6. తాయిలం

 

 

విరిబోణి వీణ మీద చాలా బావుంటుంది. ఇన్ని కృతులు నేర్చుకున్నా 'విరిబోణి' వర్ణం అంటే శారదకి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో ఆమెకీ తెలీదుగానీ అదంటే చాలా ఇష్టం. ఆ రోజు ఇల్లు దులుపుకుంటూ వీణ శుభ్రంగా తుడుస్తుంటే ఒకసారి 'విరిబోణి' వాయించుకోవాలనిపించింది. వీణ మాస్టారు గుర్తొచ్చారు. "సాధన చేస్తే నువ్వు ధనమ్మాళ్ అంతవుతావమ్మా!" అనేవారు. సాధన చెయ్యడానికి టైం ఎక్కడ. తీగెలు సరిగ్గా బిగించి, శృతిచేసి వర్ణం మొదలెడుతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. వీణ ప్రక్కన పెట్టి తలుపు తీసింది శారద.

"ఇదేమిటి ఇల్లు ఇలా వుంది! నేను నాలుగింటికల్లా వస్తానని చెప్పలేదూ. అయిదింటికి నా కొలీగ్ శివరావుని పిలిచేను. అతని భార్యతో సహా వస్తాడు. ఈ వీణ బయటికెందుకు తీశావిప్పుడు. మైగాడ్ వాళ్ళకేవైనా తినడానికి చేశావా

  లేదా" అన్నాడు.

శారద వీణ పెట్టెలో పెట్టింది. విరిబోణి వర్ణం ఆమె మనసులో మెదులుతుంది. శివరావు, అతని భార్యకు  స్వాగతం పలకాలి. ఈలోగా ఇల్లు సర్దాలి. ఇల్లు నీట్ గా వుండకపోతే రావ్ గారికి కోపం వస్తుంది. ఫారిన్ కంపెనీలో పనిచేసే వారంతా ఒకరకంగా ఉండాలట. వాళ్ళ కల్చరే వేరట. వీణ పెట్టెమీద కవరు కప్పి దానిమీద పూలకుండీ అమర్చింది.

రావుగారు, శివరావుగారు వారి సతీమణీ వేంచేశారు. వారు రాత్రి పన్నెండువరకూ ఉన్నారు.

తెల్లవారాక పిల్లలు స్కూలుకి, రావుగారు ఆఫీసుకి - సినిమాలోలాగ బ్రేక్ ఫాస్ట్ టెబిల్ అలంకరించాలి. అన్నీ యాంత్రికంగా జరిగిపోతుంటాయి.

రావుగారు అప్పుడప్పుడు ఆఫీస్ పనిమీద ఊరు వెడుతుంటారు. ఆయన వెళ్ళినప్పుడు శారదకి కొంచెం ఊపిరాడినా, అప్పుడు పిల్లలకి యూనిట్ టెస్టులో ఏవో వస్తుంటాయి. అప్పటినుంచి వీణ  బయటికి తీసి విరిబోణి వాయించుకునే అవకాశం శారదకి రాలేదు.

ఆ రోజు మధ్యాహ్నం రావుగారు క్యాంప్‌కి వెళ్ళేరు. చిన్నపాప నోట్‌బుక్స్ కావాలనీ, పెద్దపాప సాక్సు కావాలని తొందరపెట్టేరు. ఇంట్లో సరుకులు కూడా కొన్ని కావాలని బజారుకి బయల్దేరింది శారద. ఫ్లాట్‌కి పదిగజాల దూరంలో మోదుగ చెట్టుంది. ఆ చెట్టు క్రింద ఓ టీ కొట్టు (బడ్డీ) వుంది, అక్కడ నాలుగైదు రిక్షాలు ఎప్పుడూ వుంటాయి. రావుగారు ఊళ్ళో వుంటే కారుంటుంది. ఆయన లేకపోతే కారుండదు. టీ కొట్టు నారాయణకి పాపలంటే ఇష్టం. అందుకని అతను పనిగట్టుకుని శారదని పలకరిస్తుంటాడు.

రావుగారు రాత్రివేళ అలస్యంగా ఇంటికి వచ్చే రోజుల్లో, కిటికీ దగ్గర కూర్చుని శారద టీ కొట్టుకేసి చూస్తూ వుంటుంది. రెండవ ఆట సినిమా వదిలేవరకూ చెట్టుక్రింద సందడిగా వుంటుంది.

"బావున్నారా అమ్మా, ఏం ఇలా వచ్చేరు?" అన్నాడు నారాయణ. "బజారెడదామని. అవునూ, నువ్వు బాగున్నావా? నీ బిజినెస్ బాగా నడుస్తుందిలా వుంది. ఎప్పుడూ హడావుడిగా ఉంటుంది ఇక్కడ" అంది శారద.

"అవునండీ హడావుడే. ఇది మంచి సెంటర్ కదా.”

"ఇంకేం నీకు బాగా సంపాదన." శారద అతన్ని అభినందించింది.

"డబ్బు నాడెలా అవుతుందమ్మా! నేనొట్టి కూలోడ్ని, నెలజీతపుగాడిని. అసలు ఈ కొట్టు యజమాని మా రాములు బాబాయి" నారాయణ నిట్టూర్చేడు.

"ఏమిటీ! ఈ కొట్టు నీది కాదన్నమాట. మరి నువ్వెలా ఉంటున్నావిక్కడ?” "ఎక్కడుండనమ్మా! ఎక్కడ చేసినా ఒకటే. కాకపోతే ఇక్కడ కొంచెం వసతులు బావున్నాయి.”

'టీ'లు అందించే కుర్రవాడు వెంకటేశు యంత్రంలా పనిచేసుకుపోతున్నాడు. తొట్టినీళ్ళలో కప్పులు ముంచి కడిగేసి, మళ్ళీ టీ నింపి ట్రేలో పెట్టుకొని వెడుతున్నాడు. శారద వాణ్ణి అలా రాత్రి పన్నెండువరకూ చూస్తూనే వుంటుంది. "ఈ కొట్టు నువ్వు కొనేసుకుంటే ఈ డబ్బంతా నీకే వుండేదిగా నారాయణా!" అంది.

నారాయణ శారద వంక అజ్ఞానివంక బ్రహ్మజ్ఞాని చూసినట్లు దయగా చూసి నవ్వి, నేనేం కొంటానమ్మా, నాకొచ్చే జీతం ఎంతని? నెల నెలా ఈ కొట్టు మీదొచ్చే సంపాదనలో ఐదో వంతు కూడా లేదు. అది నా కుటుంబానికే చాలదు. ఇంత సెంటర్లో కొట్టు కొనాలంటే గుడ్ విల్ ఇవ్వాలి కదా. పైగా రాములు బాబాయికేం ఖర్మ అమ్ముకోడానికి.

బంగారు బాతుని అమ్ముకుంటారేమిటమ్మా.” పిల్లలు రిక్షా పిలిచి బేరం ఆడారు. నారాయణని చూసి జాలిపడుతూ రిక్షా ఎక్కింది శారద.

బజారు నుండి వచ్చేసరికి ఎనిమిదిన్నరైంది. అప్పటికే రావుగారొచ్చారు. ఆయన కొంచెం చిరాకుగా కన్పిస్తున్నారు.

వెళ్ళిన చోట పని అయి వుండదని శారదకి అర్థం అయింది. పైగా ఇంటికి వచ్చేసరికి తాళంవేసి వుంటే ఆయనకి కోపం వస్తుంది.

"అమ్మో అమ్మో అని మమ్మల్ని సతాయిస్తుంటారు. కొనేవాడికి ప్రాడక్ట్‌లో లోపాలు తెలీవా? అవి సరిచెయ్య మంటే నీ ఉద్యోగం దేనికని అడుగుతారు.”

అటు పై అధికార్లనీ, ఇటు డీలర్లనీ ఓ పావుగంట ఏకధాటిగా తిట్టేసి స్నానానికి వెళ్ళాడాయన. రావుగారు భార్యా బిడ్డలతో ఎక్కువ మాట్లాడరు. మాట్లాడినా తన ఆఫీసు విషయాలే ఎక్కువ మాట్లాడతారు. ఆయనకి తన ఉద్యోగం తప్ప వ్యక్తిగతమైన విషయాలేం వుండవు చెప్పడానికి. తన సహ ఉద్యోగస్థులు, తన ఆఫీసు, తన రీజినల్ మానేజర్, వైస్ ప్రెసిడెంటూ, ఆ ఊళ్ళో డీలరు, ఈ ఊళ్ళో డీలర్, వాళ్ళ ప్రశ్నలు, తన తెలివిగల సమాధానాలు, తన అనుభవం, తన తెలివితేటలు, తన టార్గెట్స్ సాధించకపోతే వారి తిట్లు, అప్పుడు తను వారిని తిట్టడం, ఆ కంపెనీ, దాని గొప్పతనం, ఎన్ని కోట్ల టర్నోవర్, ఉద్యోగస్థుల కెన్ని సదుపాయాలు ఇదంతా శారదకి కంఠస్థం అయిపోయింది. ఉదాహరణకి ప్రొద్దున్న ఎప్పుడైనా టిఫిన్ కి చపాతీలు చేసిందనుకోండి, వెంటనే అతనందుకుంటాడు.

"మా కొలీగ్స్ ఎవరూ ప్రొద్దున్నే చపాతీలు తినరు. తింటే ఇడ్లీ, లేక బ్రెడ్, బట్టర్ జామ్. పల్లెటూరి పెంపకం సరేసరి - వెళ్ళి ఒక్కసారి మా కొలీగ్స్ భార్యల్ని చూసిరా. ఎలాంటిలాంటి వంటలు చేస్తారో” అంటాడు.

అదొక స్వర్గసీమ. అందులో పనిచేసే వారంతా దేవతలు. అయినా ఆ స్వర్గసీమకి అధిపతులైన మార్కెటింగ్

మానేజర్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ మానేజర్‌కి వీరంతా దాసులు. 'దాస్యంలోనే ఆనందం అదంతేలే మరి' క్రొత్తలో అనుకునేది శారద,

కానీ రావుగారు ఆమె ఆలోచన మార్చేసేరు.

"కంపెనీ మనకెన్నో సౌకర్యాలిస్తోంది కనుక అది దాస్యం కాదు. మాదంతా ఒక కుటుంబం. మేం శ్రద్ధగా పని చేస్తాం. అంటే కంపెనీ శ్రేయస్సు కోరతాం” అంటారు.. అతని స్వామిభక్తి ఇప్పుడు శారదకి ఆరాధనీయం అయింది. తన భర్త చాలా గొప్పవాడు. సిన్సియర్ వర్కర్. అందుకే ప్రమోషన్ వచ్చింది, కారొచ్చింది. అదనపు బోలెడు సౌకర్యాలొచ్చేయి. "అతను అంత కష్టపడబట్టే ఇంటికి ఇన్ని అమిరాయి. పిల్లలకి మంచి స్కూళ్లు అమిరాయి. తినడానికి, పారెయ్యడానికి మంచి ఆహారం దొరుకుతోంది. జై కంపెనీకి, జై మా ఆయనకీ" అనేసుకుంది శారద.

 ఫలానా కంపెనీ ఉద్యోగుల భార్యలలో ఒక భార్యగా మారిపోయింది. అతన్ని కనిపెట్టి మంచిచెడ్డలు చూసుకుని, అతనికి అన్నీ అందిస్తే అతను బాగా పని చెయ్యగలుగుతాడు. అప్పుడు ప్రమోషన్లు వస్తాయి. హోదా పెరుగుతుంది. జీతం పెరుగుతుంది. పిల్లలకి మంచి చదువులొస్తాయి. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. కనుక రావుగారు కంపెనీకి ఎంత శ్రద్ధగా పనిచేస్తారో, ఎంత స్వామిభక్తితో ఉంటారో, మిసెస్ రావు కూడా రావుగారి పట్ల అంత భక్తిశ్రద్ధలు చూపిస్తూ ఆయన అడుగులకి మడుగులొత్తుతూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటోంది.

అలాంటి మిసెస్ రావుకి విరిబోణి వాయించుకోవాలనిపించింది ఒక రోజు. ఇంకొక రోజు పిల్లల్ని తీసుకుని ఎటైనా వెళ్ళి రావాలనిపించింది. మరోసారి తన స్నేహితురాలు శకుంతల ఇంటికి వెళ్ళాలనిపించింది. కానీ కుదరలేదు.

ఓసారి రావుగారి స్నేహితులొచ్చేరు. మరోసారి అతని ఇమ్మీడియట్ బాస్ భోజనానికి వచ్చేడు.

ఇంకోసారి ఆయన రీజినల్ మానేజరొచ్చి ఊళ్ళో తిష్టవేసి సెల్స్ కాంపేన్ మొదలేట్టేశాడు. సంవత్సరం మొదట్లో జరిగే సేల్స్ కాన్ఫరెన్స్క వెళ్ళొచ్చిన రావ్రు భోజనం చేస్తూ చెబుతుంటారు.

"ఈ కాన్ఫరెన్స్‌లో అంతా టెన్షన్. ఎవరికీ మాట్లాడ్డానికి గుండెలు లేవు. మా వైస్ ప్రెసిడెంట్ మమ్మల్ని బాగా తిట్టేశాడు. నువ్వు పనిపిల్లని తిడతావే అలాగ. నీకు పాత చీరె ఇచ్చాను. ఐస్క్రీం పెట్టాను. సినిమాకి డబ్బులిచ్చాను అని దెప్పుతావు చూడు, అలాగన్నమాట. మీకు బోనస్ లిచ్చాం. రెంట్ ఫ్రీ క్వార్టర్స్ ఇచ్చాం. కారిచ్చాం. మెడికల్ బెనిఫిట్స్ ఇచ్చాం. యాక్చుయల్సిచ్చాం. అయినా టార్గెట్స్ సాధించలేదు. బహుశా సుఖాలెక్కువై ఉండొచ్చు. నేను లేచి ధైర్యం తెచ్చుకుని ఇలా చెప్పాను. ప్రొడక్ట్ బాగుచెయ్యండి. ఇన్సెంటివ్ లివ్వండి. టీవీలో ఎడ్వర్టైజ్ చెయ్యండి, అందరిలాగ అని. దానికి ఆయన నిప్పుతొక్కిన కోతి అయ్యేడు.

అవ్వన్నీ చేసుకుంటూ పోతే నీ మీద ఏడాదికి ఇంత ఖర్చుపెట్టడమెందుకోయ్. మాకింతమంది మార్కెటింగ్ స్టాఫ్ ఎందుకూ? ఇదేమన్నా సబ్బా, సాంబారు పొడా? ఒక్కసారి ఫార్ములా మారిస్తే కొన్ని కోట్ల నష్టం, టీవీలో చెప్పేకాడికి మీకెందుకు టిఏ లివ్వడం అని విరుచుకుపడిపోయాడు. అలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు." ఇలా చెప్పుకుపోతుంటా డాయన. ఎవరికీ అందులో వినాలని వుండదు. అయినా వినాలి. అతనింటి యజమాని, యజమాని చెప్పేదెప్పుడూ శ్రద్ధగా వినాలి. శారద వింటుంది. ఆమెకిప్పుడు కంపెనీ గురించి పూర్తిగా తెలుసు.

అలాగే నిర్విఘ్నంగా పదిహేను సంవత్సరాలు గడిపిన శారదకిప్పుడు కొంచెం చిరాకనిపిస్తోంది. తన

ఆలోచనల్లో, తన ప్రవర్తనలో ఏదో లోటు ఆమెకి అనుభవమౌతుంది. తనని తాను పారేసుకున్నట్లు అనిపిస్తోంది. ఆ

పారేసుకున్న తనని వెతికి తెచ్చుకోవాలని కూడా అనిపిస్తోంది. అదెప్పట్నించీ అంటే ప్రక్క అపార్ట్మెంట్లోకి రాగిణీవాళ్ళు దిగేక, ఇద్దరు పిల్లలు. రాగిణి వాళ్ళాయన కంపెనీ కల్చర్ ఇమిడిపోలేదు. . ఆ అమ్మాయికి స్వంత కల్చర్ వుంది. ఓ రోజు తను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మరోసారి రాజకీయాల్ని గురించి ఇంకోసారి సాహిత్యం గురించి సంగీతం గురించి.

           అప్పటి నుంచి శారదలో అసహనం మొదలైంది. మొదలైన రోజున ఆమె పెట్టెలో నుంచీ వీణ పైకి తీసి సరిగమలు వాయించి పెద్దపాపకి నేర్పింది. అదే రోజున ఆమెకీ, రావుగారికీ తగాదా అయింది. రావుగారు మళ్ళీ ఏన్యువల్ కాన్ఫరెన్స్‌కు వెళ్ళేరు. వెళ్ళేటప్పుడు భార్యచేత సూటికేస్ సర్దించుకున్నారు. షర్టులకి గుండీలు కుట్టించుకున్నారు. కర్చీఫ్ మడతల్లో పౌడరు వేయించి మడతలు పెట్టించారు. టైలు, బూట్లు, చెప్పులు అన్నీ విడివిడిగా సర్దించారు. అది ఆయనకి పదిహేనేళ్ళ అలవాటు. హోటల్ రూంలో దిగి పెట్టె తీసినప్పుడు ఈ పూట వేసుకోవలసిన బట్టలు ఆ పూట పైకి రావాలి. తన కొలీగ్స్ అంతా తన సూట్‌కేస్ చూసి అసూయపడతారు.

          శారద పనిచేసుకుని కిటికీ దగ్గర కూర్చుంది. పిల్లలు చదువుకొని నిద్రపోయేరు. చెట్టుక్రింద బడ్డీ కొట్టు చురుగ్గా సాగుతోంది. నారాయణ డబ్బు లెక్కబెడుతున్నాడు. వెంకటేశు తిరుగుతున్నాడు. గల్లా పెట్టె నిండుతోంది. అలా చూస్తున్న శారదకి ఆలోచనొచ్చింది.

నారాయణ కదలకుండా కూర్చొని పైసా నష్టం రానీయకుండా కాపలా కాసి గల్లా పెట్టె నింపుతున్నాడు. వెంకటేశు కాళ్ళకి బలపాలు కట్టినట్లు తిరిగి తిరిగీ అర్ధరూపాయి, రూపాయి పోగేసుకొచ్చి ఇస్తున్నాడు. సాయంత్రం కాగానే రాములు బాబాయొచ్చి ఆ రోజు కలెక్షన్ మూట కట్టుకుని పోతున్నాడు.

వెంకటేశుది అందరికన్నా పెద్ద కష్టం. కాని వాడికిచ్చేది రోజు కలెక్షన్లో ఇరవయ్యో వంతు కూడా లేదు. నారాయణదీ కష్టమే, మీదు మిక్కిలి అతని నిజాయితీకి ఖరీదే లేదు. అయినా అతని కష్టంలో పదోవంతు కూడా అతనికి దక్కడం లేదు. ఇదేం న్యాయం అనిపించింది.

రోజు శ్రమకి మెచ్చి శారద చిరాకుపడిపోయింది. వెంకటేశు పన్నెండేళ్ళవాడు, ఎంతో భవిష్యత్తు వుండాల్సిన వాడు. ప్రొద్దుటినుంచి రాత్రిదాకా కాళ్ళరిగేలా తిరిగి తిరిగి రాములు బాబాయి సంపద పెంచుతున్నాడు. తన నిజాయితీతో,  శ్రద్ధతో, తెలివితేటల్తో రాములు బాబాయి సంపద పెంచుతున్నాడు నారాయణ. శారద అసంతృప్తిగా కిటికి దగ్గర నుంచీ లేవబోయింది. పన్నెండవుతోంది. నారాయణ కొట్టు మూసేశాడు. మూస్తూ ఆ వెంకటేశు చేతిలో ఓ చాక్లెట్ పెట్టాడు. వాడు దాన్ని భక్తిగా అందుకుని ప్రసాదంలా నోట్లో వేసుకున్నాడు. ప్రతీరోజు అది ఆఖరి కార్యక్రమం. ఈ రోజు ఆ చాక్లెట్ దాన కార్యక్రమం చూసిన శారదకి అసహ్యం వేసింది. ఆమె కిటికీ తెరదించి లైటు ఆర్పి పడుకోడానికి

వెళ్ళింది.

          రావుగారు కాన్ఫరెన్స్ నుంచి ఇనుమడించిన ఉత్సాహంతో వచ్చారు. పిల్లలకి ఏవో కొనుక్కొచ్చారు. వాళ్ళని హుషారుగా పలకరించారు. బహుశా అధికారుల ప్రశంసకి పాత్రులై వుంటారు. ఆయన హుషారే ఇంట్లో అందరి హుషారు. ఆయన చిరాకుగా వుంటే ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా వుండాలి.

          ఈసారి మా రీజినల్ సేల్స్ అందరికంటే ఎక్కువ. టార్గెట్ దాటిపోయింది. మొన్న తిట్టిన మా వైస్ ప్రెసిడెంట్ ఈసారి ప్రత్యేకం నన్ను మెచ్చుకున్నాడు. నేను ఈ ఆగస్టులో మార్కెటింగ్ మానేజర్ అయిపోతాను, తెలుసా. ఈసారి మా కంపెనీవారు భార్యలకి కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మిడిల్ మ్యానేజ్మెంట్స్ స్థాయిలోని వారి భార్యలందరికీ కూడా రిస్ట్ వాచీలిచ్చారు. తమ భర్తల్ని సమర్థులుగా పనిచేయడానికి తోడ్పడినందుకు” రావ్ గారి హుషారు శారదకి తెలిందేం కాదు. ఆమె అక్కడ నిలబడి చూస్తోంది.

రిస్ట్ వాచీ తీసి భార్యకిస్తూ “మా కంపెనీ కల్చరే వేరు. ప్రతి మగవాడి విజయం వెనక స్త్రీ వుంటుందని వాళ్ళకి తెలుసు.”

ఆ వాచి చూస్తుంటే చప్పున శారదకి నారాయణ వెంకటేశు చేతిలో పడేసే చాక్లెట్ గుర్తొచ్చింది. వెంకటేశులా నారాయణ తిరిగి టీలు అందించలేడు. వెంకటేశు లేనిదే వ్యాపారం లేదు. అందుకే వాడికా తాయిలం. అవును. అలాగే ప్రతి మగవాడి వెనకా ఓ స్త్రీ వుంటుంది. ప్రతి స్త్రీ తనని తాను మర్చిపోడం వెనక తనని తాను పారేసుకోడం వెనక ఓ పురుషుడే కాదు వ్యవస్థ మొత్తం ఉంటుందేమో అనిపించింది శారదకి.

 

(జ్యోతి మాసపత్రిక, అక్టోబరు, నవంబరు 1989)

 

కామెంట్‌లు