలేదు- “తెలుస్తూనే వుందిలే - ఆ వంకరటింకర చీరె కుచ్చెళ్ళు-పాపిట్లో వంకర్లు-లేటు పర్మిషన్లు-టిఫిన్ డబ్బా తేకపోవడం- ఇదేగా పదిరోజులకోసారి నీ వాలకం"
"అవును- అసలు ఈ జన్మలో ఎప్పుడైనా లేటుగా వస్తావా నువ్వు? ఏమిటి నీ విజయ రహస్యం? ఏ చీకూ చింతా లేకుండా ఎంత హాయిగా వుంటావు? ఆ చిట్కాఏదో నాకు చెప్పకూడదూ?' అడగాలనుకుంటుంది గానీ అడగలేదు. ఇవ్వాళ అడగాలి.
"పద పద ఇవ్వాళ నా డబ్బాలో గుత్తి వంకాయ కూర తెచ్చాను" అని లంచ్ బ్రేక్లో ఆహ్వానించింది చందన - 'నీకూ నీ మొగుడూ - ఇద్దరు పిల్లలూ- వాళ్ళకి స్కూళ్ళూ- ఓ పని మనిషి వున్నారు గదా- నువ్వెప్పుడూ ఇంత హాయిగా ఎలా వుంటావే చందనా- మీ ఇంట్లో అస్తమానూ వుండే మంచి పనిమనిషి వుండి వుంటుంది అవునా?" అంది వందన.
చందన పకపకా నవ్వింది
"ఎందుకలా అనుకున్నావు?" అంది
“నువ్వు చెరగని ముస్తాబుతో, చక్కగా రోజూ టైం తప్పకుండా ఆఫీసుకి రావడం వెనుక. రహస్యం ఆ పనిమనిషి అని నాఉద్దేశ్యం"
చందన మనోహరంగా నవ్వి- "నీకో రహస్యం చెప్పనా?”
"అసలు మాకు పనిమనిషే లేదు-" అంది.
“మరి? పనంతా నువ్వే చేస్తావా? గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం...."
“అందరం చేసుకుంటాం- ఈ పనిమనిషుల కోసం ఎదురు చూడ్డం వాళ్ళు రాకపోతే విసుక్కోడం ఇంట్లో అందరూ బద్ధకస్థుల్లా తయారవడం- పనంతా ఒక్క ఆడదాని మీదే పడడం ఇదంతా మాకు నచ్చదు” వందన తల తిరిగి పోయింది.
"ఇప్పుడు ఇంటికి వెళ్ళాక పిల్లల టిఫిన్ బాక్సులు కడగడం వాళ్ళ హోంవర్కు ఇదంతా" అంది.
“హోంవర్క్ మా రఘు చేయిస్తాడు - టిఫిన్ బాక్స్ ఎవరిది వాళ్ళే కడిగేస్తారు- ఈ పూట
వంట కూడా ప్రొద్దున్నే అయిపోతుంది నాకు-పిల్లల యూనిఫామ్స్ వారానికోసారి ఉతుక్కుంటాం'
"ఉతుక్కుంటాం అంటే మీ ఆయన కూడానా?”
"ఏం ఆయన బట్టలు వేసుకోడా? మా రఘుకి అదంతా ఏం లేదు-అవునూ- అమెరికాలో వున్న మీ తమ్ముడు తన వంట తను చేసుకుని తన బట్టలు తను ఉతుక్కుని, తన గిన్నెలు తను కడుక్కుంటాడని చెప్పావు కదా? మరి ఇక్కడ చేసుకుంటే తప్పేం?'
వందనకి మళ్ళీ సానుభూతి పొంగింది- ప్రపంచంలో అందరి మొగుళ్ళూ, అందరి పిల్లలూ మంచివాళ్ళే - వందన బ్రతుకే ఇలా తగలడింది. "అమెరికాలో అన్నింటికీ మిషన్లున్నాయి-మనకేవీ?" అంది వందన తనని తాను ఓదార్చు కుంటూ.
"లేకేం? మనకీ వచ్చాయిగా రకరకాల మిషన్లు-ఇద్దరం సంపాదించుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి కొనుక్కుని జీవితాన్ని కాస్త సుఖంగా దిద్దుకోవచ్చు" వందన మనస్సు “అదోలా" అయిపోయింది (వందనకి పల్ప్ సాహిత్యం చాలా యిష్టం)
అదన్నమాట సంగతి! మొగుడు ఇంట్లో పన్లన్నీ చేస్తుంటే ఈ మహారాణి దర్జాగా ఆఫీసుకి వస్తుంది. ముక్కు పచ్చలారని పిల్లల చేత టిఫిన్ బాక్సులు కడిగిస్తుంది. ఇలాంటి వాళ్ళకే మంచిరోజులు - ప్రశంసలు కూడా. తనలాంటి మంచి వాళ్ళకి ఇంటాబయటా కూడా చివాట్లే! వందన మనస్సు భారం అయిపోయింది. చందనకి ఓ మంచి పనిమనిషి వుందని తెలిసినా ఇంత బాధ కలిగేది కాదు- ఆమెకి పనిలో పిల్లలు భర్తా సాయం చేస్తారంటే- ఆ మాట తనకి ఏమాత్రం సంతోషం కలిగించడం లేదు. పైగా చాలా కష్టంగా వుంది ఇలా కష్టంగా బాధగా వుండడాన్ని అసూయ అంటారేమో మరి-ఆ సంగతి వందనకి తట్టలేదు.
సాయంత్రం మళ్ళీ వరాలు రాలేదు-పిల్లలు టిఫిన్ బాక్సులు, మంచినీళ్ళు సీపాలు తెచ్చి సింక్లో పడేశారు. బూట్లు విప్పి ఇంటి నిండా ఇసుక పోశారు-స్కూల్సంచీలు కుర్చీలో గిరాటేసి, అలసిపోయి తినడానికి పెట్టమని మారాం చేశారు పిల్ల నూడిల్స్ కావాలంటే పిల్లవాడు ఇంకేదో కావాలన్నాడు-వాణ్ణి బ్రతిమిలాడి బజారుకి పంపి బిస్కెట్లు తెప్పించి పబ్బం గడిపేసరికి కళ్ళంట నీళ్ళొచ్చాయి.
ఆడవాళ్ళయితే ఆఫీసు నించీ సరాసరి ఇంటికి వస్తారు- మగవాళ్ళు మాత్రం ఎంతసేపటికోగాని ఇల్లు చేరరు-అమ్మ పనే హాయిగా వుండేది- ఆవిడకి చదువూ లేదు ఉద్యోగమూలేదు-బజారు పనులన్నీ నాన్నే చేసేవారు. ఆవిడ ఒక్క చీటీ వ్రాసి నాన్న దగ్గరికి పంపితే చాలు, సామాన్లన్నీ దిగిపోయేవి. ఆఖరికి ఆవిడ కట్టే చీరెలు కూడా ఆయనే తెచ్చేవారు-వెధవ ఆర్థిక స్వాతంత్ర్యం వుంటే ఎంత? లేకపోతే ఎంత! డబ్బు సంపాదించి తను మాత్రం ఏం సుఖపడుతోందంటా!
"ఏమిటీ! ఇంటి నిండా ఇసక-కుర్చీలో పుస్తకాలూనూ! కాస్త ఇల్లు చిమ్మితే పోదా!” పతిదేవుని సంధ్యా వందనం.
వందన చీపురు తెచ్చి ఇల్లు వూడ్చింది. బాక్సులు కడిగింది. పిల్ల హోంవర్క్ చూసింది- రాత్రికి వంట చేసింది-మర్నాటికి పెరుగు తోడు పెట్టింది - ఇంకా చాలా చాలా చిల్లర పనులు చేసింది-ఆపైన బెల్లుబికిన సానుభూతి వెల్లువలో కొట్టుకు పోయింది.
"ఎప్పుడూ ఏడుపే - మంచి పనమ్మాయిని పెట్టుకుని సుఖపడ్డం రాదు-ఎదురింటి సుశీల చూడు చక్కగా ఎలా
వుంటుందో - ఆవిడ చెయ్యడం లేదా. ఉద్యోగం-మానెయ్ లేకపోతే-నీ ఉద్యోగం డబ్బు నీ చీరెలకీ, పర్సులకీ చెప్పులకీ-బస్సు ఖర్చులకీ సరిపోతుంది- ఉద్యోగం మానేస్తే అవన్నీ వుండవుగా” పతి దేవుని పవళింపు సేవ! పగలంతా కార్యేషుదాసి, . ఇప్పుడేమో శయనేషు రంభ కాబోలు! రంభట రంభ నడుమూ కాళ్ళూ ఒకటే పీకుతున్నాయి.
కడుపులో లేని ప్రేమ కావలించుకుంటే వస్తుందా అనీ-ఛీ ఛీ అవును సార్- నాకెప్పుడూ ఏడుపే ఈ బ్రతుక్కి సుఖం లేదు-నా బోటి స్త్రీలకి ఆర్థిక స్వాతంత్ర్యం ఏమాత్రం సుఖం ప్రసాదించలేదు- మాది బానిస బ్రతుకైపోయింది-
తెల్లవారవచ్చే తెలియక నా తల్లీ మళ్ళీ పరుండేవు లేవమ్మా-వరాలు కూడా రాలేదమ్మా-ఇవ్వాళ-ఆఫీసుకి సెలవ్-సిక్ లీవ్ వాంతులు-విరేచనాలవలన ఆఫీసుకి రాలేకపోతున్నందుకు దయచేసి ఈ రోజు సెలవు మంజూరు చేయవల సిందిగా ప్రార్థిస్తున్నాను- యువర్స్ సిన్సియర్లీ, వందన-వున్నాయిలే ఈ సంవత్సరానికింకా రెండు మూడు క్యాజువల్ లీవులు- ఓ పిక్నిక్ ? వినోద యాత్రలా? విందు?వినోదాలా? అన్నీ ఇలాంటి సెలవులే చుట్టాలొచ్చారనీ-పిల్లలకి జ్వరాలనీ పని మనిషి రాలేదనీ –
"ఇవ్వాళ సెలవు పెట్టినట్లున్నావుగా -మొన్న కుట్టించుకున్న క్రొత్త షర్టులు కొంచెం వుతికి పెడుదూ” బ్రేక్ ఫాస్టు చేస్తూ గొంతుకలో కాస్త మార్దవం నింపుకుని పతిదేవుడు-
“రేపు మా స్కూల్లో ఎలక్యూషన్కి నాకు కొంచెం పాయింట్లు తయారు చేద్దూ!” “మమ్మీ! సాయంత్రం టిఫిన్ దోశలు" కొడుకు ఆజ్ఞ అవును బాబూ! నేనెందుకు కూతురు సెలవు పెట్టాను! వరాలు రాలేదని - ఇవ్వన్నీ చెయ్యడానికా!
సాయంత్రం చందన ఆఫీసు నుంచి ఇంటికి వెడుతూ చూసి పోదామని వచ్చింది - వాకిట్లో మోపెడ్ ఆగడం చూసి పిండిచేతులు కడుక్కుని బయటికి వచ్చింది వందన - “నీకెలా వుందో చూసి పోదామనీ- నిజంగా వాంతులేనా?" అంది
“అవునూ- వంట్లో బాగాలేకపోతే- హాయిగా మీ అందరూ ఈ పూటకి బయటికి వెళ్ళి భోజనం చెయ్యొచ్చుగదా- సెలవు పెట్టి మరీపని చెయ్యాలంటా! నేనయితే చెయ్యను బాబూ' చందనకీ తనకీ ఒకే జీతం- వాళ్ళాయనకి తనమొగుడికన్న ఓ వంద తక్కువేగాని ఎక్కువ రాదు- చందన ఇంత దర్జాగా ఎలా వుందబ్బా! మొగుడికీ పిల్లలకీ సరిగ్గా తిండి పెట్టదేమో-దీనికి వంట చెయ్యడానికి కూడా బద్ధకమే చందన బ్యాగ్ నుంచి రెండు యాపిల్ పళ్ళు తీసి వందనకిచ్చి “దారికదా అని మార్కెట్టుకి వెళ్ళి కూరలు తెస్తున్నాను" అంది
“ఏమో తల్లీ-నీ మహత్యాలు నీకే అర్థం అవుతాయి" అనుకుంది వందన చందన మోపెడ్ ఎక్కి వేగంగా వెళ్ళిపోయింది.
వచ్చింది వరాలు-మూడు రోజుల తరువాత-వందనకి జ్వరం వచ్చిన తరువాత ఆమె వొళ్ళు పచ్చి పుండులా అయిపోయిన తరువాత. తను పిల్లల్ని తిట్టి అతనితో తగులాడి గట్టిగా ఏడ్చేసిన తరువాత! మూడు రోజులుగా ఎందుకు రాలేదు? జ్వరంగానీ జబ్బుగానీ చేసిన దాన్లా లేదు. చక్కగా వుంది- వస్తూనే చీపురు తీసుకుని నంగనాచిలా వాకిలి ఊడవడానికి వెళ్ళింది.
"ఫలానా కారణాన రాలేదమ్మగారూ” అని చెప్పకుండా “అయ్యో పాపం ఎలా వున్నారో ఏమో!" అనైనా అనకుండా దర్జాగా వెళ్ళింది వాకిట్లోకి-
ఈ రోజుల్లో పనివాళ్ళ బ్రతుకులే బావున్నాయి-వాళ్ళకి ఏం పన్లుంటాయి ఇంట్లో వందన కాఫీ త్రాగుతూ వరాల్ని క్రీగంటితో చూసింది-పిడుగులు పడ్డా చలించని దానిలా ఇల్లు చిమ్ముకుంటోంది వరాలు-ఎంత ధైర్యం! నిక్షేపంలాంటి అమెరికన్ సిల్కు చీరె తీసుకుని నెల రోజులు కాలేదు- పొట్టయిపోయాయని అరడజను నిక్కర్లు వాళ్లబ్బాయికిచ్చి పదిహేనురోజులు కాలేదు-విశ్వాస ఘాతకురాలు-దాన్ని తీసెయ్యాలి పనిలోంచి "ఏమండీ వరాలుగారూ-మూడు రోజులాయె ఏ వూరు వెళ్ళారు.” అంది కసిగా. వందన.
“ఇక్కడే వున్నానమ్మా-ఏడికీ పోలేదు" అంది -
“అయ్యో అమ్మగారూ-నన్ను మీరంటారేంటండి- తప్పు కదూ -ఏదో పొరపాటయిందని నన్ను అలా బాధ పెట్టకండి-" అంటుందనుకుంది వందన. “మరి ఇక్కడే వుండి రాలేదేం” అంది గొంతు మార్చి-
“ఈలు కాలేదమ్మా ఈలయితే రాకపోదునా?" అంది ఎందుకు చెప్పకుండా.
“ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే మాకు ఉద్యోగాలు పీకేస్తారు. మీకేం దర్జాగా ఎన్నిరోజులైనా మానేస్తారు. ఓ మాటంటే పెనుక్కుని పెనుక్కుని బాధపడతాం-మీకేం వేషమా రోషమా ఎన్నన్నా ఒక్కటే-మీరు లేనిదే మాకు జరగదని మీకు గర్వం – నీ మూలంగా నేను సెలవు పెట్టాల్సొచ్చింది"
వరాలు మాట్లాడలేదు-చీపురు గోడకి తగిల్చి అంట్లు ముందు కూర్చుంది.
వందన వాక్సృవాహం వరాలుని కదల్చలేదు-యంత్రంలా అంట్లు తోమి పెట్టింది-బట్టలు వుతికి ఆరేసింది.
వరాలొచ్చి నందుకు వందనకి చాలా హాయిగా వుంది- చెమట పట్టిన శరీరం మీద పన్నీరు కలిపిన గోరువెచ్చని నీళ్ళు స్నానం చేసినట్లుంది. ఆరుబయట వెన్నెల్లో కూర్చున్నట్లుంది- దాహం వేస్తూండగా ద్రాక్షరసం తాగినట్లుంది-అమ్మ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చినట్టుంది-కానీ వరాల్ని బాధపెట్టాలని వుంది. ఇన్నాళ్ళురానందుకు ఏమీ అనకపోతే తను అలుసయిపోతాననిపించింది- సంజాయిషీ యివ్వని ఆ మనిషి వలన తనకెంత ఉపయోగం వున్నా-సంజాయిషీ ఇచ్చే సంతృప్తి ఎక్కడిది? ఇంగ్లీషులో దాన్ని ఇగో సాటిస్ఫాక్షన్ అంటారేమో!
"అలా వున్నారేం అమ్మగారూ" అంది వరాలు వెడుతూ- అమ్మగార్ని చూసి చాలా జాలిపడుతున్నట్టు. వందనకి వళ్ళు మండిపోయింది. ఇందాకటి నించీ తను అన్నమాటలన్ని వినీ విని, ఇప్పుడు సంగనాచిలా "అలా వున్నారేం" అంటోంది.
"ఎలా వున్నానేం? నువ్వెన్నాళ్ళు రాకపోయినా నీకు నాగాలు కట్టకుండా జీతం యిచ్చి, చీరెలిచ్చి, మీ పిల్లలకి బట్టలిచ్చి-నేను ఆఫీసుకి సెలవు పెట్టి నడుం విరుచుకున్నందుకు సంతోషంగా వున్నాను-సరేనా? నా మనసంతా ఆనందంతో నిండిపోయింది" అంది తనకు చేతనైనంత వ్యంగ్యంగా.
ఈసారి వరాలు ఓ చిన్న నవ్వు నవ్వి గడపదాటబోయింది- “అవునే వరాలూ - నీకు నవ్వుగానే వుంటుంది - నీకు రోషం లేదు-వేషంలేదు-ఎన్నన్నా పట్టించుకోవు. మాలాగ ఓ చిన్నమాటంటే రోషపడి ఏడవవు అదృష్టవంతురాలివి" అంది వందన. వరాలు అప్పటికీ మాట్లాడలేదు.
"చదువుకున్నవాళ్ళకే అన్ని బాధలు - నీకేం మీ ఆయన కొట్టినా రెండు రోజుల్లో దెబ్బలు మానిపోతాయి-మళ్ళీ ఇద్దరూ నవ్వుకుంటూ సినిమాకి పోతారు-మాకలా కాదు- నీకర్థం కాదులే- ఏమిటో ఈ మూడు రోజుల నుంచీ మనస్సంతా చికాకైపోతుంది-నీ మూలంగా అబద్ధం ఆడి సెలవు కూడా పెట్టాను అఫీసుకి-నీకేం నువ్వు పని మానేసినా ఎందుకు మానేశావో చెప్పనక్కరలేకుండానే దర్శగా చీపురు తీసుకుని దొడ్లోకి వెళ్ళిపోయావు- మాకు పదిమందికి సంజాయిషీ ఇవ్వాలి ”
ఈసారి వరాలు వెనక్కితిరిగి వందన వైపు చూసి మళ్ళీ నవ్వింది- ఆ నవ్వుని చిత్రించడం లియొనార్డో డావిన్సీకి కూడ చేతకాదు- అలాంటి అద్భుతమైన నవ్వు.
"అవునండమ్మగారూ- మీకన్న నేను సాలా అదురుష్టవంతురాలిని-వేలకి వేలు జీతం తెచ్చుకొని పిల్లల్ని మంచి మంచి బళ్ళల్లో చదివించుకుంటూ-కంటికి వచ్చిన చీర కట్టుకొని యిష్టమైన తిండితిని, వానాకాలంలో ఎచ్చగా, ఎండాకాలంలో సల్లగా వుండే ఇంట్లో కాపురం వుండి-మూడు నిమిషాల్లో గాస్ మన వంట చేసుకొనే మీరు- దురదుష్టవంతులు-కట్టెలుంటే బియ్యం వుండవ్! బియ్యం వుంటే కట్టెలుండవ్- చీరుంటే రయికుండదు- రయికుంటే చీరుండదు. పిల్ల గాండ్లకు బడికి పంపాలంటే పది రూపాయిలు లేవు-నేను అదురుష్టవంతురాలిని-మా ఆయన కొట్టిన దెబ్బలు రెండు రోజులకి మానిపోతాయా? ఎవరు సెప్పారమ్మాగారూ ఆ మాట. మీకు మనసులున్నాయేమో! మాకు అవేటో తెలీ దండమ్మా-మా ' మీకుందల్లా శరీరాలే కదమ్మా! అటితోనే పనిసేస్తాం-మీ అంట్లు తోమేవి-మీ బట్టలుతికేవి కూడా ఆ శరీరాలే కదమ్మా! ఆటితోనే నాలుగు రూపాయిలు సంపాయించుకోవాలా-ఆటికీ దెబ్బలు పడతాయి. అందుకే నాగాలెడ తాం-
మీలాంటి సదూకున్న వారంతా సారా దుకాణాలు మూసీయించలేక పోనారా! ఊరూరా గవుర్మెంటే దుకాణాలెట్టేసి "తాగండోరే ఎదవల్లారా?" అమ్మిస్తావుండారు-మా మగాళ్ళు సంపాదించిందంతా తాగేస్తే-మేం పదిళ్ళు పాచిపని చేసి ఇల్లు గడుపుకొస్తున్నాం మీలాగ మాకు సమత్సరానికిన్ని సెలవలున్నాయా? జీతాలు పెంచుతున్నారా? బోనసు లిస్తున్నారా? అయి పెంచకపోతే మేం సమ్మెలు సేస్తున్నామా? అవునమ్మా-మాకు మనసుల్లేవు శరీరాలే వుండాయి- అయి శుభ్రంగా తోముకోడానికి ఓ సబ్బు ముక్క లేదు- కప్పుకోడానికి బట్టలేదు-ఎండకీ వానకీ ఆగీ కొంప లేదు-అలాంటోళ్ళకి రోషాలేంటమ్మా మనసులమాట వున్న వాళ్ళకి కానీ మాక్కాదు తల్లీ-మూడ్రోజుల సంది ఎందుకు రాలేదని అక్కసు పడుతున్నావు చెబుతా విను-ఇదిగో ఈవిప్మిద దెబ్బలున్నాయి. చూశావా? అవి మా ఆయనా, ఆయన అక్కా కలిసి కొట్టినవి- నువ్వు చెప్పినట్టు రెండ్రోజుల్లో మానవ-సలపరింతలు పెడతాయి-జొరం వస్తది-ఎముకలు యిరిగి పోతాయి-ఆణ్ణి వొదిలిపోతే ఇంకోడు ఎంటపడతాడు-ఆడూ ఇంతే-పిల్లల తండ్రి కదా-పిల్లసన్నాసుల గురించి ఇదంతా - ఈసోదికేం లేగానమ్మా -నేనెల్తున్నా- ఈ దెబ్బలు తప్పనంత కాలం ఈ నాగాలు ఇంతేనమ్మా-వద్దంటే ఇంకో ఇల్లెతుక్కుంటా !"
తన శరీరం కుంచించుకుని కుంచించుకుని తను మరుగుజ్జులా- చివరికి చీమలా అయిపోయినట్లనిపించింది వందనకి- ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమ మిత్రుడికి ఓ ఆకు విసిరి వొడ్డుకి తెచ్చిన కాకి నేస్తం కథ ఎప్పుడో చదివిన గుర్తొచ్చింది.
(1991 ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి