7. ముసుగు

 

 


 

నీలపు తెలుపు పోగులతో నేసిన జరీ అంచు పట్టుచీరెలా ధగధగ మెరిసిపోయే వ్యాపారం చేసే శర్మ, అతని స్నేహితుడు ప్రొఫెసర్ సుందరం రాకని పురస్కరించుకుని ఇస్తూన్న విందులో రచయిత సూర్యనారాయణ, లాయర్ సుబ్రహ్మణ్యం కూడా పాల్గొంటున్నారు.

నగరంలో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం జరిపించి, ప్రముఖుల్ని ఆహ్వానించి పరిచయాలు పెంచుకునే ఒక సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనడానికి సుందరం వచ్చేడు. సూర్యనారాయణ కూడా అందుకే వచ్చాడు. సాంస్కృతిక సంస్థకి ఉపాధ్యక్షుడైనందునే కాకుండా, సుందరం చిన్న నాటి మిత్రుడిగా కూడా శర్మ అతన్ని డిన్నర్ పిలిచేడు. సుందరం పరిచయం కోసం సుబ్రహ్మణ్యాన్ని పిలిచేడు. భార్య పెద్దమ్మ కొడుకు గదాని 'సూర్నారాయణ'ని పిలిచేడు. సూర్య నారాయణ కూడా పాపం ఈ మధ్య మంచి కీర్తి సంపాదించేడు, కాసిని డబ్బులు కూడాను,

అప్పుడు ఆ చల్లని సాయంత్రం - పోనీ రాత్రి వేళ, శుభ్రంగా తోమి తళతళలాడిపోతున్న గాజు గ్లాసుని సుందరం ముందుకు పెట్టి, "చాలా రోజులకి కలిశాం క్లబ్ వారి ధర్మమా అని. కామేశ్వరిని కూడా తీసుకువస్తే మా ఇంట్లో రెండు రోజులుండేది గదా!" అన్నాడు శర్మ.

"కామేశ్వరికి పిల్లలు కదా! వాళ్ళని వదలి ఎలా వస్తుంది! ఆమె పిల్లల్ని చూసుకుంటూంటే - ఇదిగో నేనిలా తిరుగుతున్నాను" అన్నాడు సుందరం చిరునవ్వుతో.

సుందరం ఇంకా రెండేళ్ళకి యాభైలో ప్రవేశిస్తాడంటే ఎవరూ నమ్మరు. అతని మనస్సు ఎప్పుడూ యవ్వనంలోనే వుంటుంది గనుక, శరీరం కూడా యవ్వనం ఇంకా విడిచిపెట్టడానికి ఇష్టపడడంలేదని, అతనంటే ఇష్టపడేవాళ్ళంటారు. పచ్చని ఛాయతో, కొంచెం బట్టతల అయినా తెలీని క్రాపుతో, బాగా ట్రిమ్ చేసిన చిన్న గడ్డంతో, కళ్ళద్దాలతో "ఇంటలెక్చువల్" లుక్ కలిగించే వేషధారణలో వుండే సుందరం, మాటలో, నడకలో నవ్వులో, భుజాలు ఎగుర వేయడంలో, ఆఖరికి సిగరెట్ కాల్చడంలో కూడా తను మేధావినని తెలియజేయ్యడానికి ప్రయత్నిస్తాడు.

"ఇవాళ మీ ప్రసంగం చాలా గొప్పగా వుంది " అన్నాడు లాయర్ సుబ్రహ్మణ్యం, సీసా మూత తీస్తూ.

"థాంక్యూ" అన్నాడు సుందరం

"నాకు సునంద ప్రసంగం నచ్చింది" అన్నాడు శర్మ-

"ఎంతైనా సుందరంగారి స్పీచ్ తరువాతే" అన్నాడు లాయర్ సుబ్రహ్మణ్యం, సుందరం విదార్థిని వనజ తండ్రి.

"షి స్పోక్ వెల్ హు ఈజ్ షీ" అన్నాడు సుందరం-"ఇదేమిటోయ్ ఎంత  ప్రొఫెసర్‌వి అయితే మాత్రం అంత మతిమరుపా!! మధ్యాహ్నం ఆవిడ ప్రక్కన కూర్చుని భోంచేశావు గదా- అంతసేపు కబుర్లు చెప్పావు" అన్నాడు శర్మ.

 

"అవునవును. కాని జనరల్ టాక్ వివరాలు అడగలేదు" అని నసీరుద్దీన్ షా లా ఒక చిరునవ్వు చిందించేడు సుందరం.

"ది సో కాల్డ్ ఫెమినిస్ట్" అని వ్యంగ్య వైభవం అందించేడు సూర్యనారాయణ

"ఐ లైక్ ఫెమినిజం" అన్నాడు సుందరం.

"ఫెమినిజం సంగతి వదిలేవోయ్. చెప్పు ఎలా వున్నావు ? ఇల్లు సొంతం కట్టేవా? పిల్లలేం చదువుతున్నారు ? ఏమైనా డబ్బు దాచావా?" అన్నాడు శర్మ రెండవ వరస గ్లాసులు నింపుతూ.

"చూడు శర్మా!  అవ్వన్నీ కామేశ్వరి చూసుకుంటుంది. మనకేం తెలీవ్. అందరం బాగానే వున్నాం. డబ్బులేం వున్నాయో ఏం లేవో ఆవిడ్నడగాల్సిందే. ఆవిడలా సవ్యసాచిలా వుండబట్టే ఈ రోజు సుందరం ఇలా సెమినార్లలో మాట్లాడగలుగు తున్నాడనుకో. ఐ వో హర్ ఎ లాట్ శర్మా- సి ఈజ్ ఏన్ ఏంజిల్" అన్నాడు సుందరం గద్గదంగా.

అవున్సార్ - నిజానికి ఆడవాళ్ళంతా అలా వుండబట్టే మనం ఇలా వుండగలుగుతున్నాం. ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ వుంటుందంటారుగదా!" అన్నాడు వనజ తండ్రి, లాయర్ సుబ్రహ్మణ్యం

"అవును నేనూ, నా బిజినెస్సు తప్ప ఇల్లు పెద్దగా పట్టించుకోను మా రాజ్యం చూసుకుంటుంది" అన్నాడు శర్మ.

"మా సుశీల కూడా అంతే బావగారూ నా కోసం ఎంత మంది అభిమానులు వచ్చినా చిరునవ్వుతో రిసీవ్ చేసుకుం టుంది" అన్నాడు సూర్యనారాయణ.

"మరే మీ అంత గొప్ప రచయిత భార్య కావడం ఆవిడ అదృష్టం కాదా! ఆ మాటకొస్తే శర్మలాంటి వ్యాపారస్తుడి భార్య కావడం, సుందరం లాంటి మేధావి భార్య  కావడం వారి వారి అదృష్టాలు కావుటండి. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే మిమ్మల్ని అంతగా అభిమానిస్తారు" అని విశ్లేషించేడు లాయర్ సుబ్రహ్మణ్యం.

ఆడవాళ్ళపై అత్యాచారాలు" అనే అంశం మీద ఆ రోజు జరిగిన సెమినార్లో కీ నోట్ ప్రసంగం సుందరంది. అసలే ప్రొఫెసర్- ఆ పైన మంచి కంఠం - ఇంకా ప్రసంగాన్ని చదివే తీరు తెలుసు. ఇంకేం - దాదాపు ముప్పావుగంట హాలులో ఎవర్నీ మాట్లాడనీకుండా మంత్రముగ్ధుల్ని చేసేశాడు ప్రొఫెసర్ సుందరం.

"కామేశ్వరి చాలా మంచిదోయ్- నిజంగా దేవత- దేవత అనుకో - నేనేం చేసినా ఆవిడ రుణం తీరదు. అన్నపూర్ణమ్మ తల్లి. నిజం ఒక్కోసారి ఆవిడ కాళ్ళు పట్టుకొని దండం పెట్టాలని అనిపిస్తుందనుకో" సుందరానికి కన్నీళ్ళు వచ్చాయి. కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు.

"ఇంక భోజనాలకి లేద్దాం. రాజ్యం మన కోసం చాలా తయారు చేసింది. తినకపోతే బాధపడుతుంది - పైగా మన కోసం వెయిట్ చేస్తోంది" అని అయిపోయిన సీసాలో అగ్గిపుల్ల గీసి పడేసాడు తన గ్లాసు బోర్లించి.

"నువ్వు అతిథి మర్యాదలు పాటించడం లేదోయ్ శర్మ- మందరంగార్ని అడక్కుండా అలా గ్లాసు బోర్లించడం ఏమి మర్యాద" అన్నాడు లాయర్ సుబ్రహ్మణ్యం, "వాడి కెలా మర్యాద చేయ్యడమో నాకు తెలుసు పదండి " అని లేచాడు శర్మ.

"నువ్వు వ్యాపారస్తుడివి కదా! నీకు జీవితంలో ప్రతిదీ వ్యాపారమే! కమర్షియల్ అవుట్ లుక్! నువ్విలా గ్లాసు బోర్లించి మమ్మల్ని అవమానపరచకపోతే మా ఇంట్లో షివాజ్ రీగల్ వుంది. తెచ్చేవాణ్ణి" అన్నాడు సుబ్రహ్మణ్యం "ష్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ - దట్ ఫెమినిస్ట్" అన్నాడు సుందరం నొక్కి నొక్కి పలుకుతూ.

"పద భోంచేద్దాం” అని మిత్రుడి భుజం మీద చెయ్యి వేసి భోజనాల గదిలోకి నడిపించేడు శర్మ

వ్యాపారంట ‌- వ్యాపారం! తెల్లవార్లూ త్రాగేసి అవాకులూ చెవాకులూ పేలడానికా పిలిచింది. సుందరాన్ని పరిచయం చేసింది. వాడిలో దెయ్యాన్ని బయటికి తేవడానికా? ఏం.. మనిషివయ్యా సుబ్రహ్మణ్యం. వాడెంత త్రాగినా ఎవరికీ ఊర్కే మార్కులు వెయ్యడు.. అందుకే డిపార్టుమెంటులో పేరు సంపాదించుకుని వెలిగి పోతున్నాడు. వాడికి డ్రింక్ యిష్టంకదాని త్రాగుతాడు కానీ, లంచం క్రింద తాగడోయ్ వెర్రి లాయరూ!అనుకున్నాడు శర్మ.

భోజనాల దగ్గర రాజ్యం వుంది "బావున్నారా అన్నయ్యగారూ" అని పలకరించింది.

సుందరానికి వృద్ధనారి శాంతకుమారి గుర్తుకొచ్చింది. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరక్కుండా వుండాలంటే ప్రతీ పురుషుణ్ణి స్త్రీలు "అన్నయ్యా!" అని పిలవాలని చెప్పింది. కొంతమంది అక్కడక్కడే పెద్దగా నవ్వేసి సంతోషం వ్యక్తం చేశారనుకో!

పాపం రాజ్యం చాలా మంచిది 'అన్నయ్యా' అనకపోయినా ఫరవాలేదు - భుజంనిండుగా పమిట కప్పుకొని పెద్ద బొట్టు పెట్టుకుని వుంది. “కామేశ్వరి బావుందా?” అని అడగాలనిపించింది రాజ్యానికి. కామేశ్వరి అంటే ఆమెకి యిష్టమూ, సానుభూతి కూడాను. కామేశ్వరి ఉద్యోగం చేస్తుంది. పిల్లల్ని చూసుకుంటుంది. అందుకే ఆమెంటే తగని అభిమానం రాజ్యానికి. మాట వరసకి అడిగితే ఇక్కడే ఏడ్చేలా వున్నాడు మహానుభావుడు. డ్రంకెన్ ఏడుపులంటే మహా చిరాకు రాజ్యానికి.

ఇందాకటి నించీ డ్రాయింగ్ రూంలో జరిగిన సంభాషణంతా రాజ్యం విననే విన్నది. అక్కడ ఆమె ప్రసంగం బావుందని మెచ్చుకుని వచ్చి, ఇక్కడ ఆమె అందాన్ని వర్ణిస్తూ ప్రసంగం ఎవడిక్కావాలి! ఆమె అందం వెన్నాడుతోందనే ఈ సుందరం సంస్కారం గురించి తను శర్మతో అంటే - అతను ఇలా అంటాడు.

"ఎంత మంచి మగవాళ్ళయినా బయటికి వచ్చి తమతో సమానంగా వుండే ఆడవాళ్ళని గురించి ఇలాగే వాగుతారు రాజ్యం.  నిజానికి మనంద చాలా డిగ్నిఫైడ్‌గా వుంటుంది. మగవాళ్ళకి ఈ సరదా వాగుడు ఒక జబ్బు. అందుకే నిన్ను బయటికి వెళ్ళద్దంటాను" అంటాడు. అంతే కాదు అలా వాగినా మందరం చాలా గొప్పవాడంటాడు. ఈ సూరిగాడు మాత్రం ! తన నవలల్లో 'రేప్' దృశ్యాలు మహా ఆసక్తికరంగా వర్ణిస్తాడు.

వీడి వర్ణనల ప్రకారం తీసిన సినిమా చూసిన ప్రతి మగాడికి కనపడ్డ ఆడదాన్నల్లా చెరచాలనిపించేలా రాస్తాడు. పైగా "నాకు ఇలాంటి అకృత్యాలంటే చిరాకక్కయ్యా ! అందుకే. నా నవలల్లో పాపులందర్నీ ఆఖరికి చంపేస్తాను అంటాడు. వెధవ హిపోక్రసీ వీడూను." "అక్కయ్య లేదు చక్కయ్యలేదు నోర్ముయ్ సన్యాసి" అనాలని వుంటుంది. కానీ ఇలాంటి విషయాలు తమ్ముడితో కూడా మాట్లాడరాదు.

ఆడవాళ్ళు చీరెల్ని గురించీ, నగల్ని గురించీ పిల్లల చదువులని గురించీ, బంధువులు గుణగణాలని గురించీ సంగీతం గురించి జబ్బుల్ని గురించీ, మాట్లాడాలి.. అంతే... అత్యాచారాల్ని  గురించీ, రచనల్ని గురించీ, మనుషుల్ని గురించి, రాజకీయాలని గురించి మాట్లాడరాదు.

ఒకవేళ "ఇదేమిటి!" అని ఏ రాజకీయ పరిస్థితి గురించో, సాంఘిక పరిస్థితి గురించో మాట్లాడబోతే శర్మ వెక్కిరింపుగా "అబ్బో చాలా విషయాలు తెలుసే నీకూ! అలాగా!" అని నవ్వి వెళ్ళిపోతాడు.

మొదట్లో అవమానపడేది రాజ్యం, తరువాత అర్థం అయింది. తను ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వ్యాఖ్యానించడం

అతనికిష్టం లేదని అందుకనే అతని ఎదుట మాట్లాడదు. అందుకే శర్మకి రాజ్యం నచ్చుతుంది. అంత పెరిగి మసలుకునే

వాళ్ళంటే శర్మకి ముచ్చటగా వుంటుంది. రాజ్యం అంటే అందుకే అతనికి ఇంకా ముచ్చటగానే వుంటోంది. అందుకే చిరునవ్వొకటి తగిలించుకుని అదీ ఇదీ వడ్డిస్తున్నట్లు కనిపిస్తూ ఓ పదిహేను నిమిషాలు ఆదర్శ గృహిణి పాత్ర నిర్వహిం చింది.

సుందరం నిద్ర లేచేసరికి ఉదయం పదకొండు గంటలయింది. అప్పటికి అతని కోసం క్లబ్ వాళ్ళొచ్చేరు. సాయంత్రం రైలుకి అతని టికెట్టు పక్కా అయిందని చెప్పారు. మధ్యాహ్నం ఒక డాక్టర్ గారు అందర్నీ తమ ఇంటికి భోజనానికి పిలిచారనీ, సునంద శాంతకుమారి(వృద్ధనారి) కూడా వస్తారనీ, త్వరగా స్నానం చేసి తయారైతే కారు పంపుతామనీ చెప్పారు.

సుందరానికి ఇంకా మత్తుగానే వుంది. షవర్ క్రింద హాయిగా స్నానం చేసేడు. టీషర్టు వేసుకుంటే బాగుంటుంది గానీ ఇలాంటి వూళ్ళల్లో జనం ఊర్కే ఏడ్చేస్తారు. వాళ్ళ దృష్టిలో నలభై ఎనిమిదేళ్ళవాడు ఆరవై ఎనిమిదేళ్ళవాడిలాగానూ అరవై ఎనిమిదివాడు. శవంలాగానూ ఉండాలి. వీళ్ళ వాఖ్యానాలు మనకేల? ఫుల్ షర్టు వేసుకుని అందర్నీ సంతోషపెడితే పోతుంది. ఎంతైనా గౌరవం దుస్తుల్లో నుంచీ కూడా వస్తుందటగా. సునంద ఏమనుకుంటుందో? ఈ సునంద ఎవరబ్బా వూరికే ప్రతి దాంట్లో కల్పించుకుంటుంది!

కారు వచ్చింది. డాక్టర్ గారిల్లు వచ్చింది. అక్కడ మద్యాహ్న భోజనానికి డాక్టర్లు, పురప్రముఖులు చాలా మంది వున్నారు

డాక్టర్ గారు బొత్తిగా ఎండు మనిషిలా వున్నాడు- డ్రైలంచ్ అట - ఎంతైనా డాక్టర్ గదా! ఇంజూరియస్ టు హెల్త్ ఆనుకుని వుంటాడు. సిగరెట్టయినా కాల్చుకోనిస్తాడో లేదో - "హలో ప్రొఫెసర్ హౌ డు యూడూ " అంటూ వచ్చింది శాంతకుమారి. “అన్నయ్యా" అంటుందేమోనని భయపడ్డాడు అనలేదు పాపం.

హౌడూ ఐడూ ? ఇప్పటిదాకా బావున్నాను వృద్ధనారీ! నిన్ను చూడగానే సిక్ అయిపోయాను ఆనుకుని, "మీరెలా వున్నారు?' అన్నాడు. మళ్లీ నసీరుద్దీన్ షాలా ఓ ఇంటలెక్చుయల్ నవ్వు నవ్వి -

"చాలా బావున్నాను - అదుగో సునంద వచ్చింది -" అంది. బ్రతికాం... వచ్చింది కదా సునంద! అబ్బో! వచ్చింది - ఇన్ని మల్లె పువ్వులు ముత్యాలు దారి పొడవునా రాల్చుకుంటూ,

"హౌ డు యూ డూ" అన్నాడు హుషారుగా చెయ్యి జాపి. "హలో" అని నవ్వింది. చెయ్యి జాపలేదు.

భోజనాలకి ఒకే టేబిల్ దగ్గర -

"నిన్న చాలా బాగా మాట్లాడారు. చాలా ఇంప్రెసివ్గా వుంది " అన్నాడు.

"థాంక్స్"

"ఏం చేస్తూ ఉంటారు? పెళ్ళయిందా పిల్లలెందరు? మీ రచనలు బావుంటాయి. మా ఆవిడకి కూడా ఇష్టం  మిమ్మల్ని కోట్ చేస్తుంటుంది " అన్నాడు.  

మళ్ళీ కాసిని మల్లెపూలు కుమ్మరించింది. పెళ్ళయింది... ఫలానా ఆఫీసులో ఉద్యోగం... అతను తన కలీగే... ఒక పాప.

"ఫెమినిస్టులు పురుష ద్వేషులన్నాడు ఒక స్నేహితుడు - మీరు నన్ను ద్వేషించడం లేదు గదా! " అని పెద్దగా నవ్వేడు.

నో-నో అదేం లేదు. ఐ లైక్యూ వెరీమచ్. నిన్న మీరు మాట్లాడింది విన్నాక మిమ్మల్ని ద్వేషిండమా!" అంటుందనుకుని,

మురిసిపోతూ...

"ఏ స్నేహితుడు? ఆయనెవరో తెలుసుకోవచ్చా?' అంది. ద్వేషిస్తున్నాననీ అనలేదు! ద్వేషించనూ అనలేదు తెలివిగలదే సుమా !

"ఉన్నాడులెండి. రాలేదిక్కడికి - అవునూ - నిజంగా మీరు పురుషద్వేషులా?" అన్నాడు అమాయకంగా మొహం పెట్టి, "మేం పురుషాధిక్యతని సహించం. అందరూ సమానమే అని చెబుతాం. మిమ్మల్ని అంటే ప్రొఫెసర్ సుందరంని నేనెందుకు ద్వేషిస్తాను మీతో భోజనం చెయ్యడం, మాట్లాడ్డం మంచి కాలక్షేపం" అంది.

"మా యూనివర్సిటీలో స్త్రీల సమస్యల మీద సెమినార్ ఏర్పాటు చేస్తాం, మీరు రావాలి.  మా స్టూడెంట్స్ చాలా మంది మీ అభిమానులు" అన్నాడు.

"నేను వెళ్ళి మీకు ఉత్తరం రాస్తాను తప్పకుండా రావాలి మీరు. మా ఇంట్లోనే వుండొచ్చు మా కామేశ్వరి సంతోషిస్తుంది. కామేశ్వరి చాలా మంచిది" అన్నాడు.

"అలాగే. థాంక్స్" అంది.

ఆ విధంగా ప్రొఫెసర్ సుందరం "ఆడవాళ్ళ మీద అత్యాచారాలు" అనే అంశం మీద రెండు నాళ్ళు జరిగిన తిరునాళ్లలో అతి విజయవంతంగా పాల్గొని ఇంటికి తిరిగి వచ్చేడు.  వచ్చేసరికి అతని చిన్ననాటి మిత్రుడు శివరావనే అతను బొంబాయి నించి వచ్చి అతని కోసం వేచి వున్నాడు.

అన్నట్లు, అప్పుడు జరిగిన ఆ సమావేశాలను గురించి తెలుగు పత్రికలన్నీ బాగా వ్రాసేయి. ఫొటోలు కూడా ప్రచురించేయి. సుందరం ఫోటో చక్కగా వేశాయి. సునంద ఫోటో కూడా వేశాయి. సుందరం ప్రసంగాన్ని దాదాపు సగం వరకూ యదాతథంగా ప్రచురించేయి.

"సునంద బాగా మాట్లాడిందండీ" అంది కామేశ్వరి పత్రిక చదివి “నాలుగు పుస్తకాలు చదివితే ఎవరైనా మాట్లాడుతారు లేవోయ్. నువ్వూ అలవాటు చేసుకో, నిన్ను కూడా మాట్లాడిస్తారు ఒక సభలో "అన్నాడు. ఏ మాత్రం ఆసక్తి లేనట్టు. ఇంకొకరి గొప్పతనాన్ని అంగీకరించరు ఇలాంటివాళ్ళు అనుకుంది కామేశ్వరి.

"మీరూ అలానే పుస్తకాలు చదివి మాట్లాడేరా?" అని కూడా అనాలనిపించింది. కానీ కామేశ్వరి అలా అనదు. అతనితో వాదవివాదాలు ఆమె కిష్టం వుండవు. నిజానికి కామేశ్వరికి ప్రశాంతత అంటే చాలా యిష్టం. ఇల్లు ప్రశాంతంగా వుంటే పిల్లలు బాగా చదువుతారు. బాగా చదివితే ప్రయోజకులౌతారు లేకపోతే వాళ్ళ లేత మనసులు విరిగిపోతాయి. అందుకని ప్రశాంతమైన గృహవాతావరణం కల్పించడం కామేశ్వరి తన ధ్యేయంగా భావిస్తుంది. అందుకోసం నోరు మూసేసు కుంటుంది. అక్కడ నుండి వేరే పని మీద హడావుడిగా వెళ్ళిపోతుంది.

సుందరం ఉద్యోగానికి, శివరావు ఊళ్ళో పనుల మీద వెళ్ళి రాత్రికి కూర్చుని కబుర్లు మొదలెట్టేరు.

చిర కాలానికి కలిపేరు కనుక చాలా కబుర్లున్నాయి వాళ్ళిద్దరికీ వాళ్ళ క్లాస్మేట్ విజయమేరీ దగ్గర్నుంచీ ప్రక్కింటి పిల్లల తల్లి కుముదమ్మగారి దాకానూ ఇంకా ఆఫీసులు కబుర్లు, స్నేహితుల కబుర్లు నాలుగయిదు రౌండ్ల దాకా చెప్పుకుని, చెప్పుకుని రాత్రి రెండు గంటల వేళ భోజనం చేశారు."మనకెప్పుడూ అట్లతద్దె భోజనమే" అని గొల్లున నవ్వేడు శివరావు

 

వాళ్ళు మళ్ళీ కంచాల్లో చేతులు పెట్టుకుని, మళ్ళీ పాత విషయాలు తలుచుకుని కొంత ఏడ్చి, కొంత నవ్వి - ఎలాగో మూడు గంటలు కొట్టే వేల్టికి టేబుల్ ముందు నుంచి లేచేరు. ముందు గదిలో సోఫా పరిచి శివరావుని దాని మీదకి చేర్చి ఓ దుప్పటి కప్పి, లైటు తీసి, సింక్ దగ్గర చన్నీళ్ళతో మొహం కడిగేడు సుందరం..

"ఏమి హాయిలే హలా -" అని కూనిరాగం తీస్తూ సింక్ దగ్గర్నుంచీ వస్తూంటే, తలుపులు తీసిన పిల్లల గదిలో నిద్రపోతున్న కామేశ్వరి కనిపించింది. "సౌండ్ స్లీప్" లో వున్నదేమో కొంచెం గురక కూడా పెడుతోంది పిల్లాడొకడు ఆమె నడుం మీద చెయ్యివేసేడు.

మాతృపరిష్వంగ సుఖం అన్నమాట ప-రి-ష-వంగ సుఖం! గదిక్కిన వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని లేపాడు.

ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.

"నా గదిలో పక్క దులిపి వెయ్యి" అన్నాడు.

సాయంత్రం వేశాను” అంది కళ్ళు మూసుకుని -

"మళ్ళీ వెయ్యాలి - లేచిరా" అని గుంజేడు.

కామేశ్వరి చటుక్కున లేచి నిలబడింది. రేడియం ముల్లొక్కటి మూడు దాటి వుంది, రెండో ముల్లు దాని క్రింద వుందన్న

మాట. మూడుంపావు...

నాకు ఇలా లేస్తే దడ వస్తుందండీ. ఆయాసంగా వుంటుంది. వెళ్ళి పడుకోండి ప్లీజ్" నాలుగింటికి కృష్ణుడు చేస్తాడు వాడికి పరీక్షలొస్తున్నాయి " అంది చాలా నెమ్మదిగా.

'రమ్మంటే ఏమిటా వెధవ సణుగుడు" అన్నాడు కొంచెం పెద్ద గొంతుతో. అతని మాటలో స్పష్టత లేదు. కళ్ళల్లో ఓ వింత మెరుపు వుంది. ఆ మెరుపంటే కామేశ్వరికి భయం.

కామేశ్వరికి పిల్లలు లేచి తండ్రిని చూస్తారని కూడా భయం ఈలోగా సుందరం ఆమెని తన గదిలోకి ఈడ్చుకుపోయేడు.

"నా మాట వినండి నాకు వంట్లో బాగా లేదు ప్లీజ్" అంది కామేశ్వరి.

సుందరం ఆమెని మంచం మీదకి బలంగా తోసేడు. ఆమె లేవడానికి కానీ ఊపిరి పీల్చుకోవడానికి కానీ వీల్లేకుండా చేసేడు. "ఎప్పుడూ బావుండదు వంట్లో మళ్ళీ ఎవరి దగ్గరకైనా వెళ్లానంటే ఏడుపు దిట్టంగా వున్నావు - వంట్లో బాగా లేదంటా!" కామేశ్వరికి సమాధానం చెప్పాలని వున్నా ఆమె నోరు మూసుకుంది.

ఇలా మొరాయించావంటే ఎవర్నైనా తెచ్చి ఇంట్లో పెట్టేస్తాను" మగవాడి బలం, మగవాడి కోరిక, అవతల నించీ ఆహ్వానం ప్రోత్సాహం లేదన్న అవమానంతో కూడిన కసీ - నరాల రాగాలు కావవి - నరాల తీపులు -

"ఎవర్నో తెచ్చిపెడతావా! నువ్వు తేలేవు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి, ఈ అవమానాన్ని హింసనీ ఎదుర్కొని ఇల్లువిడిచి పొగలనా! పోలేను. మనిద్దరం పరువు ప్రతిష్ఠల కోసం పడి చస్తాం గదా! అందుకే మనం కట్టుకున్న ఈ గది గోడల మధ్య కర్కశంగా, అమానుషంగా హేయంగా, దీనంగా, హీనంగా, ఇలా ఎవరూ చూడని బ్రతకు మనం బ్రతకాల్సిందే-"

సుందరం ప్రేమ హింసని కన్నీళ్ళతో కలిపి భరిస్తూ అనుకుంది కామేశ్వరి. ప్రక్కగదిలో అలారం మ్రోగింది. ఉలిక్కిపడి నిద్రలేచిన కామేశ్వరి పదిహేనేళ్ళ కొడుకు కృష్ణుడు తల్లికోసం చూసేడు.

ఆవిడ అప్పటికే బాత్రూంలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది.

తల్లి అలా ప్రభాత స్నానాలు చెయ్యడం వాడికెరుకే. పది నిమిషాలు ఆలస్యంగా అయినా, శుభ్రంగా కళకళలాడుతూ పాల

గ్లాసుతో ప్రత్యక్షం అయి అన్నీ సమకూర్చే ఆ కన్నతల్లి ఎందుకు ఆ వేళప్పుడు స్నానం చేస్తుందో వాడికెందుకు ?

ఆ సంగతి ఆమెకే తెలుసు. ఈ ప్రభాత స్నానం, ఏ దైవానికీ సుప్రభాత సేవ చెయ్యడం కోసం కాదు. కన్నీళ్ళతో, స్వేదంతో లాలాజలంతో మలినమైన తన మొహాన్ని, చిరిగిన తన జాకెట్టునీ, మొక్కజొన్న పీచులా రేగిపోయిన తన జుత్తునీ చూసి తన కొడుకు జడుసుకోకుండానే కదా !

ఈ విషయం బారెడు ప్రాదెక్కి నిద్రలేచి భార్య చిరునవ్వుతో ఇచ్చే బెడ్ కాఫీ అందుకునే సుందరానికి మాత్రం ఏం తెలుసు! కామేశ్వరి మంచిది పాపం... ఆమె స్నానం - ఆమె ఇష్టం - ఆ సంగతి కూడా మనకెందుకు" అనుకుంటాడు విశాల హృదయంతో.

 

(ఆంధ్రజ్యోతి వార పత్రిక (7-6-91)



 

కామెంట్‌లు