8. గోవు

 



 

 

నీరసంగా కళ్లు విప్పి చుట్టూచూసిన గోమతికి తను హాస్పిటల్లో ఉన్నట్లు అర్ధం అయిందేకాని, తను అక్కడికి ఎప్పుడు ఎందుకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు.

ఈ హాస్పిటల్ తమకి దగ్గర బంధువైన డాక్టర్ తారది. సరిగ్గా రెండురోజుల క్రితం చెకప్ కి రావడం, ఆవిడ చెప్పిన వార్త విని సంతోషించి, చెప్పిన మందులు కొనుక్కుని వెళ్ళడం గోమతికి తెలుసు - ఇలా మంచంమీద పడుకో వలసి రావడం ఎందుకు సంభవించిందో మాత్రం తెలీడంలేదు.

మంచంమీద కూర్చుని చుట్టూ చూసింది గోమతి. ఎదురు మంచం మీద ఓ పూచిక పుల్ల పడుకొని వుంది. ఆ పూచికకి పొత్తికడుపు మీద ఇంత దూది వేసి కుట్టినట్లు కడుపు వుంది-- ఆ కడుపు చేత్తో పట్టుకుని మూలుగుతూ ఏడుస్తోంది పూచిక. పూచిక దగ్గర కూడా ఎవరూ లేరు. అవును, తన దగ్గర కూడా ఎవరూ లేరు. వృద్ధ మహారాణి గానీ,  ప్లీడరు సుందర రావుగారు కానీ ఎవరూ లేరు. తనని ఒంటరిగా ఇక్కడెందుకు వదిలివేశారో మరి. పూచికని చూస్తే జాలేసింది గోమతికి.

"పురిటి నొప్పులా" అనడిగింది.

పూచిక తలాడించింది.

దగ్గరెవరూ లేరేం” అంది గోమతి.

అమ్మని ఇందాకే ఇంటికి పంపించాను. ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలు వాళ్లకి తిండి. అదీ చూడాలిగా, సాయంత్రం దాకా పురుడు రాదంది డాక్టర్".

"మీకు ముగ్గురు పిల్లలా. మళ్లీ ఇదొకటా! ఎలా కంటారో ఏమో" జాలిపడింది గోమతి.

పూచికకి దుఃఖం వచ్చింది. లేచి కూర్చుని 'ఏం చెయ్యను ముగ్గురూ ఆడపిల్లలే! మా ఆయనకి మగ పిల్లవాడు కావాలట. క్రిందటి కాన్సులో బాగా సుస్తీ చేసింది. చచ్చి బ్రతికాను మూడు వేలు ఖర్చయ్యింది. గాజులమ్మేశాను" ఇవ్వన్నీ తనతో చెబుతోందంటే ఎంత దుఃఖాన్ని దాచు కుందో పాపం.

"మళ్లీ ఏమవుతుందో? బ్రతుకుతానో చచ్చిపోతానో! ముగ్గురు పిల్లల్ని ఏం చేస్తానో.

ఇంతలో ఒకతను వచ్చేడు. మనిషి చూడ్డానికి బాగానే వున్నాడు. ఓ చేతిలో ప్లాస్టిక్ ఓ బుట్టలో కొన్ని బట్టలు, రెండవ చేతిలో ఫ్లాస్కు తెచ్చాడు. "మీ అమ్మ వస్తోందిలే. ఎలా వుంది! నెప్పులెక్కువయ్యాయా!" అనడిగాడు పూచికని.

ఆవిడ మొగుడు, ఆవిడ చేత మగపిల్లవాణ్ని కనిపించే హక్కు గలవాడు.

పూచిక ఏడుస్తూ " ఏమండీ! ఈసారి నేను బ్రతకనండి చచ్చిపోతాను" అంది.

"ఛీ! అలా అశుభం పలకకు--ఈసారి నీకు సుఖప్రసవం అవుతుంది. పండంటి మగపిల్లవాణ్ని కంటావు. అందు కోసం ఈసారి నేను జపాలు చేయించాను. అభిషేకాలు

చేయించాను - నీకు తెలుసుగా'

"ఈసారి కూడా ఆడపిల్ల పుడితే మళ్లీ...".

"అదే వద్దన్నాను. ఇలా ఏడ్చి ఏడ్చి ముగ్గుర్ని కన్నావు' అంతా బాగానే జరుగుతుంది. ఈసారి ఓర్చుకో"అతగాడు కొంచెం చిరాకు పడి, బయటికి వెళ్లేడు.

ఓర్చుకోడానికి పిసరు ఓపిక లేదు. పూచిక దగ్గర, కన్నీళ్లు కారుతూనే వున్నాయి.

గోమతి జాలిగా చూస్తూ కూర్చుంది.

అంతలో ఆవిడొచ్చింది. వృద్ధ మహారాణి.

"లేచి కూర్చున్నావే ఇంకేం - తారనడిగి ఇంటికి పోదాం. ముందు కాఫీ తాగు"అంది.

"నేనెందుకు వచ్చానిక్కడికి? నాకేమైంది?" అంది గోమతి.

"అయ్యో పిచ్చితల్లీ! నీకు అబార్షన్ అయిందమ్మా. పొద్దున కళ్లు తిరిగి పడిపోయినావు. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం. అప్పటికే అంతా అయిపోయింది". ఆవిడ ముఖం జాలిగా పెట్టి అన్నది."

"నేను పడిపోయావా! ఎప్పుడూ...నాకు తెలీదే! నాకు అబార్షన్ కావడం ఏమిటి? అసంభవం" గోమతి అలా బయటికి అనలేదు. కడుపుమీద చేత్తో తడిమి చూసుకుంటే దుఃఖం వచ్చింది.

"ఏం చేస్తాం తల్లీ, నీకు ఈ బిడ్డ దక్కే యోగం లేదు. పద వెడదాం" అంది వృద్ధ మహారాణి.

ఆవిడ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు గోమతికి. నిన్ననే తను ప్లీడరుగారిని బ్రతిమిలాడింది. ఆయన ఎంత వద్దన్నా ఈ బిడ్డ తనకి కావాలని మొరపెట్టుకుంది. ఇవాళ ఇలా జరిగింది. తను కళ్లు తిరిగి పడిపోవడం నిజం కాదు. ఈవిడ మాటలు నమ్మలేను. ఈవిడ వృద్ధ మహారాణి కాదు. వృద్ధ జంబుకం. తార కూడా నిజం చెప్పదు ఎవరూ నిజం చెప్పరు...

"కారొచ్చింది వెడదాం పద" అన్నది ఆవిడ. ఆ క్షణంలో అవిడ బ్రహ్మరాక్షసిలా కనపడింది. తనని తినెయ్యడానికి ఎత్తుకుపోతున్న బ్రహ్మరాక్షసి.

పూచికపుల్లకి నెప్పులెక్కువవుతున్నాయిలా వుంది మెలికలు తిరిగిపోతోంది. ఆవిడ తల్లి వచ్చింది. కూతురికి మంచినీళ్లిచ్చి, కళ్లు తుడుచుకుంది. "ఈ గండం ఎలా గడుస్తుందో ఏమో! ఏడుకొండలవాడా! తండ్రి నా కూతుర్ని దయ చూడు నాయనా అని దండం పెట్టుకుంటోంది.

గోమతి ఇంటికి వచ్చింది. "పడుకుని విశ్రాంతి తీసుకో! పదిరోజులు వంట మనిషిని కుదిర్చానులే. నీ ఆరోగ్యం కన్నానా” అంది ముసలి మహారాణి. ఆ మాటల్లో లోతు లేదు. ఆవిడ తనతో మాట్లాడే మాటల్లో ఎప్పుడూ లోతు వుండదు. పెదవుల పైనుంచే మాట్లాడుతుంటుంది.

మంచంమీద పడుకున్న గోమతికి దుఃఖం కట్టలు తెగి వచ్చింది. అమ్మ చెప్పేది - భగవంతుడు మానవులని సృష్టించి భూమ్మీద పడేసేటప్పుడు వాళ్ల ముఖాలమీద వాళ్లు అదృష్టవంతులు అని కొందరికీ, వాళ్లు దురదృష్టవంతులు అని కొందరికీ రాస్తాడట. ఆ రాత ఇక మారదట. కొందరు పుడుతూనే అదృష్టవంతులుగా పుట్టి జీవితాంతం అలాగే వుంటారట. కొందరేమో దానికి విరుద్ధమట. తన జీవితంలో అది నిజం అని తేలిపోయింది. అమ్మ చాలా అనుభవంమీద చెప్పినమాట. ఎప్పుడూ జీవితంతో రాజీపడుతూ ఇంతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటూ బ్రతకడమే అలవాటు చేసుకున్న గోమతి, ఇవ్వాళ అలా సరిపెట్టుకోలేక దుఃఖపడుతోంది. ఇంతవరకూ తనకేదీ లభించలేదు. తను దేన్నీ కోల్పోలేదు. తన దగ్గర ఏమీ లేదు. కానీ ఇవ్వాళ తన దౌర్భాగ్యపు జీవితంలోకి వెలుగు రేఖ వచ్చిందని ఒక్క క్షణం సంతోషించేసరికి, ఆ రేఖ మాయమైపోయింది. అందుకే గోమతికి దుఃఖం ఉపశమించడం లేదు. ఆ దుఃఖపు వెల్లువకే శక్తి వుంటే అది ఈ కపట ప్రపంచాన్నంతా ముంచి తనలో ఇముడ్చుకుని వుండేది. కాని ఆ దుఃఖానికి శక్తిలేదు. అది తనలో తానే ఇమిడి పోవల్సిన దుఃఖం, ప్రపంచాన్ని ముంచివేసే శక్తి దానికి లేదు. అదివరకు ఎంతటి బాధనైనా, ఎంతటి దుఃఖా న్నయినా అవలీలగా దిగమింగుకుని నిర్లిప్తంగా బ్రతక డానికి అలవాటుపడిన గోమతికి, ఎంత తుడుచుకున్నా కంటితడి అరడం లేదు. కన్నీళ్ల తడికి ఆమె గుండెమంట చల్లారడం లేదు.

"మన గోవు మంచిగా చదువుకుంటుందండీ...దానికి డాక్టర్ చెప్పించాలి" అనేది అమ్మ, తన చిన్నప్పుడు. ఆవిడ తనని ముద్దుగా

గోవు అని పిలుచుకుంటూ, గోవులా ఎలా వుండాలో నేర్పుతూ పెంచింది. తను కనీసం మెట్రిక్ అయినా చదవకముందే నాన్న పోవడం, కుటుంబ పరిస్థితి తల్లక్రిందులైపోవడం, అన్నయ్య ఉద్యోగం మీద వదినే కాకుండా అమ్మా, తనూ కూడా ఆధారపడ్డం, వదినె ఉద్యోగంలో చేరడం, అమ్మ ఆ ఇంటి పనిమనిషిగా, మారడం అన్నీ జరిగిపోయాయి, చాలా వేగంగా. అప్పుడే అమ్మ తనకి చెప్పింది కొందరు దురదృష్టవంతులుగా పుడతారనీ తను ఆ జాతికి చెందిందనీను.

అమ్మకి జీవితానుభవంవలన ఎన్నో నిజాలు అర్థం అయ్యాయని, ఆవిడ చెప్పేవన్నీ సత్యాలని గోమతి నమ్మింది. దానికి తగ్గ రుజువులు కూడా దొరికాయి ఆమెకి. ఆవిడ అనారోగ్యానికి గురవడం, దానికి తగ్గ ఖరీదైన మందులూ, ఖరీదైన ఆహారం యిప్పించలేక పోవడం వలన ఖాళీ అయిన పనిమనిషి స్థానాన్ని తను భర్తీ చేయడం కూడా వెంటవెంటనే జరిగిపోయాయి.

తల్లిదండ్రులు యిచ్చిన ఆస్తులేం లేకుండా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్న అన్నావదినెలు గోమతి పెళ్ళిగురించి ఆలోచించారు గానీ, అది వాళ్లకి అందుబాట్లో లేదని అర్ధమై మౌనం వహించారు. గోమతి ఇంటిలో ఏదో ఒక చీర కట్టుకుని బుద్ధిగా పనిచేస్తూ పడి ఉండటం వలన వాళ్లకి ఆమె గుండెలమీద కుంపటిగా కాక, ఉద్యోగాలు చేసుకుని ఇంటికొచ్చే వేళకి అన్నీ అమర్చిపెట్టే మనిషిగా తెలిసి వచ్చి, ఆమెని పోగొట్టుకోడం ఇష్టంలేక కూడా కొంత మౌనం వహించారు. అలా అలా గోమతికి వయస్సు పెరుగుతూనే వచ్చింది. సూదికి దారం ఎక్కకపోవడం, బియ్యంలో పురుగులు కనపడకపోవడం, అక్షరాలు కనపడకపోవడం మొదలెట్టాయి.

"అక్షరాలు కనపడకపోతే పీడాపోయె బియ్యంలో పురుగులు కనపడకపోతే ఎలా, వెళ్ళి కళ్ళజోడు వేయించుకో- చత్వారం వచ్చింది కాబోలు... నలభై వచ్చినాయి... నాకన్నా మూడేళ్లు పెద్దటగా నువ్వు- మీ అమ్మ అంటుండేది" అని డబ్బులు కూడా ఇచ్చి కళ్లజోడు, వేయించుకురమ్మని పంపింది వదినె.

సరిగ్గా అప్పుడే గోమతి జీవితం మలుపు తిరిగింది. క్రిమినల్ లాయరుగా పేరుప్రఖ్యాతులు బాగా వున్న ప్లీడరు సుందరరావుగారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్త పెళ్లిళ్ల పేరయ్య పరమేశ్వరం చెవిన పడింది. ముందు ఆయన కొంచెం ఆశ్చర్యపడి, ఆ వెంటనే సంచి పుచ్చుకుని బస్సెక్కి, సుందరరావుగారింటికి వెళ్ళి ఆయన అక్కగారైన స్వరాజ్యలక్ష్మిగార్ని కలిసి పెళ్లి విషయం ప్రస్తావించాడు.

ఆవిడ పరమేశ్వరాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుడే ప్రత్యక్షమైనంత ఆనందంగా ఆహ్వానించింది. "అవును పరమేశ్వరం. సుందరం పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నేనే నీకు కబురు పెడదా మనుకుంటున్నాను. ఎక్కడైనా సంబంధం చూడు" అంది. "మరి భార్య. పోయి పన్నెండేళ్ళాయె! ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నట్లు. అహ.. అతనికి ఈడుమించిందని కాదు. మగవాడికి ఈడేమిటిలే" అన్నాడు పరమేశ్వరం.. "అప్పుడేమో పిల్లలు చిన్నవాళ్ళు. సవతి తల్లి వాళ్లనెలా చూస్తుందోనని వాడు పెళ్లిచేసుకోలేదు. పైగా నా వంట్లో ఓపిక వుండేది. ఇప్పుడు నేనూ పెద్దదాన్నయినాను. పిల్లలూ ఎదిగారు. ఆడపిల్ల పెళ్ళిచేసుకుని వెడుతుంది. మగపిల్లవాడు చదువుకు వెడతాడు. ఈ వయస్సులో నన్ను, వాణ్నీ కనిపెట్టుకుండే బొమ్మ కావాలిప్పుడు మాకు" అందావిడ.

"ఆంధ్రదేశంలో ఆడపిల్లలకేం కొదవమ్మా కట్నం ఎంతలో ఉన్నట్లు."

"కట్నంలేదు. ఏం లేదు పరమేశ్వరం. మంచి బుద్ధిమంతు రాలైన అమ్మాయిని చూడు'.

"మా వూళ్లో లాయర్ సుశీలగారున్నారు. ఆవిడకీ నలభై రెండేళ్ళు. ఇప్పుడిప్పుడే ఆవిడకీ పెళ్లి మీద ఆలోచన పోయింది. లాయరు సుశీలగారైతే సుందరంగారితో పాటు కోర్టు పనీ అది చూస్తారు. పైగా ప్రాక్టీసులో సాయం చేస్తారు. ఏమంటారమ్మా"

"మనకి లాయర్లు, డాక్టర్లు వద్దు పరమేశ్వరం! వాళ్లకి కూడా చేసిపెట్టే వాళ్ళెవరిక్కడ. మంచి పనిమంతురాలైన అమ్మాయిని నలభై అయినా ఫరవాలేదు కాస్త పొంకంగా వున్న అమ్మాయిని చూడు. కావాలంటే పెళ్లి ఖర్చుకు బట్టలకి మనమే కాస్త డబ్బిద్దాం" అన్నది. స్వరాజ్యలక్ష్మి.

"మరి సుందర్రావుగారిని కూడా అడగడం మంచిది కదా! ఆయనేమంటారో" “వాడి మొహం! అస్తమానూ కేసులూ వాడూను. వాడికేం కావాలో వాడికేం తెలుసు పరమేశ్వరం. నేను చెప్పినట్లు అన్నివిధాలా సరిపోయే సంబంధం చూసుకురా" అన్నది ఆవిడ. సుందర్రావుగారి అక్కగారు స్వరాజ్యలక్ష్మిగారు.

స్వరాజ్యలక్ష్మిగారు తన యిరవయ్యో ఏటనే వితంతువై, కొంత ఆస్తి మనోవర్తిగా తీసుకుని తమ్ముడింటికి వచ్చారు. అవిడ ఆస్తి, ప్రస్తుతం సుందర్రావుగారు నివసిస్తున్న భవంతి. కొన్ని కాసుల బంగారం, కొంత వెండి చాలా సామాను వగైరాలు. తమ్ముణ్ని తను కనిపెట్టుకుని వుండడం, తమ్ముడు తనను వృద్ధాప్యంలో చూసుకోవడం వారి ఒప్పందం, ఆ ఒప్పందం ప్రకారం ఇప్పటివరకూ జరుగుతూ వచ్చింది. సుందర్రావు గారి మొదటి భార్య వరలక్ష్మి కూడా రాజ్యలక్ష్మిగారి కనుసన్నలలో మెలుగుతూ వుండేది. ఆమె పోయినాక పిల్లల్ని సవతితల్లి సరిగ్గా చూడదేమోననే భయంతో తనూ, అతనూ కూడా పెళ్ళిమాట తలపెట్టలేదు. అయితే ఎంతటి దుఃఖానికైనా కాలపరిమితి వుంటుందనీ అది సహజమైన కోర్కెలకి అడ్డుకట్ట వేయజాలదనీ ఆ సహజ వాంఛా పరిపూర్తి కోసం మనుష్యులు వేరే మార్గాలు వెతుక్కోవలసి వస్తుందనీ ఆమెకి త్వరలో అర్ధమైంది. పోనీ ఎవరిబాధలు వాళ్లవి... అని సరిపెట్టుకోలేని పరిస్తితి ఏర్పడింది.

ఆ ఇంట్లో పనిచేసే పనిమనుష్యులు కొందరు, వంటమనుష్యులు కొందరు ఆయన్ని ఆకర్షించడం ఆ విధంగా వారు ఆ ఇంట్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించ డానికి ప్రయత్నించడం.. వార్ని తను పనులలో నించి తొలగించి, ఇంటిని శుభ్రం చేస్తూ వుండటం ఈ కార్యక్రమంలో అలసిపోయిన స్వరాజ్యలక్ష్మిగారు సుందరరావుని చూసుకోడానికి, అతని సహజమైన కోర్కెలు తీర్చడానికి చట్ట సమ్మతమైన మనిషి అవసరమేననే నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రయత్నంలో లాయర్ సుశీల కూడా కబుర్లు పంపింది గానీ లాయర్ సుశీల తనకిష్టంలేదు. తమ్ముడికి భార్య అవసరం కానీ ఇంట్లో లాయర్ల అవసరం లేదని స్పష్టంగా గ్రహించింది ఆవిడ.

ఆ విధంగా ఆజ్ఞ అందుకుని ఇంటికి వచ్చిన పరమేశ్వరం, తన భార్య తాయారమ్మతో సుందర్రావుగారికి ఎలాంటి అమ్మాయిని చూడాలో వివరించేడు. ఆవిడ ఆ సంగతి వినంగానే, "అదేమిటండీ! ఎవరో ఎందుకు మన వెంకట్రావు చెల్లెలు గోవుందికదా! పాపం దాన్ని ఓ ఇంటిదాన్ని చేసి పుణ్యం కట్టుకోండి, వాళ్ల వదినె కట్నం ఇచ్చి దానికీ జన్మలో పెళ్లి చెయ్యదు. దానిక్కూడా మొన్న మొన్ననే నలభై దాటాయి. తల్లిలేని పిల్ల, పదేళ్లు తేడా ఫరవాలేదులెండి. మీ పుణ్యాన అది సుఖపడుతుంది" అని కర్తవ్యం బోధ చేసింది. పరమేశ్వరానికి భార్య సలహా బాగా నచ్చింది. రెండో పెళ్ళివాడి సంబంధమా అని వెంకట్రావు భార్య పరమేశ్వరాన్ని తిట్టి సంబంధం కుదరకుండా వీలైనంత అడ్డుపడింది గానీ, పాపం వెంకట్రావు ఈ విషయంలో తన చెల్లెలి పక్షాన నిలబడి పెళ్ళి జరిపించాడు.

ఆ విధంగా గోవు ఆ ఇంట్లో అడుగుపెట్టింది.

'అమ్మాయ్ గోమతీ! ఇలారా తల్లీ!' అని ఎంతో అప్యాయంగా పిలిచే స్వరాజ్యలక్ష్మిగారు. "పిన్నీ" అని గౌరవించే పిల్లలు--పెద్ద ఇల్లు, నగలు చీరలు మంచి భోజనం, అంట్లు తోమడానికి పనిమనిషి, బట్టలుతకడానికి చాకలి- గోమతికి బాగానే వుంది ఆ జీవితం.

తన దురదృష్టపు జాతకంలో మార్పువచ్చి అదృష్టం ప్రవేశించిందేమోనని ఆమె అనుకోబోయింది కానీ--

స్వరాజ్యలక్ష్మిగారు తనని అమ్మాయ్ తల్లీ అని సంబోధించడం పని చేయించుకోడానికేననీ, పిల్లలు పిన్నీ అని గౌరవించడం పైపైకేననీ, తనతో వారికెలాంటి స్నేహభావం లేదని, సుందర్రావుకి తను కేవలం భోజనం పెట్టి తదితర అవసరాలు తీర్చే మనిషేనని గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు గోమతికి, మళ్లీ తను గోవులా వుండాల్సిందేనని తెలుసుకుని అలాగే వుంటూ వచ్చింది. వాళ్లు తన పేదరికాన్ని, అప్పుడప్పుడు ఎత్తిచూపి, తనకి ఎలాంటి సౌకర్యాలు కలుగజేసి మేలు చేస్తున్నారో గుర్తుచేసి, తన ద్వారా మరింతసేనను మరింత కృతజ్ఞతా భావాన్ని పిండుకోడానికి ప్రయత్నిస్తున్నారనీ, తనని ఆ ఇంట్లో ఒక సభ్యురాలిగా వారి మనిషిగా చూడ్డంలేదేవి గోమతి గ్రహించింది. తనని ఎవరు మాత్రం తమ మనిషిగా చూశారు? అమ్మపోయినాక వదినె అన్న ఎవరూ చూడలేదు. తనే తన మనిషి, తనే తన మిత్రురాలు, తన దురదృష్టమే తన స్నేహితురాలు, అనుకుంది గోమతి. సరిగ్గా అప్పుడే గోమతి శరీరంలో మరో ప్రాణానికి అంకురార్పణ జరిగింది. ఆ విషయంఎంతో ఆనందంతో సుందర్రావుకు చెప్పింది.

అక్కడ ప్రారంభమైంది ఇంకో కథ- “ఇదెంత మాత్రం వీల్లేదు గోమతీ. ఎంత మాత్రం వీల్లేదు. మా కిరణ్మయికి పెళ్ళయి దానికి బిడ్డ పుడితే నేను తాతయ్యనవుతాను. ఇప్పుడు నువ్వు మళ్లీ తండ్రిని చెయ్యడానికి వీల్లేదు. నా పరువేం కావాలి. ఈ వయస్సులో నాకు పిల్లలేమిటి? నీకు నలభై ఏళ్లొచ్చాయి. కిరణ్మయి, బాబూ వాళ్లే మన పిల్లలు. వాళ్ళు నిన్ను స్వంత అమ్మకన్నా ఎక్కువ ప్రేమిస్తారు అన్నాడు ఆయన. "ఈ ఒక్క నలుసుని నాకు దక్కనీయండి మిమ్మల్నేం అడగను" అని ప్రాధేయపడింది గోమతి.

'విను గోమతి నీకింకేం కావాలన్నా అడుగు. మేం నిన్ను సరిగ్గా చూడం అనుకుంటే నీ పేర కొంత డబ్బు బ్యాంక్ లో వేస్తాను. వరలక్ష్మి నగలలో సగం యిప్పుడే నీకిస్తాను. నెలనెలా నీ పేర రికరింగ్ డిపాజిట్ కడతాను. నేను పోయాక నీకొచ్చేలా ఇంకో ఇన్సూరెన్సు సాలసీ తీసుకుంటాను. 'అవన్నీ నాకవసరంలేదండీ నేను డబ్బులో పుట్టి పెరగలేదు. వున్నదాంతోనే నాకు సంతృప్తి కానీ నా బిడ్డ అనేది ఈ ఒక్కటే'.. "నా మాట విను గోమతీ. ఈ బిడ్డ పుట్టడం వలన ఎన్నో సమస్యలొస్తాయి. తార దగ్గర ఎబార్షన్ చేయించుకో ఈ వయస్సులో పిల్లల్ని కవడం బాగోదు."

ఈ వయస్సులో పెళ్లిచేసుకోవడం బాగుందా? ఈ వయస్సులో వయసొచ్చిన ఆడపిల్ల పడకగది ప్రక్కన భార్యతో పడుకోడం బావుందా? ఈ వయస్సులో జుత్తుకి రంగువేసుకోవడం బావుందా వంటికి స్ప్రే సెంట్లు కొట్టుకోడం బావుందా? అని గోమతి అడగలేదతన్ని.

"అవునమ్మా వాడు చెప్పిందే సబబు. నువ్వు కూడా ఆలోచించు, మనవడు పుట్టే ఈడులో కొడుకులేమిటమ్మా నీవు మాత్రం వయస్సులో తక్కువా? నీ ఈడు నిజంగా కిరణ్మయంత కూతురుండవలసిన మాట..' అని సన్నాయి నొక్కులు నొక్కింది ఆవిడ వృద్ధ మహారాణి--జంబుకం. ఇలా రెండురోజుల అనంతరం తనకి తెలియకుండా తను ఇక్కడ ఈ హాస్పిటల్లో తన సర్వస్వం పోగొట్టుకుని వొట్టి చేతుల్లో మళ్లీ సుందరరావుగారింట్లో తేలింది గోమతి.

అవతలగదిలో అందరూ టీవీ చూస్తున్నారు. "అమ్మా గోమతీ నువ్వుకూడా వచ్చి కూర్చో ఒక్కతినే ఏం పడుకుంటావు? పోయిన దానికి బాధపడకూడదు. నువ్వులా వుంటే మాకేం బావుండదు అని చెయ్యిపట్టుకుని లేవదీసింది ఆవిడ, వృద్ధమహారాణి.

గోమతి లేచి వెళ్ళి హాలులో కూర్చుంది. అందులో ముగ్గురాడవాళ్లు.... స్త్రీలు చాలా పురోగమించారని, ఇందిరాగాంధీ దానికి ఉదాహరణ అనీ, స్త్రీలు విమానాలు నడిపేస్తున్నారని బిజినెస్ చేస్తున్నారనీ, స్త్రీలు గవర్నర్లు అయ్యారనీ, పది పేర్లని పదేపదే చెప్పి, ఈ పది మంది స్త్రీల ప్రగతే భారతదేశ స్త్రీల గతి అని, నొక్కి వక్కాణించింది. ఇంకొకావిడ నీతో పూర్తిగా ఏకీభవిస్తాననీ - నేనుకూడా అశావాదినని చెప్పింది. మొత్తానికి అందరూ కలిసి ప్రపంచం అంతా సుఖంగా వుంది అని, అంతా ప్రగతే తప్ప ఇంకేంలేదనీ అందరూ కూడా వెండి అంచుల్నే చూడాలిగాని, నల్ల మబ్బుల్ని చచ్చినా చూడకూడదనే తీర్మానించి, చిరునవ్వులు నవ్వి నమస్కారాలు పెట్టేశారు.

గోమతికి వాంతి, దానితో పాటు దుఃఖము కలిగింది నలభై కోట్ల స్త్రీ లోకంలో ఇరవైమంది అత్యున్నత స్థానంలో వున్నారని మురిసిన స్త్రీలని చూసి. వెంటనే ఆమెకి తారాదేవి హాస్పిటల్లో నాలుగో కాన్పులో తన బ్రతుకో చావో తేల్చుకోడానికి సిద్ధమవుతున్న పూచిక గుర్తొచ్చింది. మాయచేసి మత్తుపెట్టి ఎబార్షన్ చేయించిన తను గుర్తొచ్చింది. స్వంత కొడుకు ఇంట్లో పనిమనిషి కన్నా హీనంగా బ్రతికిన అమ్మ గుర్తుకొచ్చింది. నూతిలో పడి చనిపోయిన స్నేహితురాలు కాత్యాయిని గుర్తుకొచ్చింది. పూచిక బ్రతికిందా! ఆమెకి ఈసారి మగపిల్లవాడు పుట్టాడా? అయ్యో! అనుకుంది గోమతి.

మరునాడు ఇంజెక్షన్ చేయించుకోడానికి హాస్పిటల్ కి వెళ్లిన గోమతికి పూచిక తల్లి ఫ్లాస్కుతో ఎదురైంది. 'మీ అమ్మాయి ప్రసవించిందా? ఎలావుంది? అనడిగింది గోమతి.

'ప్రసవించిందమ్మా-మళ్లీ ఆడపిల్లే. అల్లుడు నిన్నటినించీ హాస్పిటల్ గుమ్మం తొక్కలేదు'. అని కళ్లు తుడుచుకుంది.

ఇంజెక్షన్ చేయించుకుని ఇంటికి వచ్చిన గోమతికి గుమ్మంలో ఎదురైన స్వరాజ్యలక్ష్మి మనిషి వేషంలో వున్న తోడేలుగా కనిపించింది. తను ఇంటికి వచ్చి రెండు రోజులయినా ఇంతవరకు కన్పించని ప్లీడరుగారు పెద్దమనిషి మొహం తగిలించుకున్న దొంగలా అనిపించేడు. హైకోర్టులో ఆర్జెంటుకేసుండి హైద్రాబాద్ వెళ్లినట్లు చెప్పారు. అవునూ ఏమయినట్టు ఆయన. కానీ, నిజం అది కాదనీ, వేసక్టమీ చేయించుకోడానికి అక్కడున్న డాక్టర్ మిత్రుడి దగ్గరకు వెళ్లాడనీ, వున్న వూల్లో ఆ పని చేయడానికి ఇష్టం లేకపోయిందనీ తరువాత తెలిసింది గోమతికి. ఆమె కళ్లల్లో నలభై ఏళ్ళుగా కాపురం వుండిపోయిన బెరుకు బెదురు దైన్యం నిస్సహాయత మాడి మసి అయిపోయేలా ఒక్క చూపు చూసింది గోమతి.

అప్పుడు తన పాలు పితుక్కుని, పితుక్కుని రక్తం పిండుకోడానికైనా వెనుదీయని మనుష్యుల్ని, వారి హింసాప్రవృత్తినీ అర్థం చేసుకున్న గోవు ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలాగా రంకెవేసి తన కొమ్ముల్లో కనబడ్డ వారినల్లా పొడిచిపాడించి కుమ్మికుమ్మి వదిలినట్లు గోమతి విశ్వరూపం దాల్చింది. అప్పుడామెకి తోడేలు మొహం తగిలించుకున్న స్వరాజ్యలక్ష్మి అసలు ముసలిస్వరూపం కనిపించింది. దొంగమొహం తగిలించుకున్న ప్లీడరుగారి పిరికిమొహం కనిపించింది. వాళ్ల మేడ, వాళ్ల సంపద, వాళ్ల నగలు పనికిరాని పేకముక్కల్లా కనిపించాయి. తోడేలు మొహాన్ని ఊడదీసి కసువులో పారేసింది. దొంగమొహాన్ని ఉతికి పెరట్లో ఆరేసి, నిజం మొహంతో తిరగరా పిచ్చి నాయనా... అని గాండ్రించింది. పూనకం వచ్చిన దానిలా గర్జించింది. ఆమె ఆజ్ఞ లేనిదే ఇంట్లో ఎవరూ ఏమీచేయడానికి వీల్లేదని శాసించింది.

అయినా ఆమె ఆవేదన అణిగిపోలేదు. ఆమె పగ చల్లారలేదు. ఆమె శోకం క్రోధాగ్ని అయి ఆ ఇంట్లోవారి ఆహంకారాలను, నిలువెల్లా దహించింది. ఆమె వంటింట్లో నుంచీ వీధిలోకి వచ్చింది. పూచికపుల్లల్నీ గోవుల్ని పోగేసి ఇది మీ బ్రతుకు అని చెప్పింది. తమ్ముడికి పెళ్ళిచేసి అప్పనంగా పనిమనిషిని తెచ్చుకున్న సంతోషం హరించిపోగా,'పొట్లగొడ్డు'ని చూసి హడలిపోయి మంచం పట్టింది స్వరాజ్యలక్ష్మి

గోమతి తన పడకగదిలోకి ప్రవేశాన్ని నిషేధించాక, ఆ తలుపులు తన కోసం ఇక తెరుచుకోవని తెలిసినాక, ఇండియన్ పీనల్ కోడ్ లోని ఏ సెక్షన్ ప్రకారం తనకిలాంటి శిక్ష పడిందో అర్థం కాలేదు సుందరరావుకి.

 

(ఉదయం వారపత్రిక ఉగాది ప్రత్యేక సంచిక 1990.)

కామెంట్‌లు