9. ఒక రాణీ - ఒక రాజా



 




అమెరికాలో ఉంటున్న అరుణతో ఛాటింగ్ చేస్తూ విరగబడి నవ్వుతోంది వసంత. పక్కన మ్యూజిక్ సిస్టంలో నుంచి వచ్చే పాట భూమిని అదరగొడుతోంది. "అరగంటనించీ పిలుస్తున్నా... వినపడటంలా?" అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, "పద... దోసెలు తిందువుగాని. అప్పుడే పదయింది, ఇంకెప్పుడు? ఆదివారమయితే అన్ని పన్లూ ఆపడమేనా?” అని కూతుర్ని కసిరింది వసుంధర.

“జస్ట్ హాఫెనవర్ మమ్మీ” అంది వసంత.

"హాఫూ లేదు, అవరూ లేదు పదపద - అందరిదీ అయిపోయింది. నీకు పోసేసి ఆవిడ వంట మొదలెట్టుకుంటుంది. ఇవ్వాళ మీ నాన్నకి పెరుగు వడల మీద మనసైంది. నీకేం కావాలో మరి లంచ్లోకి - త్వరగా చెప్పేస్తే ఓ పనైపోతుంది.”

"ఏదో ఒకటి చేయించు మమ్మీ" అంటూ వచ్చి టేబిల్ ముందు కూర్చుంది వసంత. వంటావిడ వసంత ముందు ప్లేటూ, పచ్చడి, పొగలు కక్కే సాంబారు పెట్టి, దోసె పోసుకురావటానికి వంటింట్లోకి పరిగెత్తింది. అయిదు నిమిషాల్లో అట్లకాడ మీదే దోసె పట్టుకొచ్చి "తినమ్మా, అదయినాక ఇంకొకటి వేస్తా" అని మళ్ళీ స్టౌ దగ్గర నిలబడింది.

వసుంధర వచ్చి కూతురు ఎదురుగా కూర్చుని, "నీకు గురువారం పెళ్ళిచూపులు ఫిక్స్ చేశాం. బుధవారం సాయంత్రం ఆరుగంటలకి 'ఊర్వశి' బ్యూటీ క్లినిక్ అపాయింట్మెంటు తీసుకున్నాను - ఫేషియల్ కోసం. ఆఫీసు నుంచి డైరెక్టుగా అటే వెళ్ళు. డ్రెస్సులేం ఉన్నాయో ఇప్పుడే చూసిపెట్టుకో. చీరె వద్దులే... డ్రెస్ వేసుకో - కాస్త మంచిది చూడు... విన్నావా? మళ్ళీ మరచిపోయానంటావా? నీకు నెలరోజులుగా చెబుతున్నాను  - ఈ నెలలో ఒక సెలవు అడిగి పెట్టుకోమని.”

అమ్మ అడ్డు చెప్పటమూ, సవరణలు చెయ్యటమూ అసంభవం. ఆవిడవన్నీ ఆజ్ఞలే.

"సరే మమ్మీ.”

"పద, బీరువాలో మంచి డ్రెస్సులేం ఉన్నాయో చూద్దాం. లేకపోతే సాయంత్రం ఒకటి కొనుక్కొద్దాం. అప్పుడే లేవకు, ఇంకో దోసె వేసుకొస్తోంది ఉండు" అని, "మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూచోకు. తినంగానే బీరువా దగ్గరికి పద. చెవులకి ఏం పెట్టుకోవాలో, మెడలో ఏం వేసుకోవాలో, గాజులేం బావుంటాయో చూద్దాం” అని, దోసె పళ్ళెం తీసెయ్యమని పనిపిల్లకీ, ఫ్రిజ్లో నుంచి బత్తాయి రసం తీసి వసంతకివ్వమని వంటావిడకీ ఒకేసారి జారీచేసింది వసుంధర.

వంటావిడ తెచ్చిచ్చిన బత్తాయి రసం గడగడ తాగేసి, 'ఇకపోనా?' అన్నట్టు చూసింది వసంత.

"పద... బీరువా దగ్గరికి” అని కూతుర్ని దాదాపు లాక్కుపోయి, చెవులకీ, మెడలోకీ, ఏం వేసుకోవాలో తనే ఎంపిక చేసిపెట్టి, ఒక డ్రెస్సు కూడా బయటికి తీసి, "దాన్ని బయటుంచు, మరోసారి ఇస్త్రీ చేయిస్తా” అంటూ “ఇకపో” అని ఆమెని విడుదల చేసింది. అమ్మ లంచ్ కి  పిలిచేదాకా హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. లంచ్ కి అరగంట ముందు స్నానానికి పరుగెత్తి, ఆ పని కాస్తా ముగించి, భోజనం కానిస్తే, సాయంత్రం 'టీ' దాకా మళ్ళీ అమ్మ కదిలించదు. ఆదివారం కదా వదిలేస్తుంది... అనుకుంటూ వసంత మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూర్చొని అరుణతో, రవితో, నిర్మలతో ఛాటింగ్ మొదలుపెట్టింది.

అంతలో వసుంధర వచ్చి ఒక పసుప్పచ్చ కాగితం మీద 'బుధవారం సాయంత్రం అయిదింటికి బ్యూటీపార్లర్', 'గురువారం పొద్దున పదింటికి పెళ్ళిచూపులు' అని రాస్తే కంప్యూటర్ ఎదురుగా అతికించి వెళ్ళింది. వసంతకి పది రోజులనాడే ఇరవై మూడో ఏడు వచ్చింది.  నాలుగు నెలలనాడు ఉద్యోగం వచ్చింది. మూడు నెలల కిందట ఇంజినీరింగ్ డిగ్రీ వచ్చింది. నాలుగు నెలలనాడు ఉద్యోగం రావటం అంటే, డిగ్రీ పాస్ అవకముందే క్యాంపస్ ఇంటర్వ్యూలో నన్నమాట. ఇప్పుడు పెళ్ళి సంబంధం వచ్చింది. అమ్మ దృష్టిలో చాలా 'యోగ్యమైన సంబంధం',

'మీ అమ్మకి నచ్చిందంటే, ఇక తిరుగేలేదు' అన్నాడు నాన్న.

ఫొటోలో కుర్రవాడు బాగానే వున్నాడు.

*

“ఇదుగో..." ఈ నాలుగు ఫొటోలూ చూడు. అందులో ఏది నచ్చిందో చూడు" అంది.

వాళ్ళకీ ఒక్కతే పిల్ల. చాలా బ్రిలియంట్. నీకు లాగానే చిన్నప్పటినించీ ఇంగ్లీషు మీడియం స్కూలు చదువు... ఆపైన ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంకు... క్యాంపస్ ఉద్యోగం... మొహంలో మంచి స్పార్క్ వుంది. మాకయితే ఈ సంబంధంబాగా నచ్చింది" ఏకకంఠంతో అమ్మా, నాన్నా అమ్మాయికి ఓటేశారు.

అవును, వాళ్ళకీ ఊళ్ళో ఇల్లుంది. ఆవిడ పిల్లని చదివించటానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందిట. ఆయనది పెన్షనబుల్ జాబే... బాగానే సెటిల్ అయ్యారు. ఓకే-  మనకీ కట్నం అక్కర్లేదు. పెళ్ళి గ్రాండ్ చేస్తే చాలు. ఏమంటావ్?" అన్నాడు నాన్న.

సతీష్‌కి ఏం మాట్లాడాలో తెలీలేదు. 'నీకు బైపీసీ వద్దు... నువ్వు చదవలేవు. ఎంపీసీకి అప్లికేషన్ తెచ్చా... ఫిల్ చేశా కూడా...చూడు' అని నాన్న అంటే, 'నాకు డాక్టరవాలని ఉంది నాన్నా' అనాలనుకుని, 'పోన్లే అందులో సీటు రాకపోతే నాన్నకి కోపం వస్తుంది' అనుకుని ఎంపీసీలోనే చేరాడు సతీష్ . 'మాథ్స్‌కి నీకు నరసింహంగారి దగ్గర ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టాను, వెళ్ళు' అంటే 'సరే'నన్నాడు.

"మీ అబ్బాయికి ఐఐటీలో సీటు వచ్చిందిటగా?" అని బంధువులు ప్రశంసిస్తే- “మొదటినించీ గైడెన్స్ అంతా నాదే” అన్నాడు నాన్న. ఒకటో క్లాసు దగ్గర్నుంచీ ఎం.ఎస్. దాకా తనదే గైడెన్స్. ఇక అమ్మేమో చదువుకునే పిల్లలు ఏం తినాలో... ఏం  ఎక్సర్‌సైజ్‌లు చేయాలో... ఇలా ఎప్పుడూ చెబుతూనే వుంటుంది. ఐఐటిలో చేరినా... అమెరికా వెళ్ళినా... అమ్మా నాన్నా - చెవిలో ఇల్లుకట్టుకునే ఉండేవాళ్ళు.

ఒక్కగానొక్క కొడుకు కదా! వాళ్లని ఏ విషయంలోనూ నొప్పించడం సతీష్‌కి ఇష్టం వుండదు. వాళ్ళు ఏం చెప్పినా తన మంచికే గదా! ఇప్పుడు తనింత మంచి పొజిషన్‌లో ఉండటం వాళ్ల చలవ కాదూ!

సరే, ఆ పిల్లనే చూద్దాం. ఇరవై మూడేళ్ళట. ఫోటోలో చూస్తే పదోక్లాసు చదివే కాన్వెంటు పిల్లలా వుంది.

“కట్నానిదేముందండి వసుంధరగారూ... ఈ చేత్తో పట్టుకుంటే ఆ చేత్తో పోతుంది. అదేం వద్దు మంచి మ్యారేజి హాల్ బుక్ చేయండి. ఏసీ తప్పనిసరిగా వుండాలి. క్యాటరింగ్ నంబర్ వన్ వాళ్ళని చూడండి. సరే, మీకు చెప్పేదేముంది... లాంఛనాలనీ ఏముంటాయో మీకు తెలుసుకదా... మా మర్యాదకి భంగం కాకుండా చూడండి..

*

అర్ధరాత్రి ఫోన్ మోగుతుంటే కంగారుగా రిసీవర్ ఎత్తింది వసుంధర.

“ఏంటండీ మీ అమ్మాయికంత పొగరు? అసలు ఒక్కమాట కూడా అర్థం చేసుకోదు.  పని రాదు సరికదా... నేర్చుకుందాం అని కూడా లేదు. నావల్ల కాదు... మూడురోజుల నుంచీ అలిగి కూర్చుంది. ఇండియా పంపటం అంటే మద్రాసుకీ, హైదరాబాద్ తిరగటమా?” సతీష్ గట్టిగా అంటుంటే. నిద్రమత్తు వదిలిపోయింది.

"దానికి ఫోనివ్వు, నే మాట్లాడతా” అంది.

ఫోన్లో, ఏడుపు, వెక్కిళ్ళు, ఏమైందో ఏమిటో!

ఈ మగపిల్లలు పైకి బాగానే ఉంటారు. లోపల ఉత్త మేడిపళ్ళు, ఏం బాధలు పెట్టాడో ఏమిటో... పది లక్షలు వదిల్చారు. కట్నం వద్దు వద్దు అంటూ... అవతల ఫోన్లో వింటాడేమో, ఏమన్నా అడిగితే...

"ఇప్పుడెంతయిందే టైము?” అంటూ, “సతీష్ ఆఫీసుకి వెళ్ళాక ఫోన్ చెయ్యి” అని చెప్పింది. అలాగే చేసింది వసంత.

"ఏం చేసినా నచ్చదమ్మా. వాళ్ళమ్మ చేసినట్టు ఉండదట. పక్కలు దులపలేదంటాడు... కౌంటర్ తుడవలేదంటాడు... నన్నే బట్టలు మెషీన్లో వెయ్యమంటాడు... ఫ్రెండ్స్‌ని పార్టీలకి పిలుస్తాడు... వంటలు వండమంటాడు. హాయిగా మంచి జీతం తెచ్చుకుంటూ ఉండేదాన్ని... ఇట్లా అమెరికా తోలేశావు గదా! డ్రైవింగ్ లైసెన్స్ లేదు... పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదు. జైలు మమ్మీ... జైలు."

"అదేంటీ... అరుణ లేదూ అక్కడ? స్రవంతి లేదూ, ప్రమీల లేదూ? నువ్వొక్కదానివే  - ఉద్యోగం మానుకుపోయావా? మరి ఇంట్లో కాస్త పని చేయకపోతే ఎట్లా? అలవాటు చేసుకో!”

“నువ్వెప్పుడన్నా నాచేత కాఫీ పెట్టించావా? 'అడ్జెస్ట్ చేసుకో, అలవాటు చేసుకో అని కొత్త మాటలు చెప్తావేంటి మమ్మీ? మీరంతా నాకే అడ్జెస్టయిపోయేవాళ్ళు కదా!"

వసుంధర బుర్ర తిరిగిపోయింది.. వెంటనే వియ్యపురాలికి ఫోన్ చేసింది.

ఆవిడ తన కొడుక్కి ఫోన్ చేసి, “ఆ పిల్లకి కాస్త  పనిలో సాయం చెయ్యరా నాయనా... అమెరికాలో అంతా చేస్తారంట కదా?” అంది.

“నా వల్ల కాదు మమ్మీ... నేనెప్పుడూ ఆ పని చెయ్యలేదు. ఇంట్లో పని చేస్తూ కూర్చుంటే నా ఉద్యోగంలో పైకెట్లా వస్తాను? అసలు ఈ పన్లన్నీ చేసుకోవాల్సి వస్తోందనే, నేను పెళ్లికి ఇంత తొందరగా ఒప్పుకున్నాను. ఉద్యోగమూ చెయ్యక... ఇంట్లో పనీ చెయ్యక... ఆ మహారాణి ఏం చేస్తుందిట? నీకు తెలుసా... పక్కన టెడ్డీ బేర్ లేనిదే నిద్రపోదు”

ఆవిడ తిరిగి వసుంధరతో, “మా అబ్బాయికి ఫోన్ చేసాను వసుంధరగారూ! వాడొకటే గోల, మీ అమ్మాయి కనీసం కాఫీ మేకర్‌లో నీళ్ళు కూడా పొయ్యదట. ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటుందట. శుభ్రంగా ఇండియాలోనే ఇచ్చుకుని ఉంటే ఇంటినిండా నౌకర్లుండేవాళ్లు”

 “అవునండి. నిక్షేపంగా నెలకి పాతిక వేలతో ప్రారంభమైన ఉద్యోగం మానుకుని వెళ్లింది. నాదే ఈ తప్పంతా” అంది వసుంధర, కోపం దిగమింగుకుంటూ.

అదే ఇండియాలో వుంటే, అసలేం చేస్తున్నదో ఒకసారి చూసి రావటానికన్నా వుండేది కదా! ఒక పనిపిల్లని పంపి వుండేది. ఉండీ ఉండి ఆ కోపం అంతా తన తల్లి మీదకి తిరిగింది.. వసంత పుట్టినప్పుడు పురుడు పొయ్యటానికి వచ్చింది. “దీంతో ఉద్యోగం ఎట్లా చేసుకుంటావ్? నే తీసుకుపోయి పెంచుతా. నాకు మాత్రం చేసే పనేముందీ ఇంటి కాడ. కాలక్షేపంగానూ వుంటుంది... నీకూ హాయిగా వుంటుంది. అల్లుడిని కూడా అడుగుతాలే” అంది. ఇంటి దగ్గర ఎవరూ వుండరు. ఎప్పుడూ పనికి ఒక పిల్ల వుంటుంది. పసిదాన్ని ఎత్తుకోటానికి కూడా. అమ్మకి శ్రద్ధ ఎక్కువ. కంట్లో వత్తులు వేసుకుని మరీ చూస్తుందని, సరే అంది.

ఆరునెలలపాటు అమ్మ తన దగ్గరే వుండిపోయింది. ఆ తరవాత వసంతని తీసుకు వెళ్ళిపోయింది.

పదేళ్ళు వచ్చేదాకా తనే పెంచింది. మంచినీళ్ళు ముంచుకు తాగడం, తాగిన గ్లాసు కింద పెట్టడం కూడా తెలీకుండా పెంచింది అమ్మమ్మ. ఎవరికైనా ఏదైనా చిన్న పని చేసిపెట్టొచ్చు, అని కూడా తెలీకుండా చేసింది.

"నువ్వే దాన్ని బాగా చెడగొట్టావు" అని ఫోన్లో తల్లి మీద బాగా అరిచింది వసుంధర. "నేను పెంచింది పదేళ్ళు... నువ్వు పెంచింది పదమూడేళ్ళు. నేను పెంచినప్పుడది పసిపిల్ల. నువ్వు పెంచినప్పుడు ఊహ వస్తున్న పిల్ల. అయినా నేనెందుకు నీ కూతుర్ని పెంచాను? నాకు లేని చదువూ ఉద్యోగం నీకున్నాయనీ... నువ్వు స్వతంత్రంగా బతకాలనీ... పిల్లకు, ఉద్యోగానికి నువ్వు న్యాయం చెయ్యలేవనీ. ఆ సంగతి అర్థం చేసుకో ముందు.. వంట రాకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. ముందు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరేటట్టుగా చెయ్. లేకపోతే పోయి అక్కడుండి, వండిపెట్టు. మధ్యలో నామీద అరుస్తావేమిటి?” అంది ఆవిడ.

"నీకు వంట చేసి పెట్టే పిల్లే కావాలంటే చదువుకున్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నావురా?” అంది చివరకు సతీష్ తల్లి విసిగిపోయి.

"అదేంటమ్మా, మొదట్నించీ మీరే కదా... నాకేం కావాలో, ఎట్లా అయితే నేను సుఖంగా ఉంటానో చెబుతున్నారు. మీరు చెప్పినట్టే వింటున్నానా లేదా? మీరా అమ్మాయిని సెలెక్ట్ చేశారు. నేను సరే అన్నాను. నీకన్నీ తెలుసుకదా, అనుకున్నాను” అన్నాడు సతీష్.

“పూర్వంలాగా ఇప్పుడమ్మాయిల్ని, నీకు వంటొచ్చా? ఇంటిపని చేస్తావా? అని అడగడం మర్యాద కాదు. అయినా ఎంతమంది పిల్లలు అమెరికా పోయి పన్లు నేర్చుకోటంలా? ఇదంతా ఎందుకుగానీ, అక్కడ ఇండియన్ రెస్టారెంట్లూ, ఇండియన్ గ్రాసరీ స్టోర్లూ బాగానే ఉన్నాయంట కదా... బయట తినండి కొన్ని రోజులు” అంది సతీష్ వాళ్ళమ్మ.

"బాగానే ఉంది నీ సలహా. తిండి సరే... ఇల్లు కంపుకొట్టి పోతోంది" అని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్ .  

“అతనితో నాకసలు ఫ్రెండ్ షిప్ కుదరటం లేదే... టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ మేల్" అంది వసంత, అరుణతో ఫోన్లో.

“ఎంగేజ్మెంటయ్యే దాకా మీకు ఒకరి గురించి ఒకరికేమీ తెలీదయ్యే, సర్టిఫికెట్ల గురించి తప్ప. మరి ఇలాగే వుంటుంది. పోనీ కొన్నాళ్ళు ఇండియా పో” అంది అరుణ.

“అది కూడా అయింది. పెళ్ళికి బోలెడు ఖర్చు పెట్టాట్ట... అప్పుడే టికెట్లు కొనడం తనవల్ల కాదట. చెప్పేశాడు.”

అరుణకి ఏం చెప్పాలో తెలీటం లేదల్లే వుంది. టెలిఫోన్ ఆ కొస నుంచి నిశ్శబ్దం...

“మంచి ప్రాజెక్టు చేస్తూ మధ్యలో ఉద్యోగం వదిలేసొచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ వుండేది. ఇంకో ఆరునెలలు ఉంటే నేనే టీం లీడర్ అయ్యేదాన్ని. అసలు నన్ను వొట్టి 'హోమ్ మేకర్' కింద చూస్తాడు. నాకతనితో ఫ్రెండ్ షిప్ కుదరడం అసంభవం అరుణా, అసలు అర్థం చేసుకునే గుణం లేదు. చిన్న సహాయం కూడా చెయ్యడు... నీకు తెలుసా? వంటమ్మాయి రాకపోతే, అమ్మ ఎక్కడికైనా వెడితే, నేనూ నాన్నా బయటే తినేసేవాళ్ళం. హాయిగా సినిమాకి పోయేవాళ్ళం.”

"మనకి మన అమ్మలూ, నాన్నలూ శుభ్రంగా ఉండటం, అందంగా హుందాగా కనిపించటం, మంచి ర్యాంకులు తెచ్చుకోవటం నేర్పిస్తారు. పుట్టినరోజు పార్టీలు చేయటం, మంచి తిండి పెట్టడం, 'మంచి' మొగుణ్ణి చూడ్డం... వంటివన్నీ చేస్తారు. మనకు ఆలోచించే అవసరం కలిగేలా చెయ్యటం... స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తిని సమకూర్చడం... సమస్యలెదురైతే అదరక, బెదరక నిలబడే ఆత్మవిశ్వాసాన్నివ్వడం... ఇలాంటివేవీ వాళ్ళ దృష్టిలోకి రానేరావు. మనకి అన్నీ అమర్చినట్టే, మన బదులు కూడా  వాళ్ళే ఆలోచించి పెడతారు. ఇప్పుడిది మరీ ఎక్కువైపోయింది. నువ్వే కాదు... సతీషూ అంతే. మీకేం కావాలో ఆలోచించుకోవాల్సిన అవసరమే ఇంతదాకా మీకు రాలేదు. అందుకే ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలలాడుతున్నారు. మీరిద్దరూ వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. ఇక్కడ అది చాలా మామూలు.”

"ఏం కౌన్సిలింగో ఏమిటో... నిజం అరుణా, మా ఇంట్లో నేనెప్పుడూ టీ కప్పు కూడా కడగలేదు. కనీసం సింక్‌లో కూడా పడేసేదాన్నికాదు. పనమ్మాయి నా చేతిలోంచి అందుకుని పోయేది. ఇక్కడేమో బాత్రూంలు కడగలేదని సతీష్  గొడవ! పోనీ తను కడగొచ్చు కదా ఎప్పుడైనా? అవన్నీ తప్పించుకోటానికే పెళ్ళి చేసుకున్నానని సిగ్గు లేకుండా చెప్పేశాడు.”

"చూడు వసంతా! నా మాట విని మీరిద్దరూ కౌన్సిలింగ్ తీసుకోండి. అతను రానంటే నువ్వే వెళ్ళు. లేకపోతే డిప్రెషన్ వస్తుంది నీకు.”

*

"పాపని నేను తీసుకుపోతాను. దాన్ని పెంచటం నీవల్లకాదు. నాకేం కష్టం వుండదు. వంటమనిషి... పనికి పిల్ల... మీ నాన్నగారూ... నేనూ... ఇందరం వున్నాం. నీకు వర్క్ పర్మిట్లు వచ్చాయంటున్నావ్, ఉద్యోగం చూసుకో... లేకపోతే చదువుకో. మొదట్లో పాపం చాలా 'స్ట్రెస్' అయింది నీకు. పాపని మేం పెంచుతాం. నువ్వు హాయిగా జాబ్ చేసుకో, లేదంటే చదువుకో. సతీష్ ఇప్పుడు చాలా మారాడు... చూస్తున్నాగా” అంది

“ఇంకో యువరాణిని తయారుచెయ్యండి” అంటున్నాడు సతీష్.

అవతలవైపు సతీష్  తండ్రి కాబోలు ఫోన్లో వున్నాడు. స్పీకర్ ఆన్ చేసి ఉన్నట్టుంది, వినబడుతోంది.

"పాపని వసుంధర గారితో పంపరా సతీష్. కొన్నాళ్ళు మేం కూడా చూసుకుంటాంలే... ఈ ఊరేగా.... అచ్చంగా ఆవిడ మీదే వదలం" అంటున్నాడు.

“ఇటు అయిదుగురు... అటు అయిదుగురు.. పదిమంది కలిసి పెంచండి. వండర్ఫుల్ నాన్నా... ఇప్పుడు కూడా మేమేంచెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్పటం మానుకోరా? మమ్మల్ని కాస్తంతయినా ఆలోచించుకోనివ్వరా? వదిలెయ్యండి నాన్నా. ఇప్పటికైనా మమ్మల్ని  కాస్త స్వతంత్రంగా మాదైన వ్యక్తిత్వంతో బతకనివ్వండి. మంచీ చెడూ ఆలోచించాల్సిన అవసరం మాకు రానివ్వండి... ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి" అని ఫోన్ పెట్టేశాడు.


 "ఏం లేదు, ఇద్దరూ పని చేసుకుంటే త్వరగా ఇల్లు కొనుక్కోవచ్చు" అంటోంది వసుంధర.


 "ఏదో చేస్తాంలే అమ్మా. నువ్వు కూల్ గా వుండు. సతీష్  వాళ్ళ నాన్నకి చెప్పింది. విన్నావు కదా?" అని అక్కడినించి వెళ్ళిపోయింది వసంత.


"ఇదేమిటీ?" ఆశ్చర్యంగా అనుకుంది వసుంధర. ఈ ఎదురుచెప్పడం, అదివరకులేదు మరి.

(ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 2006)

కామెంట్‌లు